Home

»

Latest News

Dhurandhar 2 :ధురంధర్ 2కి  ఢిల్లీ హైకోర్టు షాక్.. దేశ భద్రతకే ముప్పా!

May 20, 2026

 భవిష్యత్తులో పాఠ్య పుస్తకాల్లో చేర్చే అంత రేంజ్ లో ధురంధర్ 2(Dhurandhar 2) సాధించిన సంచలన విజయం తెలిసిన విషయమే. ఈ బ్లాక్‌బస్టర్ మూవీ ఇప్పుడు ఊహించని చట్టపరమైన ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఈ చిత్రంలో చూపించిన కొన్ని కీలకమైన సన్నివేశాలు భారతదేశ సార్వభౌమత్వానికి, జాతీయ భద్రతకి  ముప్పు కలిగించేలా ఉన్నాయంటూ ఢిల్లీ హైకోర్టు(Delhi Highcourt)లో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దేశ రక్షణ రహస్యాలకి  సంబంధించిన ఈ వ్యవహారం ఇప్పుడు భారత చిత్ర పరిశ్రమతో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర సంచలనంగా మారింది.

ఈ పిటిషన్‌ని సశస్త్ర సీమా బల్ (SSB) సంస్థలో హెడ్ కానిస్టేబుల్ (కమ్యూనికేషన్స్) విభాగంలో పనిచేస్తున్న దీపక్ కుమార్ అనే జవాన్ ఢిల్లీ హైకోర్టులో స్వయంగా దాఖలు చేశాడు. మూవీలో చూపించిన కొన్ని మిలిటరీ ఆపరేషన్ దృశ్యాలు, వ్యూహాత్మక వివరాలు దేశ రక్షణ చట్టమైన ‘అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్’ (Official Secrets Act) నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. భారత సాయుధ దళాల అత్యంత రహస్యమైన యుద్ధ వ్యూహాలు మరియు ఆపరేషన్ల వివరాలని  వినోదం పేరుతో బహిర్గతం చేయడం సరికాదని ఆయన వాదించాడు 

ఈ చిత్రం కేవలం ఒక కల్పిత కథ (ఫిక్షన్) అని వినోదం కోసమే నిర్మించామని మేకర్స్ చెబుతున్నప్పటికీ, కోర్టు మాత్రం ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించింది. ఈ కేసును విచారించిన చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియాలతో కూడిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ (MIB) మరియు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. సినిమా కల్పితమే అయినప్పటికీ, సమాజంపై మరియు దేశ భద్రతపై దాని ప్రభావాన్ని మనం తోసిపుచ్చలేమని, భద్రతా దళాల ఉద్యోగి లేవనెత్తిన ఆందోళనల్లో సహేతుకమైన కారణాలు ఉన్నాయని ధర్మాసనం స్పష్టం చేసింది.

పిటిషనర్ దీపక్ కుమార్ తన వాదనలో మరికొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టారు. మన దేశానికి చెందిన అండర్ కవర్ ఏజెంట్లు విదేశాల్లో ఎలా ప్రాణాలను పణంగా పెట్టి జీవిస్తారో, వారి నెట్‌వర్క్ ఎలా పనిచేస్తుందో ఈ సినిమాలో వివరంగా చూపించారని పేర్కొన్నారు. అంతేకాకుండా, గతంలో విజయవంతంగా ముగిసిన కొన్ని రహస్య ఆపరేషన్ల యొక్క లొకేషన్లు మరియు కీలక సమాచారాన్ని కూడా ఇందులో డిస్క్లోజ్ చేశారని తెలిపారు. అలాగే, భారత రక్షణ పరిశోధన సంస్థ అయిన ‘డీఆర్డీవో’ (DRDO) అత్యంత రహస్యంగా పరిశోధనలు చేస్తున్న కొన్ని ప్రత్యేక రసాయనాలు లేదా డ్రగ్స్ గురించిన సున్నితమైన వివరాలను కూడా సినిమాలో పొందుపరిచారని, ఇది శత్రు దేశాలకు క్లూ ఇచ్చినట్లు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Also read: Peddi: తమిళ్, మలయాళ బాక్స్ ఆఫీస్ పై పెద్ది దండయాత్ర మొదలు  


గతంలో ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ సమయంలో సెన్సార్ బోర్డు భారతదేశ వెర్షన్ కోసం దాదాపు 6 నిమిషాల కంటే ఎక్కువ నిడివి గల హింసాత్మక సీన్లను కట్ చేసింది. అయినప్పటికీ, ఇలాంటి జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన సినిమాలకు అనుమతులు ఇచ్చేటప్పుడు సెన్సార్ బోర్డు దేశ రక్షణ నిపుణులను లేదా ఇంటెలిజెన్స్ అధికారులను సంప్రదించకపోవడంపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, ఢిల్లీ హైకోర్టు ఈ పిటిషన్‌ని  ఒక అధికారిక వినతిపత్రంగా పరిగణించి, దీనిపై తగిన సమీక్ష జరిపి వీలైనంత త్వరగా తుది నిర్ణయం తీసుకోవాలని సెన్సార్ బోర్డుని  కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖని ఆదేశించింది. 

 


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com