ఆ 'ఖైదీ' రేంజిలో ఈ 'ఖైదీ' హిట్టవుతుందా?
on Oct 21, 2019
అప్పటిదాకా ఒక మామూలు హీరోగా ఉన్న చిరంజీవిని స్టార్ హీరోగా మార్చిన సినిమా 'ఖైదీ'. చిరంజీవి యాక్టర్ అయిన ఆరేళ్లకు అంటే 1983లో వచ్చిన ఆ సినిమాతో టాలీవుడ్‌లో సరికొత్త యాంగ్రీ యంగ్‌మ్యాన్ ఆవిర్భవించాడు. అప్పటి సీనియర్ స్టార్ కృష్ణ చేయాల్సిన ఆ సినిమా, ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా అనూహ్య పరిస్థితుల్లో చిరంజీవిని వరించింది. ఎ. కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేసిన 'ఖైదీ'ని చూసి ప్రేక్షకులు పిచ్చెత్తిపోయారు. అందులో చిరంజీవి చేసిన ఫెరోషియస్ ఫైట్లు మాస్‌ను విపరీతంగా ఆకట్టుకుంటే, డాన్సులు అందర్నీ అలరించాయి. ప్రధానంగా 'రగులుతోంది మొగలిపొద' సాంగ్‌లో హీరోయిన్ మాధవితో కలిసి ఆయన చేసిన నృత్యాలు చూసి ఫ్లాటైపోనివాళ్లు లేరు. తన అక్క చావుకు కారణమైన వాళ్ల అంతుచూసే యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా చేసిన పర్ఫార్మెన్స్‌తో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయాడు చిరంజీవి. ఆయన ఫ్యాన్ బేస్ విపరీతంగా పెరిగింది. ఆ తర్వాత ఒక్కో సినిమాతో క్రమంగా ఇమేజ్ పెంచుకుంటూ 'పసివాడి ప్రాణం' సినిమాతో నంబర్ వన్ స్టార్‌గా రూపాంతరం చెందాడు. సందర్భవశాత్తూ ఆ మూవీ డైరెక్టర్ కూడా కోదండరామిరెడ్డే.
'ఖైదీ' సినిమా వచ్చి 36 సంవత్సరాలు గడిచాయి. ఇప్పటికీ మెగాస్టార్ హవా ఏమాత్రం తగ్గలేదని 'ఖైదీ నంబర్ 150', 'సైరా' సినిమాలు నిరూపించాయి. ఇప్పుడు 'ఖైదీ' పేరుతో మరో సినిమా వస్తోంది. ఆ సినిమా చేసింది టాలీవుడ్ యాక్టర్ కాదు. తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితుడైన తమిళ హీరో కార్తీ. తమిళంతో పాటు తెలుగులోనూ ఏక కాలంలో అక్టోబర్ 25న లేటెస్ట్ 'ఖైదీ' రిలీజవుతోంది. చిరంజీవి 'ఖైదీ' విడుదలైంది కూడా అక్టోబర్‌లోనే కావడం గమనార్హం. అక్టోబర్ 28న ఆ 'ఖైదీ' వచ్చింది. ఈ అక్టోబర్ 28 సోమవారం కావడం వల్లే, 25న కార్తీ 'ఖైదీ' వస్తుందనుకోవాలి. గురువారమో, శుక్రవారమో, శనివారమో అక్టోబర్ 28 వచ్చినట్లయితే, కచ్చితంగా ఆ తేదీనే రిలీజ్ చేసి ఉండేవాళ్లు.
చిరంజీవి 'ఖైదీ' కథకూ, కార్తీ 'ఖైదీ' కథకు ఏమాత్రం సంబంధం లేదని కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన ట్రైలర్ ద్వారా మనకు అర్థమైంది. అక్కడ అక్క చావుకు ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోయే యువకుడిగా చిరంజీవి కనిపిస్తే, ఇక్కడ తను అంతవరకూ చూడని పదేళ్ల కూతుర్ని చూడ్డానికి జైలు నుంచి తప్పించుకున్న యావజ్జీవ ఖైదీగా కార్తీ కనిపించనున్నాడు. అతను ఎందుకు జైలుకు వెళ్లాడనే విషయం తెలీదు. ఆ కూతురు ఒక అనాథ శరణాలయంలో పెరుగుతున్నట్లు ట్రైలర్‌లో కనిపించింది. "నన్ను చూడ్డానికి రేపు ఎవరూ రారేమో అనిపిస్తోంది" అని ఆ అమ్మాయి అనుకోవడం చూస్తే, ఆ రోజుకు ఏదో ప్రాధాన్యం ఉందనీ, బహుశా అది ఆమె పదో పుట్టినరోజు కావచ్చనీ అభిప్రాయం కలుగుతోంది.
ఒక ఖైదీ జైలు నుంచి తప్పించుకుంటే, పోలీసులు ఊరుకుంటారా? వెంటబడ్డారు. ఆ క్రమంలో కార్తీ ఒక స్మగ్లింగ్ దందాకు సంబంధించిన సమస్యలో చిక్కుకున్నాడనీ, 840 కోట్ల రూపాయల విలువచేసే సరుకు ఉన్న లారీని కార్తీ తన అదుపులోకి తీసుకున్నాడనీ, దాంతో ఒక వైపు పోలీసులతో పాటు, మరోవైపు స్మగ్లర్లు కూడా అతని వెంట పడ్డారనీ ఊహించవచ్చు. ఆ స్మగ్లర్లతో కార్తీ చేసే ఫెరోషియస్ యాక్షన్ సీన్లూ ఈ సినిమాలో ఉన్నాయి. ఇంతకీ తన కూతుర్ని 'ఖైదీ' చూసుకున్నాడా, లేదా.. అనేది మనం సినిమాలో చూడబోతున్నాం.
రెండు 'ఖైదీ' సినిమాల మధ్య ఇంకో స్పష్టమైన తేడా ఉంది. ఆ 'ఖైదీ'లో ఒకరికి ఇద్దరు హీరోయిన్లు.. మాధవి, సుమలత.. ఉన్నారు. విలన్ రావుగోపాలరావు కూతురై ఉండి కూడా చిరంజీవికి మనసిచ్చిన మెయిన్ హీరోయిన్‌గా మాధవి నటిస్తే, ఆపదలో చిరంజీవికి ఆశ్రయమిచ్చి, అతడిని కాపాడే క్రమంలో తన ప్రాణాల్ని కోల్పోయిన డాక్టర్‌గా సుమలత కనిపిస్తుంది. కొత్త 'ఖైదీ'లో అసలు హీరోయిన్లు లేకపోవడం గమనార్హం. కూతురు ఉన్నప్పుడు భార్య ఉండాలి కదా.. ఆమె ఎవరో చూపించలేదు. కాబట్టి కార్తీకి డ్యూయెట్లు లాంటివేవీ లేవు. సినిమాలో ఒకే ఒక్క పాట ఉంది. ఒక వర్సటైల్ యాక్టర్‌గా కార్తీకి ఈ సినిమా మంచి పేరు తెస్తుందని సినిమా యూనిట్ గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది.
డైరెక్టర్ లోకేష్ కనకరాజ్‌కు 'ఖైదీ' రెండో సినిమా. దీనికి ముందు అతను 'మానగారం' అనే థ్రిల్లర్ తీశాడు. అది బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్టయింది. ఆ మూవీ నచ్చే 'ఖైదీ'ని అతని డైరెక్షన్‌లో చేశాడు కార్తీ. ఈ మూవీ తర్వాత ఏకంగా తమిళ టాప్ స్టార్ విజయ్‌ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు లోకేష్. దాన్నిబట్టి అతను ఎంతటి టాలెంటెడ్ డైరెక్టరనేది అర్థమవుతుంది. చిరంజీవి 'ఖైదీ'లా, తన 'ఖైదీ' కూడా సూపర్ హిట్టవుతుందనే నమ్మకాన్ని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యక్తం చేశాడు కార్తీ. ఇలాంటి నేపథ్యంతో వస్తోన్న 'ఖైదీ' సినిమా తెలుగు ప్రేక్షకుల్ని ఏ రీతిన ఆకట్టుకుంటుందో నాలుగు రోజుల్లో తెలిసిపోతుంది.