'చెక్'తో మరో కొత్తరుచిని ఇచ్చేందుకు రెడీ అవుతున్న డైరెక్టర్!
on Oct 30, 2020
తెలుగు చిత్రసీమలో విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి. మొదటి సినిమా 'ఐతే' తోనే అందరి దృష్టినీ తనవైపుకు తిప్పుకున్నారు. మూసలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమాకు కొత్త రుచిని అందించారు. అదే చిత్రంతో జాతీయ అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రం అవార్డును సంపాదించి పెట్టారు. ఆ తర్వాత చార్మి హీరోయిన్గా ఆయన రూపొందించిన 'అనుకోకుండా ఒకరోజు' చిత్రం థ్రిల్లర్లలోనే భిన్నమైన అనుభవాన్నిచ్చి, చందు ప్రతిభను మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. ఒక్కడున్నాడు, ప్రయాణం, సాహసం, మనమంతా చిత్రాలూ భిన్నమైన కాన్సెప్టులతో తయారైనవే.
ఇప్పుడు తన ఏడో సినిమాను 'చెక్' పేరుతో ఆయన తీస్తున్నారు. నితిన్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీలో రకుల్‌ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అక్టోబర్ సెకండ్ వీక్ నుంచి ఈ సినిమా షూటింగ్ రెజ్యూమ్ అయ్యింది. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి. ఆనంద ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ పర్ఫార్మెన్స్ మరో లెవల్లో ఉంటుందని ఆయన నొక్కి వక్కాణిస్తున్నారు. టైటిల్‌కు తగ్గట్లే చెస్ బ్యాగ్రౌండ్‌తో ఈ సినిమాని చందు రూపొందిస్తున్నారు. సంపత్ రాజ్, సాయిచంద్, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, హర్షవర్ధన్ లాంటి ప్రతిభావంతులైన నటులు ఈ సినిమాలో భాగమయ్యారు.
సినిమా సినిమాకీ కథా కథనాల్లో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ, ఇతరులతో పోలిక లేని ట్రీట్మెంట్తో సినిమాలు తీస్తూ వస్తోన్న చందు 'చెక్'తో ప్రేక్షకులకు ఎలాంటి అనుభవాన్నిస్తారో వేచి చూడాల్సిందే.
Also Read