ENGLISH | TELUGU  

క‌రోనా వైర‌స్‌ ఎఫెక్ట్‌.. సినిమా ఇండ‌స్ట్రీ డిజాస్ట‌ర్‌!

on Mar 17, 2020

 

క‌రోనా వైర‌స్‌ను ప్ర‌పంచ మ‌హ‌మ్మారిగా ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యుహెచ్‌వో) ప్ర‌క‌టించిన త‌ర్వాత మ‌న‌దేశంలోనూ, ప్ర‌పంచంలోని అనేక ప్రాంతాల్లో సినీ ప‌రిశ్ర‌మ తీవ్ర కుదుపుకు గురైంది. ప్ర‌పంచంలోనే రెండో అతిపెద్ద బాక్సాఫీస్ మార్కెట్ క‌లిగిన చైనాలో సినిమా థియేట‌ర్ల‌ను నిర‌వ‌ధికంగా మూసివేయ‌డం ప్రారంభించ‌డంతో ఇది మొద‌లైంది. ఆ త‌ర్వాత హాలీవుడ్‌లో ఏప్రిల్ 8న రిలీజ్ కావాల్సిన‌ జేమ్స్‌బాండ్ సినిమా 'నో టైమ్ టు డై', మే 22న విడుద‌ల కావాల్సిన‌ 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్ 9' విడుద‌ల తేదీల‌ను వాయిదా వేయ‌డం ద్వారా ఈ ప‌రిస్థితి కొన‌సాగింది. ఆదివారం నెట్‌ఫ్లిక్స్‌, డిస్నీ సంస్థ‌ల‌తో పాటు యూనివ‌ర్స‌ల్ పిక్చ‌ర్స్ సంస్థ కూడా సినిమా షూటింగ్‌ల‌ను నిలిపివేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. అందులో భాగంగా ఫాంట‌సీ అడ్వంచ‌ర్ మూవీ 'జురాసిక్ వ‌ర‌ల్డ్‌:  డొమీనియ‌న్' షూటింగ్ నిలిచిపోయింది.

మ‌న‌దేశంలోనూ క‌రోనా వైర‌స్ వ్యాప్తిని నిరోధించ‌డంలో భాగంగా ఇప్ప‌టికే తెలంగాణ‌, మ‌హారాష్ట్ర‌, కేర‌ళ‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లో సినిమా షూటింగ్‌ల‌ను నిలిపివేశారు. సినిమా హాళ్ల‌ను మార్చి 31 వ‌ర‌కు మూసివేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఫ‌లితంగా రాజ‌మౌళి సినిమా 'ఆర్ఆర్ఆర్'‌, చిరంజీవి సినిమా 'ఆచార్య‌', అల్లు అర్జున్ - సుకుమార్ సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయి. మ‌హారాష్ట్ర‌లోనూ బాలీవుడ్‌, మ‌రాఠీ సినిమాల షూటింగ్‌లు మార్చి 19 నుంచి నిలిచిపోనున్నాయి.

సినిమా షూటింగ్‌లు నిలిచిపోవ‌డం వ‌ల్ల ఆయా సినిమాల నిర్మాత‌ల‌కు భారీ స్థాయిలో న‌ష్టం జ‌ర‌గ‌నున్న‌ది. చిన్న సినిమాల‌కు ల‌క్ష‌ల్లో, భారీ బ‌డ్జెట్ సినిమాల‌కు కోట్ల‌లో న‌ష్టం క‌ల‌గ‌నున్న‌ది. మ‌రోవైపు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప‌లు సినిమాల‌కు న‌ష్టం వాటిల్లింది. తెలంగాణ‌లో నితిన్ సినిమా 'భీష్మ'‌, విష్వ‌క్‌సేన్ సినిమా 'హిట్' బాగా ఆడుతున్న స‌మ‌యంలో సినిమా హాళ్ల‌ను మూసివేయ‌డంతో వాటి డిస్ట్రిబ్యూట‌ర్లు లాభాల‌ను కోల్పోయారు. రెండు వారాల క్రితం విడుద‌లైన డ‌బ్బింగ్ సినిమా 'క‌నులు క‌నుల‌ను దోచాయంటే'కు మంచి టాక్ వ‌చ్చి రెండో వారం క‌లెక్ష‌న్లు, థియేట‌ర్లు పెరిగాయ‌నుకుని ఆనంద‌ప‌డేంత‌లో థియేట‌ర్ల మూసివేత దెబ్బ కొట్టింది. 

గ‌త వారం విడుద‌లైన కొన్ని చిన్న సినిమాల్లో 'ప‌లాస 1978' చాలా బాగుంద‌ని టాక్ వ‌చ్చి, దానికి అనుగుణంగా వ‌సూళ్ల‌ను పెంచాల‌నే ఉద్దేశంతో చిత్ర బృందం థియేట‌ర్ల టూర్ జ‌రుపుతూ, క‌ష్ట‌ప‌డుతుండగా థియేట‌ర్ల మూసివేత షాక్‌నిచ్చింది. తెలంగాణ కంటే ముందుగానే చ‌త్తీస్‌గ‌ఢ్‌, కేర‌ళ‌, ఒడిశా, మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ రాష్ట్రాల్లో, జ‌మ్ము క‌శ్మీర్‌లో థియేట‌ర్ల‌ను మార్చి 31 వ‌ర‌కు మూసేశారు. ఫ‌లితంగా మార్చి 6న విడుద‌లైన‌ టైగ‌ర్ ష్రాఫ్ భారీ బ‌డ్జెట్ మూవీ 'బాఘీ 3' క‌లెక్ష‌న్ల‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డింది. తొలి వారంలోనే 90 కోట్ల రూపాయ‌ల‌ నెట్ వ‌సూలు చేసిన ఆ సినిమా ఎప్పుడో 100 కోట్ల రూపాయ‌ల‌ మార్కును దాటాల్సి ఉండ‌గా, ఇప్ప‌టికి 93 కోట్ల‌ రూపాయ‌ల‌తో స‌రిపెట్టుకుంది. అదేవిధంగా మార్చి 13న రిలీజ్ అయిన ఇర్ఫాన్ ఖాన్ మూవీ 'అంగ్రేజీ మీడియం' తొలి మూడు రోజుల్లో 9 కోట్ల రూపాయ‌లు వ‌సూలు చేసి, థియేట‌ర్ల మూసివేత‌తో అక్క‌డే నిలిచిపోయింది. ఆ సినిమా డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు చాలా మేర‌కు న‌ష్టం వాటల్లింది.

ఇలా బాక్సాఫీస్ న‌ష్టం, సినిమా షూటింగ్స్ నిలిపివేత‌తో న‌ష్టంతో పాటు సినిమా హాళ్ల‌ను మూసివేయ‌డంతో, వాటిపై ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఆధార‌ప‌డ్డ ల‌క్ష‌లాదిమంది కార్మికులు, ఉద్యోగులు ఆర్థికంగా న‌ష్ట‌పోతున్నారు. షూటింగ్స్ నిలిచిపోవ‌డంతో 24 క్రాఫ్టుల‌లో ప‌నిచేసే కార్మికులు ప‌నిలేక క‌ష్టాల పాల‌వ‌డం ఖాయం. ప్ర‌స్తుతానికి మార్చి 31 వ‌ర‌కు షూటింగ్‌లు నిలిపివేశారు. అప్ప‌టికి క‌రోనా వైర‌స్ ప్ర‌భావం త‌గ్గితే షూటింగ్‌లు మ‌ళ్లీ మొద‌ల‌వుతాయి. క‌రోనా ప్ర‌భావం కొన‌సాగితే, షూటింగ్‌ల నిలిపివేత‌ను పొడిగించే అవ‌కాశం ఉంది. ఏ రోజుకారోజు రెమ్యూన‌రేష‌న్‌కు ప‌నిచేసే వాళ్ల ఆర్థిక ప‌రిస్థితిపై ఇది తీవ్ర ప్ర‌భావం చూప‌నుంది. థియేట‌ర్ల‌లో ప‌నిచేసే ఉద్యోగుల‌కు, కార్మికుల‌కు యాజ‌మాన్యాలు ఎంత‌వ‌ర‌కు జీతాలు చెల్లిస్తార‌నేది ప్ర‌శ్నార్థ‌క‌మే. ప్ర‌భుత్వ ఆదేశానుసారం థియేట‌ర్ల‌ను మూసివేశాం కాబ‌ట్టి, మూసివేసిన కాలానికి జీతం చెల్లించ‌లేమ‌ని ప్రొప్రైట‌ర్లు చెబితే ఉద్యోగులు చేయ‌గ‌లిగింది ఏమీ ఉండ‌దు.

సినిమా హాళ్ల మూసివేత కార‌ణంగా, సినిమా షూటింగ్స్ నిలిపివేత కార‌ణంగా ప‌లు సినిమాల విడుద‌ల‌లు కూడా వాయిదా ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే మార్చి 25న విడుద‌ల కావాల్సి ఉన్న నాని-సుధీర్ బాబు మూవీ 'వి', ప్ర‌దీప్ మాచిరాజు హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న మూవీ '30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా', రాజ్ త‌రుణ్ మూవీ 'ఒరేయ్ బుజ్జిగా', ఏప్రిల్ 2న విడుద‌ల కావాల్సి ఉన్న అనుష్క సినిమా 'నిశ్శ‌బ్దం', చిరంజీవి మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న చిత్రం 'ఉప్పెన'‌, రానా ద‌గ్గుబాటి న‌టించిన త్రిభాషా చిత్రం 'అర‌ణ్య' వాయిదా ప‌డ్డాయి. ఏప్రిల్ 9న రావాల్సిన రామ్ మూవీ 'రెడ్'‌, 10న విడుద‌ల కావాల్సిన విజ‌య్ సినిమా 'మాస్ట‌ర్'‌, ఏప్రిల్ 17 వ‌స్తుంద‌ని ప్ర‌క‌టించిన కీర్తి సురేశ్ సినిమా 'మిస్ ఇండియా', ఏప్రిల్ 24న రావాల్సిన శ‌ర్వానంద్ మూవీ 'శ్రీ‌కారం', 30న రావాలనుకుంటున్న బెల్లంకొండ శ్రీ‌నివాస్ మూవీ 'అల్లుడు అదుర్స్'‌, మే 1న వ‌స్తానంటున్న సాయిధ‌ర‌మ్ తేజ్ 'సోలో బ్ర‌తుకే సో బెట‌ర్' సినిమా, మే 8న రావ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న ర‌వితేజ 'క్రాక్'.. విడుదల విష‌యాల్లో మార్పులు చోటు చేసుకొనే అవ‌కాశాలున్నాయి. 

ఇలా విడుద‌ల‌కు రెడీ అవుతున్న అన్ని సినిమాల‌పైనా, ఇప్ప‌టికే విడుద‌ల తేదీలు ప్ర‌క‌టించి, అందుకు అనుగుణంగా షూటింగ్ ప్లాన్ చేసిన సినిమాల‌పైనా క‌రోనా ఎఫెక్ట్ తీవ్రంగా ఉండ‌బోతోంది. ఒక ర‌కంగా ఇది సినిమాకు, మొత్తంగా ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇండ‌స్ట్రీకి సంక్షోభ కాలం. దీన్ని స‌మ‌ష్టిగా ఎదుర్కొని బ‌య‌ట‌ప‌డ‌టం మిన‌హా మ‌రో దారి లేదు.

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.