జనంతో స్టెప్పులేయించే 'కోకాకోలా పెప్సీ' సాంగ్!
on Dec 4, 2019
వెంకటేశ్, నాగచైతన్య మేనమామ మేనల్లుళ్లుగా నటించిన 'వెంకీమామ' మూవీ డిసెంబర్ 13న రిలీజవుతోంది. జనం ముందుకు రావడానికి సమయం తక్కువగా ఉండటంతో అగ్రెసివ్ పబ్లిసిటీని ప్రొడ్యూసర్ సురేశ్‌బాబు ప్లాన్ చేశారు. బుధవారం అంటే డిసెంబర్ 4 ఉదయం ఇద్దరు హీరోలు, హీరోయిన్ రాశీఖన్నాతో ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేసిన ఆయన, సాయంత్రానికి ఆదిత్యా మ్యూజిక్‌తో మూడో పాటను యూట్యూబ్‌లో రిలీజ్ చేయించారు. తమన్ స్వరాలు కూర్చగా ఇప్పటికే నవంబర్ 7న 'వెంకీమామ' టైటిల్ సాంగ్, నవంబర్ 15న 'ఎన్నాళ్లకో' అనే డ్యూయెట్ సాంగ్ రిలీజయ్యాయి. ఇప్పుడు మూడో సాంగ్ 'కోకాకోలా పెప్సీ' రిలీజయ్యింది. ఈ పాటను సినిమాలోని రెండు ప్రధాన జంటలు.. అంటే వెంకటేశ్-పాయల్ రాజ్‌పుత్, నాగచైతన్య-రాశీఖన్నాపై చిత్రీకరించారు.
ఫుల్ మాస్ బీట్‌తో శేఖర్ కొరియోగ్రఫీలో, కలర్‌ఫుల్ సెట్లో ఈ సాంగ్‌ను తీసినట్లు లిరికల్ వీడియో ద్వారా తెలుస్తోంది. మాస్ సాంగ్స్ రాయడంలో ఇటీవలి కాలంలో మంచి పేరు తెచ్చుకున్న, 'అల.. వైకుంఠపురములో' మూవీలో 'రాములో రాములా' సాంగ్‌తో అందరి దృష్టినీ తనవైపుకు తిప్పుకున్న కాసర్ల శ్యాం ఈ సాంగ్ రాయడం గమనార్హం. "మిల్టరి నాయుడూ మిల్టరి నాయుడూ .. చూస్తే సురా సురా తుపాకులే పేలుడూ" అంటూ పాయల్ రాజ్‌పుత్ పాటను మొదలుపెట్టింది. పాయల్, రాశీ ఖన్నాలకు సింగర్స్ అదితి భావరాజు, రమ్యా బెహరా.. వెంకటేశ్, చైతన్యలకు సింగర్స్ సింహా, హనుమాన్ వాయిస్ ఇచ్చిన ఈ సాంగ్ ఆద్యంతం మంచి ఊపుతో సాగి అలరిస్తోంది. ట్రిపుల్ కాంగో, బొంగోస్, ఎలెక్ట్రిక్ గిటార్స్, బాస్, ట్రంపెట్, ట్రాంబోన్ వంటి వాద్య పరికరాలతో ఈ సాంగ్‌కు ట్యూన్స్ కట్టాడు తమన్.
మామా అల్లుళ్లు వస్తే "జరా జరా జరీ చీరే జారుడు" అని తమ మనసులు ఎలా అయిపోతాయో ఈ పాటలో అమ్మాయిలు చెప్పారు. వెంకటేశ్‌ను 'మిలటరి నాయుడు' అనీ, చైతూని 'విక్టరీ అల్లుడు' అనీ పాటలో ప్రస్తావించాడు లిరిక్ రైటర్. 'కోకా కోలా పెప్సీ.. ఈ మామా అల్లుడు సెక్సీ.. అత్తారింటికేసి చల్ ఎక్కేద్దామా టాక్సీ' అంటూ ఇద్దరు అమ్మాయిలు పాడాక, రెండు జంటలూ కలిసి వేసే స్టెప్‌ను ఆకట్టుకొనే రీతిలో కంపోజ్ చేశాడు కొరియోగ్రాఫర్. కచ్చితంగా మాస్‌లోకి ఆ స్టెప్ వెళ్లేలా కనిపిస్తోంది. థియేటర్లలో ఆ పాట వచ్చినప్పుడు ఫ్యాన్స్ ఆ స్టెప్ వేయడం ఖాయం. రెండు జంటల కాస్టూమ్స్ కూడా చాలా ఆక్ర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఆ పాట తీసేప్పుడు సెట్స్‌పై మామా అల్లుళ్లు వెంకీ, చైతూ సరదాగా మాటాడుకోవడం ఈ లిరికల్ వీడియోకు సంబంధించిన మరో ఎట్రాక్షన్. 'సింగిలు హ్యాండుతో కొంగును గుంజరో..' అని పాయల్ చెబితే, 'బలపం పట్టి భామ వళ్లో కోచింగ్ కొస్తానే' అని జవాబిచ్చాడు వెంకీ. 'బ్యాంగిల్ సౌండులో బ్యాటింగ్ నేర్పరో' అని రాశి అడిగితే, 'హండ్రెడ్ పర్సెంట్ లవ్వు బళ్లో టీచింగ్ ఇస్తానే' అని ఆన్సరిచ్చాడు చైతూ. 'లెఫ్టూ స్పైసీ.. రైటూ జ్యూసీ" అని అమ్మాయిలు అబ్బాయిల గురించి చెబ్తే, "మీ హాటు లిప్పుల్లో మీఠా లస్సీ" అని అబ్బాయిలు వాళ్లని పొగిడారు.
ఈ పాటలో వెంకీ, చైతూ మధ్య కెమిస్ట్రీ కానీ, ఇద్దరు హీరోయిన్లతో హీరోల కెమిస్ట్రీ కానీ బాగా వర్కవుట్ అయినట్లు కనిపిస్తోంది. ముందు రిలీజ్ చేసిన రెండు పాటలతో పోలిస్తే ఈ పాట మరింత ఆకర్షణీయంగా, కలర్‌ఫుల్‌గా ఉందని చెప్పొచ్చు. దీనికి కారణం.. ఇది ఫుల్ మాస్ బీట్ సాంగ్ కావడం, రెండు జంటలపై దీన్ని తియ్యడం వల్ల కావచ్చు. అలాగే డాన్సులు కూడా జనాల చేత వేయించేట్లు మంచి ఊపుతో ఉన్నాయి. ఈ పాట తరహాలో సినిమాలోని సన్నివేశాల్లో వెంకీ, చైతూల మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయితే 'వెంకీమామ' మూవీ కచ్చితంగా ప్రేక్షకుల్ని అలరించి విజయం సాధించే అవకాశాలున్నాయి.
![]( https://www.teluguone.com/images/g-news-banner.gif)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
![](https://www.teluguone.com/tmdb/images/read-1.jpg)