సునీల్ లావుగా, నల్ల తుమ్మమొద్దులా ఉండేవాడు!
on Mar 2, 2020
ఈ మాటలన్నది ఎవరో కాదు.. నన్ అదర్ ద్యాన్ మెగాస్టార్ చిరంజీవి. అవును. 'ఓ పిట్ట కథ' ప్రి రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణించాలంటే అంకితభావం, అకుంఠిత దీక్ష అవసరమని ఆ సినిమా హీరోలు విశ్వంత్, అజయ్ రావులకు చెప్పే క్రమంలో ఆయన స్టేజిపై ఉన్న సునీల్‌ను ఒక ఉదాహరణగా చూపారు. మొదట్లో అతడి ఆకారాన్ని చూసి చాలామంది చులకనగా మాట్లాడారని, కానీ ఆ తర్వాత తనకే సునీల్ ఇన్‌స్పైర్ అయ్యాడనీ చిరంజీవి చెప్పారు.
చిరంజీవి ఏమన్నారంటే.. "ఎప్పుడూ నెగటివ్ ఆలోచించొద్దు. వస్తామంటే వస్తాం. 100 శాతం మీరు ఎఫర్ట్స్ పెట్టండి. కచ్చితంగా మీరు సాధిస్తారు. ఇండస్ట్రీలో ఉన్న ఉదాహరణలు చూడండి.. నాకెప్పుడూ చెప్పాలనిపిస్తుంది. సునీల్ భీమవరంలో నాకొక అభిమాని. థియేటర్‌లో నా సినిమాల్ని దొంగచాటుగానో, వాళ్లమ్మ పర్మిషన్ తీసుకొని చూస్తూ, డాన్సులు నేర్చుకొని, ఇంత లావుండి, అతని ఫ్రెండ్స్ మాటల్లో చెప్పాలంటే.. నల్లతుమ్మ మొద్దులా ఉండి.. 'ఈడు సినిమా యాక్టర్ అవుతాడా? ఈడు కామెడీయా.. ఆ ఏడ్చావ్ లేరా..' అన్నవాళ్లు ఎంతోమంది. అవేమీ పట్టించుకోలేదు. తను గుడ్డిగా నమ్మాడు. చెవిటి కప్పలా తయారయ్యాడు. తను అనుకున్నది సాధిస్తానన్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి ఫ్రెండు దొరికాడు. అలాంటి వాళ్ల సహకారంతో వెళ్లాడు, తానేం చేసినా అందులో ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాడు. కచ్చితంగా వస్తాననే నమ్మకం, ధీమాతో ముందుకెళ్లాడు. ఈ రోజున నేను కూడా ఇన్‌స్పైర్ అయ్యేంత పెద్ద స్థాయికి వెళ్లాడు. ఎప్పుడో తెలుసా? సిక్స్ ప్యాక్ చేసినప్పుడు. ఆశ్చర్యపోయా. అది ఆషామాషీ విషయం కాదు. సింగిల్ ప్యాక్ నుంచి సిక్స్ ప్యాక్‌కు వచ్చాడంటే.. అది మామూలు విషయం కాదు. అలాంటి ఇన్‌స్పైరింగ్ పర్సనాలిటీ తను. అందరూ నన్ను ఇన్‌స్పైరింగ్ పర్సనాలిటీ అంటుంటారు. కానీ నేనంటాను.. సునీల్ లాంటి వాళ్లు మనకు ఇన్‌స్పిరేషన్ అని. ఇక్కడ రాణించలేమోనని భయపడాల్సిన పనిలేనే లేదు. అకుంఠిత దీక్షతో ఒకే లక్ష్యంతో దూసుకుపోతే.. కచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒక సూపర్‌స్టార్, ఒక మెగాస్టార్ అవుతారు."
చిరంజీవి ఇలా తన గురించి మాట్లాడుతుంటే.. సునీల్ భావోద్వేగానికి గురవుతూ ఆయనకు నమస్కారం పెట్టాడు. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' మూవీ చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
