Home

»

Latest News

అనిరుధ్ పెళ్లి, రిసెప్షన్‌కు డుమ్మా.. ధ‌నుష్ తీరుపై కోలీవుడ్‌లో చ‌ర్చ‌.!

Nov 22, 2026 5:01PM

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ పెళ్లి వేడుకకు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హాజరుకాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అనిరుధ్, కావ్య మారన్ నవంబర్ 11న గ్రీస్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అనంతరం నవంబర్ 21న చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళ హోటల్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ వేడుకలో ధనుష్ కనిపించకపోవడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

నిజానికి అనిరుధ్ సినీ కెరీర్ ప్రారంభం కావడానికి ధనుష్ ఎంతో కీలకంగా వ్యవహరించారు. 2012లో ధనుష్ హీరోగా నటించిన '3' సినిమాతో అనిరుధ్ సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమాలోని 'వై దిస్ కొలవెరి డి' పాట ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో 'వేలై ఇల్లా పట్టధారి', 'మారి', 'తంగమగన్' వంటి సినిమాలు వచ్చాయి. దీంతో ధనుష్, అనిరుధ్ మధ్య మంచి స్నేహం ఏర్పడింది. వీరిద్దరి కాంబినేషన్‌కు అభిమానులు 'డీఎన్ఏ' అనే పేరు కూడా పెట్టుకున్నారు.

అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల అనిరుధ్ తన సంగీత ప్రయాణంలో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా తనకు అవకాశాలు ఇచ్చినవారికి, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. కానీ తనకు తొలి అవకాశం ఇచ్చిన ధనుష్ పేరును ప్రస్తావించకపోవడంతో ఈ చర్చ మరింత పెరిగింది. గతంలో అనిరుధ్ తన సంగీత ప్రయాణానికి ధనుష్ కారణమంటూ కృతజ్ఞతలు తెలిపిన విషయాన్ని కూడా అభిమానులు గుర్తుచేస్తున్నారు.

మరోవైపు అనిరుధ్ పెళ్లి వేడుకకు కూడా ధనుష్ హాజరుకాలేదు. అయితే అప్పట్లో ఆయన సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉండటంతో గ్రీస్‌కు వెళ్లలేకపోయారని, కనీసం చెన్నై రిసెప్షన్‌కైనా వస్తారని అభిమానులు భావించారు. కానీ అక్కడ కూడా ధనుష్ కనిపించకపోవడంతో ఇద్దరి మధ్య నిజంగానే దూరం పెరిగిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై ఇప్పటివరకు ధనుష్ కానీ, అనిరుధ్ కానీ స్పందించలేదు. దీంతో ఈ ఇద్దరు స్నేహితుల మధ్య అసలు ఏం జరిగిందనే ఆసక్తి కోలీవుడ్‌లో నెలకొంది.

 

 

[Dhanush, AnirudhRavichander, DhanushAnirudhRift, AnirudhWeddingReception, KavyaMaran] 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com