నన్ను బూతులు తిట్టడం వల్లే ‘రాజా సాబ్’లాంటి భారీ సినిమా వస్తోంది!
on Dec 11, 2025
చిత్ర పరిశ్రమలో కొందరు దర్శకులు కొన్ని రకాల సినిమాలకే పరిమితం అవుతుంటారు. వాళ్లు ఎలాంటి సినిమాతో విజయం సాధించారో ఆ తర్వాత కూడా అదే తరహా సినిమా చెయ్యాలంటూ హీరోలు, నిర్మాతలు కోరుతుంటారు. కానీ, దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ, కృష్ణవంశీ వంటి దర్శకులు మాత్రమే ఏ జోనర్ సినిమా అయినా చేసి ప్రేక్షకుల్ని మెప్పించగలరు. కానీ, ఒకే తరహా సినిమాలు చేసే డైరెక్టర్లు తమ ట్రాక్ మార్చి మరో జోనర్‌లో సినిమాలు చేసి బాగా దెబ్బ తిన్నవారు కూడా ఉన్నారు.
ఫలానా జోనర్‌లోనే సినిమా చెయ్యగలడు అనే ముద్ర పడిన తర్వాత దాని నుంచి బయటికి రావడం అంత ఈజీ కాదు. కానీ, డైరెక్టర్ మారుతి విషయంలో అది సులభం అయింది. అది కూడా ప్రేక్షకులు, ఇండస్ట్రీలోని కొందరు, మీడియా మారుతిని తిట్టడం వల్ల అతన్నుంచి డిఫరెంట్ జోనర్ సినిమాలు వస్తున్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో చేస్తున్న ‘ది రాజా సాబ్’ దానికి ఉదాహరణ. తనను తిట్టడం వల్లే ప్రభాస్ వంటి టాప్ హీరోతో భారీ సినిమా చెయ్యగలుగుతున్నానని ఒక వేదికపై స్వయంగా చెప్పారు మారుతి.
2012లో వచ్చిన ‘ఈరోజుల్లో’ చిత్రంతో దర్శకుడిగా మారారు మారుతి. ఈ సినిమాకి నిర్మాత కూడా ఆయనే. 54 లక్షల్లో నిర్మించిన ఈ సినిమా 18 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఆ తర్వాత చేసిన ‘బస్‌స్టాప్’ చిత్రం కూడా సూపర్‌హిట్ అయింది. అయితే ఈ రెండు సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్స్, అడల్ట్ కంటెంట్ ఉండడంతో ప్రేక్షకుల నుంచి, మీడియా నుంచి చాలా విమర్శలు ఎదుర్కొన్నారు మారుతి.
డైరెక్టర్‌గా క్లీన్ ఇమేజ్ తెచ్చుకునే ప్రయత్నంలో తన దగ్గర సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న జె.ప్రభాకరరెడ్డి డైరెక్షన్‌లో ‘ప్రేమకథా చిత్రమ్’ మూవీని నిర్మించారు. రెండున్నర కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా 20 కోట్లు కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే డైరెక్టర్‌గా తన సినిమాటోగ్రాఫర్ పేరు వేసినా చేసింది మాత్రం మారుతీయేనని ఇండస్ట్రీలోని అందరికీ తెలుసు. ఎలాంటి బూతులు లేకుండా సినిమా చేసి సూపర్‌హిట్ చెయ్యగలనని ఆ సినిమాతో ప్రూవ్ చేసుకున్నారు మారుతి.
తను చేసిన మొదటి రెండు సినిమాలను వదిలేస్తే.. తర్వాత చేసిన సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి పేరు తెచ్చుకున్నారు మారుతి. డైరెక్టర్‌గా పది సినిమాలు చేసిన తర్వాత రెబల్‌స్టార్ ప్రభాస్‌తో ‘ది రాజా సాబ్’ వంటి పాన్ ఇండియా మూవీ చేసే ఛాన్స్ వచ్చింది. తను ఈ స్థాయికి రావడానికి ప్రేక్షకుల తిట్లే కారణమని, తన మొదటి రెండు సినిమాలు చూసి కొందరు బూతులు తిట్టారని అన్నారు. దాంతో తనకు పట్టుదల పెరిగి అందరూ మెచ్చే సక్సెస్‌ఫుల్ మూవీస్ చేసే స్థాయికి వచ్చానని వివరించారు మారుతి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



