అసిస్టెంట్ చేతిలో తన్నులు తిన్న స్టార్ డైరెక్టర్!
on Jan 21, 2021
హృతిక్ రోషన్‌తో 'బ్యాంగ్ బ్యాంగ్', 'వార్' లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు తీసి, ప్రస్తుతం బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌తో 'పఠాన్' సినిమా చేస్తున్నాడు స్టార్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్. అతను ఓ అసిస్టెంట్ డైరెక్టర్ చేతిలో దెబ్బలు తినడం టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది. తెలుగు దర్శకుల్లో తేజకు ఎంత టెంపర్మెంట్ ఉందని పేరుందో, సిద్ధార్థ్ ఆనంద్‌కూ అంతే పేరుంది. సెట్స్‌పై ఎవరైనా తనను డిస్టర్బ్ చేసినా, తను చెప్పిన మాట వినకపోయినా ఆవేశంతో ఊగిపోతాడు సిద్ధార్థ్. లేటెస్ట్గా 'పఠాన్' సెట్స్‌పై చోటు చేసుకున్న ఘటన అక్కడున్న ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురిచేసింది.
బాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం, సెట్స్‌పై వర్క్ జరుగుతున్నప్పుడు తన అసిస్టెంట్ డైరెక్టర్లలో ఒకతని ప్రవర్తన సిద్ధార్థ్‌కు నచ్చలేదు. యూనిట్ మెంబర్స్‌లో ఎవరినీ సెట్స్ మీదకు సెల్‌ఫోన్స్ తీసుకురావద్దని మొదటే అతను హెచ్చరించాడు. కానీ అతని మాటను సదరు అసిస్టెంట్ లెక్కచేయలేదు. ఇది సిద్ధార్థ్ దృష్టికి రావడంతో, అతడిని పిలిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు సిద్ధార్థ్.
ఆ కొద్దిసేపు షూటింగ్ ఆగింది. తర్వాత పరిస్థితి మామూలుగా అయిపోయిందనుకొనేంతలో వ్యవహారం మరింత ముదిరింది. ఆ అసిస్టెంట్ డైరెక్టర్ పక్కవాళ్లతో సిద్ధార్థ్ గురించి చులకనగా మాట్లాడాడు. ఇది సిద్ధార్థ్ చెవినపడింది. దాంతో అతను అసిస్టెంట్ దగ్గరకు విసురుగా వెళ్లి, చెంప చెళ్లుమనిపించాడు. ఆ అసిస్టెంట్ మహా ముదురులాగున్నాడు. తిరిగి అతనూ సిద్ధార్థ్‌ను లాగి కొట్టాడు. దాంతో కొద్దిసేపు ఇద్దరూ కలబడ్డారు. యూనిట్ మెంబర్స్ ఇద్దరినీ విడదీశారు. ఆ రోజు అక్కడ షూటింగ్ నిలిచిపోయింది. అప్పటికప్పుడు తన టీమ్ నుంచి ఆ అసిస్టెంట్‌ను తీసేశాడు సిద్ధార్థ్.
షారుఖ్ ఖాన్ సరసన నాయికగా దీపికా పడుకోనే నటిస్తోన్న 'పఠాన్' సినిమాకు విశాల్-శేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు.