ప్రముఖ డబ్బింగ్ చిత్రాల రచయిత శ్రీరామకృష్ణ మృతి!
on Apr 2, 2024
చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ఎన్నో అనువాద చిత్రాలకు మాటలు రాసి రచయితగా తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకున్న శ్రీరామకృష్ణ(74) గత రాత్రి కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను చెన్నయ్‌లోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే తుది శ్వాస విడిచారు. కెరీర్‌లో 300కి పైగా సినిమాలకు శ్రీరామకృష్ణ రచయితగా వ్యవహరించారు.
ఒక భాషలో సూపర్‌హిట్ అయిన సినిమాను మరో భాషలోకి డబ్ చేసి రిలీజ్ చెయ్యాలంటే ఆ సినిమాకి పనిచేసే రచయిత ఎంతో టాలెంటెడ్ అయి ఉండాలి. ఎందుకంటే ఒరిజినల్ లాంగ్వేజ్‌లో రాసిన మాటలను అంతే అర్థవంతంగా మరో భాషలో రాసినపుడే ఆ సినిమాకి అందం వస్తుంది. సినిమా కూడా విజయవంతం అవుతుంది. అలాంటి ఎన్నో విజయవంతమైన అనువాడ చిత్రాలకు మాటలు రాసి రచయితగా గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న శ్రీరామకృష్ణ గత రాత్రి తిరిగి రాని లోకాలకు పయనమయ్యారు. శ్రీరామకృష్ణ స్వస్థలం తెనాలి. సినిమాలపై మక్కువతో 50 ఏళ్ల కిందట చెన్నయ్ వచ్చిన శ్రీరామకృష్ణ అక్కడే స్థిరపడ్డారు. శ్రీరామకృష్ణకు భార్య స్వాతి, కుమారుడు గౌతమ్ ఉన్నారు.
జెంటిల్‌మెన్, అపరిచితుడు, జీన్స్, ఒకే ఒక్కడు తెలుగు వెర్షన్స్‌కు శ్రీరామకృష్ణ డైలాగ్స్ రాశారు. అంతేకాదు, ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహించిన అన్ని సినిమాలకు తెలుగు వెర్షన్ డైలాగ్స్ రాసింది శ్రీరామకృష్ణే. డబ్బింగ్ సినిమాల్లో శ్రీరామకృష్ణ రాసిన డైలాగ్స్ ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. డబ్బింగ్ అనే ఫీల్ ఆడియన్స్‌కి రానివ్వకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. శంకర్ వంటి డైరెక్టర్ చేసిన సినిమాల్లోని పొలిటికల్ డైలాగ్స్‌ను పవర్‌ఫుల్‌గా రాయడం, మణిరత్నం వంటి డైరెక్టర్ల సినిమాల్లోని ప్రేమ పూరిత డైలాగులను ఎంతో అందంగా రాయడం శ్రీరామకృష్ణకే సాధ్యమైంది. రజనీకాంత్, కమల్‌హాసన్, విక్రమ్, అజిత్ వంటి స్టార్ హీరోలందరి డబ్బింగ్ సినిమాలకు శ్రీరామకృష్ణ డైలాగ్ రైటర్‌గా పనిచేశారు. డైలాగ్ రైటర్‌గానే కాదు, కొన్ని సినిమాల్లో పాటలు కూడా రాశారు శ్రీరామకృష్ణ. ‘ప్రేమిస్తే’ చిత్రంలో టైటిల్ సాంగ్‌ను ఆయనే రాశారు. దర్శకుడుగా బాలమురళీ ఎం.ఎ., సమాజంలో స్త్రీ చిత్రాలను రూపొందించారు. శ్రీరామకృష్ణ మృతి పట్ల టాలీవుడ్, కోలీవుడ్‌లోని ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. మంగళవారం సాయంత్రం చెన్నయ్‌లో శ్రీరామకృష్ణ అంత్యక్రియలు జరుగుతాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



