బాలూ, త్వరగా కోలుకొని రా.. నీ కోసం ఎదురుచూస్తున్నా!
on Aug 14, 2020
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందనీ, ఆయనను ఐసీయూకు తరలించామనీ ఆయన చికిత్స పొందుతున్న చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్ హాస్పిటల్ ప్రకటించిన కొద్ది గంటల తర్వాత తన స్నేహితుని ఆరోగ్యం గురించి ప్రార్థన చేస్తూ మేస్ట్రో ఇళయరాజా ఒక ఎమోషనల్ వీడియో విడుదల చేశారు. నాలుగు దశాబ్దాలకు పైగా ఆ ఇద్దరి మధ్యా సన్నిహిత అనుబంధం ఉంది. ఇటీవల బాలు కొవిడ్-19 టెస్ట్‌లో పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, శ్రేయోభిలాషులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రార్థనలు చేస్తూ వస్తున్నారు.
శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో తన ఫేస్బుక్ పేజ్ ద్వారా స్పందిస్తూ, "బాలూ, త్వరగా కోలుకొని రా. నీ కోసం నేను ఎదురుచూస్తున్నా" అని ఓ వీడియో పోస్ట్ చేశారు. ఇన్నేళ్లుగా తాము పంచుకున్న ప్రేమనూ, జీవితాన్నీ మననం చేసుకుంటూ, "మన జీవితాలు కేవలం సినిమాతో ముగియవు. అవి సినిమాతో మొదలు కాలేదు. ఏదో ఒక ప్రాగ్రామ్ ఒక స్టేజి మీద మొదలైన మన సంగీతం మన జీవితంగా, మన జీవనోపాధిగా మారింది. ఆ స్టేజ్ షోలలో ప్రారంభమైన మన సంగీతం, స్నేహం.. రాగం, తాళం ఎలా విడదీయరానివో అలా మన స్నేహం కూడా విడదీయరానిదైంది. మనం పోట్లాడుకున్నప్పుడు, పోట్లాడుకోనప్పుడు కూడా మన స్నేహం అలాగే ఉండింది. ఇది నీకూ, నాకూ తెలుసు." అని అన్నారు ఇళయరాజా.
అంతేకాదు, తన స్నేహితుడని తానెంతగా ప్రేమిస్తున్నారో వెల్లడిచేసేలా "కాబట్టి నేను దేవుడ్ని ప్రార్థిస్తున్నా. నువు కచ్చితంగా తిరిగొస్తావని నా అంతర్గత భావనలు చెప్తున్నాయి. ఇది నిజంగా జరగాలని ప్రార్థిస్తున్నా. బాలూ, త్వరగా రా." అని భావోద్వేగంతో తన మాటలను పూర్తిచేశారు.
Also Read