చిరంజీవి వర్సెస్ ఎన్టీఆర్.. ఎవరిది పైచేయి..?
on Feb 2, 2025
మెగా వర్సెస్ నందమూరి సంక్రాంతి వార్ ఎప్పుడూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ.. పొంగల్ పోరుకి సై అంటూ ఉంటారు. చివరగా 2023 సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య'తో చిరంజీవి, 'వీరసింహారెడ్డి'తో బాలకృష్ణ బాక్సాఫీస్ బరిలో దిగారు. 'వాల్తేరు వీరయ్య' బ్లాక్ బస్టర్ గా నిలవగా, 'వీరసింహారెడ్డి' కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ 2025 సంక్రాంతికి కూడా మెగా వర్సెస్ నందమూరి బాక్సాఫీస్ వార్ నడిచింది. 'గేమ్ ఛేంజర్'తో రామ్ చరణ్, 'డాకు మహారాజ్'తో బాలకృష్ణ బరిలో దిగగా.. డాకు మహారాజ్ పైచేయి సాధించింది. అలాగే 2026 సంక్రాంతికి కూడా మెగా-నందమూరి ఫైట్ చూడబోతున్నాం. ఈసారి చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ సమరానికి సై అంటున్నారు.
గతేడాది 'దేవర'తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఎన్టీఆర్ (Jr NTR), ప్రస్తుతం బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2'తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో 'డ్రాగన్' అనే భారీ యాక్షన్ ఫిల్మ్ చేయనున్నారు ఎన్టీఆర్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ, ఈ నెలలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. అయితే ఇప్పుడు ఈ సంక్రాంతి సీజన్ పై చిరంజీవి కూడా కన్నేసినట్లు తెలుస్తోంది.
త్వరలో 'విశ్వంభర' సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్న చిరంజీవి (Chiranjeevi), తన తదుపరి చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్నారు. షైన్ స్క్రీన్స్ నిర్మించనున్న ఈ మూవీ, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ దశలో ఉంది. యాక్షన్ కామెడీ ఫిల్మ్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని, 2026 సంక్రాంతికి తీసుకురావడానికి అనిల్ రావిపూడి అండ్ టీం ప్రయత్నిస్తున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి కి సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. ఆయన డైరెక్ట్ చేసిన 'ఎఫ్-2', 'సరిలేరు నీకెవ్వరు', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించాయి. అందుకే చిరంజీవి సినిమాని కూడా ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి తీసుకురావాలని అనిల్ రావిపూడి భావిస్తున్నారట. అదే జరిగితే మరోసారి మెగా-నందమూరి పొంగల్ ఫైట్ చూడొచ్చు. మరి ఈ ఫైట్ లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
