స్వీయ గృహనిర్బంధంలోకి తెలుగు కమెడియన్!
on Mar 18, 2020
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలుగు హాస్యనటుడు ప్రియదర్శి స్వీయ గృహనిర్బంధం (సెల్ఫ్-క్వారంటైన్)లోకి వెళ్లాడు. ప్రభాస్ సినిమా 'ఓ డియర్' షూటింగ్ కోసం జార్జియా వెళ్లిన అతడు మంగళవారం అక్కడి నుంచి హైదరాబాద్ రాగానే నేరుగా ఇంటికి వెళ్లిపోయాడు. 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నాడు. తన కుటుంబ సభ్యులకు ఎవరికీ కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు ఈ పని చేస్తున్నాడు.
"కాబట్టి నేను చాయిస్ తీసుకొని, నాకు క్లీన్ చిట్ వచ్చేదాకా బయటకు రాకుండా ఇంట్లోనే 14 రోజులు ఉండదలచుకున్నాను. ఎందుకంటే ఈ టైమ్‌లో సామాజిక దూరం అనేది అవసరం. భయాందోళనలు పడకుండా, జాగరూకతతో ఉండి ఎదుటివాళ్ల బాగుకోరుకుంటూ మసలుకోవాలి. సామాజిక దూరం అనేది పనిచేస్తుంది" అని ట్వీట్ చేశాడు ప్రియదర్శి. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే సామాజిక దూరం పాటించడం కీలకమంటూ మహేశ్ సహా పలువురు సెలబ్రిటీలు ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే.
యూరప్ దేశాలు, అనేక ఇతర దేశాల నుంచి వచ్చే విమానాలను మార్చి 31 వరకు అనుమతించమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో 'ఓ డియర్' బృందం జార్జియా షెడ్యూల్‌ను హడావిడిగా ముగించుకొని, తిరుగు ప్రయాణమైంది. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్‌లో లవ్ స్టోరీగా రూపొందుతోన్న 'ఓ డియర్'లో ప్రభాస్, పూజా హెగ్డే లవర్స్‌గా నటిస్తుండగా, ప్రభాస్ ఫ్రెండ్ క్యారెక్టర్‌ను ప్రియదర్శి చేస్తున్నాడు. గోపీకృష్ణా మూవీస్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఉగాది పర్వదినం సందర్భంగా మార్చి 25న ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది.