బహుదూరపు బాటసారి – దాసరికి వీడ్కోలు
on May 31, 2017
తెలుగు చిత్రపరిశ్రమని కాచుకుని ఉండే ఓ స్పర్శ దూరమైంది. తెలుగునాట ఇంటింటా ఒక ఆత్మబంధువుని కోల్పోయినంతగా విషాదం చోటుచేసుకుంది. తెలుగువారికి ఏ సమస్య వచ్చినా, తన ధిక్కార స్వరాన్ని వినిపించే దాసరి మాటని ఇక వినలేము. శ్రమని నమ్ముకుంటూ ఆయన సాధించిన విజయాల బాటలో నడవటం తప్ప... ఇక ఆయనతో కలిసి అడుగులు వేయలేము.
దాసరిని ఇంతగా తల్చుకోవాల్సిన అవసరం ఏముంది? అన్న ప్రశ్నకు ఆయన జీవితమే జవాబుగా నిలుస్తుంది. ఒకటి కాదు రెండు కాదు 45 ఏళ్ల క్రితమే మెగాఫోన్ పట్టుకుని తెలుగు సినిమాకి ఒక కొత్త దిశని అందించిన ఘనత ఆయనది. పది కాదు ఇరవై కాదు, 150 చిత్రాలకు దర్శకత్వం వహించి రికార్డులు బద్దలుకొట్టిన చరిత్ర ఆయనది. తొలి సినిమా ‘తాతామనవడు’తోనే దాసరి తానేమిటో నిరూపించుకున్నారు. ఆ తర్వాత నుంచి దాసరి అవకాశాల కోసం ఎదురుచూడలేదు, అవకాశాలే దాసరి కోసం ముందుకొచ్చాయి.
తన తొలి చిత్రం నుంచి దాసరి ఏం చేసినా సంచలనంగానే ఉండేది. కమేడియన్‌ను హీరోగా పెట్టి ‘తాతామనవడు’ తీసిన దగ్గర్నుంచీ దొరల దీష్టీకం మీద ‘ఒసేయ్ రాములమ్మ!’ వరకూ ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కొత్తదనం ఉండేది. ఒకపక్క ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ వంటి అగ్రతారలకు హిట్లు మీద హిట్లను అందిస్తూనే... మోహన్‌బాబు, మురళీమోహన్ వంటి నటులు నిలదొక్కుకునేందుకు కావల్సినన్ని అవకాశాలు ఇచ్చేవారు. ఒక వైపు ‘సర్దార్ పాపారాయుడు’లాంటి కమర్షియల్ హిట్లు కొడుతూనే ‘సూరిగాడు’లాంటి చిత్రాలతో కథకి పట్టం కట్టేవారు.
ఓ గొప్ప దర్శకుని స్థాయిని చేరుకోవడమే అసాధ్యం అనుకుంటే... కథా, స్ర్కీన్‌ప్లే, మాటలు, పాటలు రాయగలిగే మేటి రచయితగా దాసరి చూపిన ప్రతిభ అసమానం. ‘గాలివానలో వాననీటిలో పడవప్రయాణం’ అంటూ విషాదాన్ని పలికించినా, ‘ఒక లైలా కోసం’ అంటూ హుషారు రేకెత్తించినా అది ఆయనకే సొంతం. ఈ పాటలన్నీ దాసరే రాశారంటే అప్పట్లో జనం నమ్మేవారు కాదు. దర్శకుడనేవాడు ఇన్ని పనులు ఎలా చేయగలడు అని ముక్కున వేలేసుకునేవారు. గొప్ప పాటలే కాదు... ‘బొబ్బిలిపులి’గా గర్జించినా ‘కంటే కూతుర్నే కను’తో కంటతడి పెట్టించినా మనసుని కదిలించే కథలెన్నో పలికించారు దాసరి.
తెరవెనుక దాసరి ఒక ప్రభంజనం. అలాంటి వ్యక్తి ఇక తెర మీద కూడా విజృంభిస్తే చెప్పేదేముంది. బహుశా మరే దర్శకుడూ కూడా ఆయన పోషించినన్ని ప్రధాన పాత్రలు పోషించలేదేమో! మామగారు దగ్గర నుంచీ మేస్త్రీ వరకు ఆయన జీవమిచ్చిన పాత్రలు, ఆ పాత్రలకు లభించిన అవార్డులే ఇందుకు సాక్ష్యం. అందుకే ఒకప్పుడు తెలుగునాట దాసరికి సైతం ఊరూరా అభిమాన సంఘాలు ఉండేవి. హీరోతో సమానంగా ఆయనకు జేజేలు పలికేవి.
విజయం ఎలాంటవారికైనా పలకరించే అవకాశం ఉంది. కానీ నిబద్ధత ఉన్నవారి దగ్గరే అది నిలిచి ఉంటుంది. దాసరి జీవితమే ఇందుకు ఉదాహరణగా కనిపిస్తుంది. ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్న నేపథ్యం వల్ల కావచ్చు, సినీరంగం పట్ల ఉన్న తపన వల్ల కావచ్చు... కారణం ఏదైనా, దాసరి పట్టుసడలని క్రమశిక్షణతో మెలిగేవారు. అందుకే ఆయనతో కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిచేవారు.
తెర మీదే కాదు, నిజజీవితంలోనూ దాసరి నాయకుడిగా నిలిచారు. సినీరంగంలో కార్మికులకు ఏ కష్టం వచ్చినా, ఏ వివాదం చెలరేగినా... దాసరి పరిష్కారం చూపేవారు. పత్రికలన్నీ పాలకుల పక్షంగా మారిపోయిన రోజున ‘ఉదయం’ పత్రికను స్థాపించి తనే ప్రతిపక్షమై నిలిచారు. చిన్న చిత్రాలు ఎక్కడ కనిపించినా, వాటికి తానే ప్రచారకర్తగా మారేవారు. దాసరి జీవితం ఇంత ఉన్నతం కాబట్టి.... ఆయనను ప్రత్యర్థులు సైతం పెద్దన్నగానే భావించేవారు. అలాంటి దాసరి ఇక లేరన్న వార్త తెలుగువారికి శరాఘాతమే! ఎంతటి మనిషికైనా మరణం తప్పదు కదా! కానీ మరణం అతనికి చేరువయ్యేలోగా అతను ఎంతైనా సాధించగలడనే దానికి దాసరి జీవితమే ఓ ఉదాహరణ! అదే మనకు ప్రేరణ!
- నిర్జర.