'కర్రీ అండ్ సైనైడ్' రివ్యూ
on Dec 27, 2023

టైటిల్: కర్రీ అండ్ సైనైడ్
తారాగణం: జాలీ జోసెఫ్, రెమో రాయ్, కె.జి సిమన్, మేఘన శ్రీవాస్తవ్, రోజో థామస్, రెంజీ విల్సన్, నిఖిలా హెన్రీ, సి.ఎస్ చంద్రిక, బి.ఏ అలూర్ తదితరులు
స్క్రీన్‌ప్లే: షాలిని ఉషాదేవీ
సినిమాటోగ్రఫీ: షెహ్నాద్ జలాల్
ఎడిటింగ్: శృతి సుకుమారన్, ప్రవీణ్ ప్రభాకర్
మ్యూజిక్: తుషార్ లాల్
ప్రొడక్షన్: ఇండియా టుడే ఒరిజినల్స్
దర్శకత్వం: క్రిస్టో టామీ
ఓటీటీ: నెట్ ఫ్లిక్స్
ఈ మధ్య కాలంలో ఓటీటీ వేదికపై వచ్చిన సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో 'ధూత' ప్రేక్షకులకు ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లర్ ని ఇచ్చింది. ఇప్పుడు తాజాగా వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన 'కర్రీ అండ్ సైనైడ్.. జాలీ జోసెఫ్ కేస్' డాక్యుమెంటరీ చిత్రం ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో తెలుగులో అందుబాటులో ఉంది. మరి ఈ కథేంటో ఓసారి చూసేద్దాం..
కథ:
కేరళలోని కోజికోడ్ లోని కూడతైకి చెందిన జాలీ జోసఫ్‌కు 1997లో అదే ప్రాంతానికి చెందిన రాయ్ థామస్‌తో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఆమె అత్తింట్లో అడుగుపెట్టింది. మామ టామ్ థామస్, అత్త అన్నమ్మ థామస్‌లు ఇద్దరూ టీచర్లుగా పని చేసి రిటైర్డ్ అయ్యారు. మిగిలిన కుటుంబసభ్యులు కూడా ఉద్యోగాలు చేస్తున్నవారే. ఈ నేపథ్యంలో జాలీని కూడా ఉద్యోగం చేయమని అన్నమ్మ థామస్ పట్టుబట్టింది. అత్తపోరు పడలేక జాలీ ఎన్‌ఐటీ కోయికోడ్‌లో పని చేస్తున్నట్లు అందరిని నమ్మించింది. ప్రతీ రోజు కారులో ఉద్యోగానికి వెళ్లి వస్తున్నట్లు నటించేది. జాలీకి భర్త రాయ్ కుటుంబ ఆస్తిని పొందాలనుకుంది. ఎలాగైనా ఆస్తిని తన సొంతం చేసుకోవాలని అనుకుంది. ఇందుకోసం 2002లో మంచి నీళ్లలో సైనైడ్ కలిపి అన్నమ్మను హత్య చేసింది. దాంతో ఆ కుటుంబ భాద్యతలని జాలీ సొంతం చేసుకుంది. ఆ తర్వాత జాలీ ఆ ఆస్తిని పొందడానికి ఏం చేసింది? రాయ్ థామస్ ది ఆత్మహత్యనా? హత్యనా తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే.
విశ్లేషణ:
కేరళలో జరిగిన వాస్తవ సంఘటనలని కళ్ళకి కట్టినట్టు చూపించడంలో డైరెక్టర్ క్రిస్టో టామీ సక్సెస్ అయ్యాడు. ప్రతీ పాత్రని పరిచయం చేస్తూ ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసిన తీరు బాగుంది. కేసుకు సంబంధించి అన్ని వివరాలను బయటకు తీసుకురావటంలో లీగల్ చిక్కులు ఉండటంతో కొన్ని వివరాలను మాత్రమే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. డాక్యుమెంటరీ మొత్తం జాలీ జోసఫ్ కుటుంబం వైపు నుంచే నడుస్తుంది. కేసును ఇన్వెస్టిగేట్ చేసిన అధికారి కేటీ సిమోన్‌తో పాటు.. స్టోరీ మొత్తాన్ని జాలీ పెద్ద కుమారుడు రెమో, మరదలు రెంజీ విల్సన్, మరిది రోజో థామస్‌లు ప్రేక్షకులకు వివరించారు.
ప్రథమార్ధంలో జాలీ కుమారుడు రెమోకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇక జాలీ భర్త యొక్క చెల్లిని కూడా కథలో చూపించారు. డాక్యుమెంటరీ మొత్తం ఆరు హత్యలు ఎలా జరగాయన్న దాని మీద నడిచింది. దాదాపు గంట ముప్పై నిమిషాల నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీలో.. 20 ఏళ్ల కాలంలో జరిగిన నేరాలను క్షుణ్ణంగా వివరించి చెప్పే ప్రయత్నం చేయలేదు. సాధారణంగా హత్యలు జరిగినపుడు వాటిని డాక్యుమెంటరీగా చిత్రీకరిస్తున్నపుడు.. హత్యలు చేసిన వ్యక్తి గురించి, మానసిక పరిస్థితి గురించి వివరించే ప్రయత్నం జరుగుతుంది. కానీ, ఇందులో జాలీ గురించిన వ్యక్తిగత వివరాలని ఎక్కువగా చూపించలేకపోవడం మైనస్. ఇక ప్రతీ పాత్రని పరిచయం చేయడంతో మొదటి ఇరవై నిమిషాలు తీసుకున్నాడు డైరెక్టర్. ఇక్కడే కాస్త ఎక్కువ సాగదీసినట్టుగా అనిపిస్తుంది
క్యారెక్టర్స్ అన్ని ఒక్కొక్కటిగా వస్తూ ప్రేక్షకులకి జరిగింది చెప్పే ప్రయత్నంలో కాస్త కన్ఫ్యూషియస్ గా అనిపిస్తుంది. నిజాలని రాబట్టడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు చెప్పకపోవడం మైనస్. ఒక విలేజ్ లో చిన్న కుటుంబంలో పుట్టిన జాలీ.. ఆస్తి కోసం ఎందుకు హత్య చేసిందని, తన ఉద్దేశం ఏంటని మరింతగా చూపించి ఉంటే కథ ఇంకాస్త ఇంట్రస్ట్ గా ఉండేది. జాలీ జైలుకు వెళ్లిన తర్వాత కుటుంబం ఎలా ఉందన్న దాని గురించి కొంచెం ఎక్కువ ఫోకస్ చేసినట్లు కనిపిస్తుంది.
షాలినీ ఉషాదేవీ స్క్రీన్ ప్లే బాగుంది. తుషార్ లాల్ మ్యూజిక్ ఆకట్టుకుంది. శృతి సుకుమారన్ ఎడిటింగ్ నీట్ గా ఉంది. షెహ్నాద్ జలాల్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
జాలీ జోసెఫ్ అప్పట్లో ఉన్నప్పుడు ఎలా ఉండేదో అలానే చూపించడంతో చాలా సహజసిద్ధంగా అనిపిస్తుంది. ప్రతీ పాత్ర నిజమైనదే కాబట్టి అందరు సహజంగానే మాట్లాడారు.
తెలుగువన్ పర్ స్పెక్టివ్:
కేరళలో జరిగిన వాస్తవ సంఘటనలని కళ్ళకి కట్టినట్టు చూపించిన ఈ డాక్యుమెంటరీని ఒకసారి ట్రై చేయొచ్చు.
రేటింగ్: 2.75/5
✍️. దాసరి మల్లేశ్
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



