కమెడియన్ పృథ్వీని కాపాడిన మెగాస్టార్!
on Mar 9, 2020
30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీగా తెలుగు ప్రేక్షకులను తన హాస్యంతో అలరించి, అనూహ్య రీతిలో ఎస్వీబీసీ చైర్మన్ పదవిని అలంకరించి, అంతే అనూహ్యంగా ఆరు నెలల్లోనే ఆ పదవికి రాజీనామా చేసిన పృథ్వీరాజ్ ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం. కె. రాఘవేంద్రరావు వంటి దిగ్దర్శకుడు చైర్మన్‌గా పనిచేసిన తర్వాత ఆ పదవిని పృథ్వీకి కట్టబెట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్‌రెడ్డి. అదివరకు ఎస్వీబీసీ (శ్రీ వేకంటేశ్వర భక్తి చానల్)లో ఆర్థిక అవకతవకలు జరిగాయనీ, వాటి వెనుక ఎంత పెద్దవాళ్లున్నా బయటకు లాగుతానని పదవి చేపట్టిన తర్వాత పృథ్వీ ప్రకటించారు.
తన మాటలతో, ప్రవర్తనతో వివాదాల్లో ఉంటూ వస్తున్న ఆయన అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమాన్ని చులకన చేస్తూ మాట్లాడటం, పెయిడ్ ఆర్టిస్టులే ఆ ఉద్యమాన్ని నడుపుతున్నారని అనడం వివాదాన్ని రగిల్చింది. ఆయనపై సొంత పార్టీకే చెందిన మరో నటుడు పోసాని కృష్ణమురళి ఫైర్ అయ్యారు. ఆ తర్వాత స్వల్ప కాలానికే ఒక మహిళా ఉద్యోగినితో ఆయన అసభ్యకరంగా మాట్లాడారంటూ వెలుగు చూసిన ఆడియో టేపులు సంచలనం రేపాయి. ఒక భక్తి చానల్‌కు చైర్మన్‌గా ఉంటూ ఇలాంటి పనులు చేస్తారా?.. అంటూ ఆయనపై అంతా దుమ్మెత్తిపోశారు. ఆ టేపులో ఉన్నది తన గొంతు కాదనీ, తనను అపఖ్యాతి పాలు చేయడానికే ఎవరో కుట్రపన్ని ఆ టేపులు సృష్టించారనీ పృథ్వీ ఎంతగానో మొత్తుకున్నా ప్రయోజనం లేకుండాపోయింది. జగన్మోహన్‌రెడ్డి ఆదేశానుసారం ఆయన ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అంటే కేవలం ఆరు నెలలు తిరిగేసరికల్లా పదవి ఊడిపోయింది.
ఎస్వీబీసీలో అవకతవకలు బయటపెడతానన్న ఆయనే అవమానకర రీతిలో ఆ చానల్ నుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలో తాను తీవ్ర మానసిక వ్యధకు లోనయ్యాననీ, అప్పటివరకూ తన చుట్టూ రోజూ నలభై మంది వరకూ తిరుగుతూ ఉండేవారనీ, చైర్మన్ పదవికి రాజీనామా చేశాక, వారిలో ఒక్కరు కూడా కనిపించకుండా పోయారనీ ఆయన వాపోయారు. చిరంజీవి లేకపోతే తాను ఆత్మహత్య చేసుకొనేవాడినని ఇటీవల ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్వీ పేర్కొనడం గమనార్హం. డిప్రెషన్‌లో ఉన్న తనకు చిరంజీవి ఆలంబనగా నిలిచారనీ, ఆచార్య మూవీలో అవకాశం ఇప్పించారనీ ఆయన తెలిపారు. ఏదేమైనా రాజకీయాలంటే ఆషామాషీ వ్యవహారం కాదని పృథ్వీకి తెలిసి వచ్చిందనుకోవచ్చు. ప్రస్తుతానికి రాజీకీయాలను పక్కనపెట్టి, తనను ఇంతవాడిని చేసిన సినిమాలపై ఆయన దృష్టి పెడుతున్నారు.
Also Read