దర్శకుడు సూర్యకిరణ్ కన్నుమూత.. కారణం ఇదే!
on Mar 11, 2024
టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు సూర్యకిరణ్ కన్ను మూశారు. పచ్చకామెర్లు రావడంతో చికిత్స పొందుతూ సోమవారం నాడు ఆయన చెన్నైలో తుదిశ్వాస విడిచారు.
తమిళ్ లో పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న సూర్యకిరణ్.. తెలుగులో 'సత్యం' చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. నటుడిగా ఆయన మాస్టర్ సురేష్ గా ప్రేక్షకులకు పరిచయం. చైల్డ్ ఆర్టిస్ట్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందల సినిమాల్లో నటించారు. 'సత్యం' సినిమాతో దర్శకుడిగా మారిన తర్వాత సూర్యకిరణ్‌గా పేరు మార్చుకున్నారు. సుమంత్ హీరోగా రూపొందిన 'సత్యం' మూవీ.. 2003 డిసెంబర్ లో విడుదలై ఘన విజయం సాధించింది. ఆ తర్వాత సుమంత్ తోనే 'ధన 51' చిత్రాన్ని రూపొందించిన సూర్యకిరణ్.. అనంతరం 'బ్రహ్మాస్త్రం', 'రాజుభాయ్', 'చాప్టర్ 6' వంటి సినిమాలను డైరెక్ట్ చేశాడు. అయితే అవేవీ 'సత్యం' స్థాయిలో విజయం సాధించకపోవడంతో.. దర్శకుడిగా ఆయనకు పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ 'సత్యం' సినిమా రూపంలో ఆయన ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రముఖ నటి కళ్యాణిని సూర్యకిరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఏవో కారణాల వల్ల ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు.
నటుడిగా, దర్శకుడిగా పలు అవార్డులు అందుకున్న సూర్యకిరణ్.. తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లోనూ కంటెస్టెంట్ గా అలరించారు. అప్పుడప్పుడు టీవీ షోల ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్న ఆయన.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలో మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Also Read