మొదటి పాట, ముందు మాట ఆయనవే.. నా ప్రతి అడుగులో బాలు ఉన్నారు
on Jun 4, 2021

నేడు(జూన్ 4) ఎస్పీ సుబ్రహ్మణ్యం 75వ జయంతి. ఈ సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమ వర్చువల్ గా ఆయన జయంత్యుత్సవాల్ని జరుపుతోంది. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు బాలు గురించి మాట్లాడుతూ ఆయనతో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ప్రముఖ లిరిక్ రైటర్ చంద్రబోస్ మాట్లాడుతూ.. తాను రాసిన మొదటి పాట బాలునే పాడారని, తన గురించి వస్తున్న ఓ పుస్తకంలో ముందుమాట కూడా ఆయనే రాసారని చెప్పారు.
బాలు గారితో తనకి చాలా అనుబంధముందని చంద్రబోస్ అన్నారు. తాను రాసిన మొదటి పాట తాజమహల్ మూవీలోని 'మంచు కొండల్లోన చంద్రమా' అనే పాట ఆయన పాడి తనని ఆశీర్వదించారని.. అప్పటి నుండి ఎన్నో పాటలు పాడి ఆయన గాత్రం ద్వారా తనని ఆశీర్వదిస్తూనే ఉన్నారని చంద్రబోస్ చెప్పారు. అలాగే తన గురించి వస్తున్న ఓ పుస్తకంలో ముందుమాట కూడా బాలు గారే రాసారని తెలిపారు. 'నా బ్రతుకులో, నా బ్రతుకు బాటలో, జీవన గానంలో, ప్రతి అడుగులో బాలు గారు ఎప్పుడూ ఉన్నారని' అన్నారు. ఎప్పుడూ ఫోన్ చేసినా తన కుటుంబ సభ్యుల యోగక్షేమాలు పేరుపేరునా అడిగే గొప్ప మనసున్న మనిషి బాలు అని చంద్రబోస్ చెప్పారు.
'బాలు గారు పాడిన ఎన్నో పాటలు గాలిలో నిలిచిపోయాయి.. ఆయన పాడాల్సిన మరెన్నో పాటలు మట్టిలో కలిసిపోయాయి' అని చెప్పిన చంద్రబోస్.. 'మట్టిలోన కలిసిపోయిన పాటల గురించి బాధపడక, గాలిలోన నిలిచిపోయిన పాటలకు తలచుకొని, ఆ పాటలను మన శ్వాసగా మలచుకొని బ్రతుకుదాం' అన్నారు. అలాగే ఈ సందర్భంగా బాలుని స్మరించుకుంటూ ఆయన రాసిన మాటలను చదివి వినిపించారు చంద్రబోస్. "మీ స్వరం అద్వితీయం.. మీ గాత్రం అమృతం.. మీ వ్యక్తిత్వం ఆదర్శనీయం.. మీ ఆహార్యం అనుకరణీయం.. మరణం మనిషికే గాని మంచితనానికి కాదు.. పరిమితి ప్రాణానికే గాని ప్రతిభకి కాదు.. మీ కీర్తి, మీ ప్రతిభ, మీ మంచితనం వెండితెర సాక్షిగా మా గుండెతెరలలో పదిలం శాశ్వతం" అంటూ బాలుని స్మరించుకున్నారు చంద్రబోస్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



