వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్.. శేఖర్ కమ్ముల సినిమా వెనక్కి!
on Dec 22, 2021

కోలీవుడ్ స్టార్ ధనుష్ టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు, తమిళ్ తో పాటు పలు భాషల్లో తెరకెక్కనుంది. అయితే ఇది తన డైరెక్ట్ మొదటి తెలుగు సినిమా కాదని తాజాగా ట్విస్ట్ ఇచ్చాడు ధనుష్. ఇప్పుడు మరో టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు ధనుష్. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ సినిమా అంటూ కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. తాజాగా ఈ వార్తలను నిజం చేస్తూ సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ వీరి కాంబినేషన్ లో సినిమాని ప్రకటించింది. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సితార బ్యానర్ నిర్మించనున్న ఈ సినిమాకి నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. తెలుగు, తమిళ భాషల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా టైటిల్ లుక్ ని రేపు(డిసెంబర్ 23) ఉదయం 9:36 కి విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ మూవీ గురించి ధనుష్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. తన నెక్స్ట్ సినిమా టైటిల్ ప్రకటన రేపు రానుందని, డైరెక్ట్ తెలుగులో తాను చేస్తున్న మొదటి సినిమా ఇదేనని ధనుష్ ట్వీట్ లో పేర్కొన్నాడు. ధనుష్ ట్వీట్ ని బట్టి చూస్తే.. ముందు ప్రకటించిన శేఖర్ కమ్ముల సినిమా వెనక్కి వెళ్లిందని, దానికన్నా ముందు వెంకీ అట్లూరి సినిమా రానుందని అర్థమవుతోంది.

వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'తొలిప్రేమ' సినిమాతో వెంకీ అట్లూరి దర్శకుడిగా పరిచయమయ్యాడు. మొదటి సినిమాతో విజయాన్ని అందుకున్న ఈ యంగ్ డైరెక్టర్ ఆ తర్వాత 'మిస్టర్ మజ్ను', 'రంగ్ దే' సినిమాలతో నిరాశపరిచాడు. దర్శకుడిగా మొదటి మూడు సినిమాలు యూత్ ఫుల్ సబ్జెక్ట్స్ తో వచ్చిన వెంకీ.. ధనుష్ తో ఎలాంటి సబ్జెక్ట్ చేస్తాడో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



