కలర్‌ఫుల్ ఫ్రేమ్స్.. లవ్లీ స్టెప్స్.. వెరసి 'బుట్ట బొమ్మ' సాంగ్!
on Jan 8, 2020
అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన 'అల.. వైకుంఠపురములో' మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలవుతోంది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలోని పాటలు ఇప్పటికే అసాధారణ స్థాయిలో పాపులర్ అయ్యాయి. తమన్ స్వరాలకు సీతారామశాస్త్రి, కాసర్ల శ్యామ్, రామజోగయ్యశాస్త్రి వంటి గీత రచయితల సాహిత్యం తోడై ఆ పాటలకు ఆదరణ తీసుకొచ్చాయి. లేటెస్టుగా 'బుట్ట బొమ్మ' వీడియో సాంగ్ టీజర్‌ను ఆదియా మ్యూజిక్ సంస్థ యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ సాంగ్ లిరికల్ వీడియో డిసెంబర్ 24న రిలీజై 9.6 మిలియన్ పైగా వ్యూస్ సాధించింది. ఆ పాట విజువల్‌గా ఎలా ఉంటుందో ఈరోజు టీజర్ రూపంలో చూపించారు.
లిరిక్స్‌కు తగ్గట్లు బుట్టబొమ్మలాగే చక్కని రూపలావణ్యాలతో కనిపిస్తూ ఉంది పూజా హెగ్డే. షార్ట్ స్కర్ట్స్ వేసుకున్న ఆమెను ఉద్దేశించి తనదైన స్టైల్‌తో క్యూట్ స్టెప్స్‌తో బన్నీ అలరిస్తున్నాడు. ఒక ర్యాంపుపై నుంచి నిలబడి జారుతూ, తలను డాన్స్ స్టైల్‌తో ఊపుతూ చేసిన విన్యాసం అతనికే సాధ్యమనిపించింది. కొరియోగ్రాఫర్ జానీ కంపోజ్ చేసిన ఈ సాంగ్‌ను ఫారిన్ డాన్సర్స్‌తో, ఇన్డోర్ సెట్లో చిత్రీకరించారు. అయితే ఈ పాటను ఔట్‌డోర్‌లో తీస్తే మరింత బాగా ఉండేదనే అభిప్రాయం కలుగుతుంది. 7 గంటల్లో 1.5 మిలియన్ వ్యూస్ సాధించి యూట్యూబ్‌లో నంబర్ 4 ప్లేస్‌లో ట్రెండింగ్‌లో ఉన్న ఈ పాటను అర్మాన్ మాలిక్ ఆలపించాడు. జనవరి 6న జరిగిన మ్యూజికల్ కాన్సర్ట్‌లో ఈ పాటకు అర్మాన్ ఇచ్చిన లైవ్ పర్ఫార్మెన్స్ బన్నీ ఫ్యాన్స్‌ను అలరించింది.