ఆ విలన్.. యశ్ బాడీగార్డ్!
on Jan 7, 2021
ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయగా యశ్ హీరోగా నటించిన 'కేజీఎఫ్' ఫిల్మ్ కన్నడ భాషా చిత్రసీమలో సరికొత్త రికార్డులు సృష్టించింది. అంతే కాదు.. దాని తెలుగు, తమిళ, హిందీ డబ్బింగ్ వెర్షన్లు సైతం విజయం సాధించడంతో అది ప్యాన్ ఇండియా ఫిల్మ్‌గా, యశ్ ప్యాన్ ఇండియా స్టార్‌గా మారారు. యశ్ పోషించిన రాకీ క్యారెక్టర్‌కు లక్షలాది మంది అభిమానులయ్యారు. ఆ సినిమాలో రాకీ క్యారెక్టర్‌కు ధీటుగా పాపులర్ అయిన మరో క్యారెక్టర్.. గరుడ. కోలార్ గోల్డ్ మైన్స్ (కేజీఎఫ్)కు మకుటంలేని మహారాజుగా చలామణీ అయ్యే విలన్ క్యారెక్టర్ అది. ఆ క్యారెక్టర్‌లో రామ్ అనే నటుడు మెరుపులా మెరిశాడు. తన గంభీరమైన ఆకారం, నటనతో గరుడ పాత్రకు గొప్పగా న్యాయం చేశాడు.
ఇంతకీ ఈ రామ్ ఎవరో తెలుసా? యశ్‌కు స్వయానా బాడీగార్డ్! ఆ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. చాలా కాలంగా యశ్‌కు సన్నిహితంగా, అతనికి బాడీగార్డ్‌గా రామ్ వ్యవహరించాడంట. 'కేజీఎఫ్' స్టోరీ గురించి యశ్‌తో డిస్కస్ చేయడానికి వెళ్లిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కళ్లల్లో రామ్ పడ్డాడు. గరుడ పాత్రకు కావాల్సిన రూపం అతనికి ఉందని ప్రశాంత్‌కు అనిపించింది. ఆడిషన్స్ కూడా నిర్వహించి ఓకే చేసేశాడు. గరుడ క్యారెక్టర్ కోసం జిమ్‌లో బాగా శ్రమించి, మేకేవర్ అయ్యాడు రామ్.
'కేజీఎఫ్'లో తానూ ఓ భాగమవడం తనకు ఓ కలగా అనిపిస్తుంటుందని, మొదటిసారే ఇలాంటి పెద్ద పాత్ర వచ్చి, తను ఫేమస్ అవుతానని ఏమాత్రం ఊహించలేదనీ ఓ ఇంటర్వ్యూలో అతను చెప్పుకొచ్చాడు. 'కేజీఎఫ్' తర్వాత రామ్‌కు పెద్ద పెద్ద సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి. వాటిలో కార్తి సినిమా 'సుల్తాన్' కూడా ఉంది.