బిత్తిరి సత్తి: టీవీ9 నుంచి ఎగ్జిట్.. సాక్షిలోకి ఎంట్రీ!
on Jul 10, 2020
వీ6లో తీన్మార్ వార్తలు, టీవీ9లో ఇస్మార్ట్ న్యూస్‌తో టీవీ వీక్షకులను అలరిస్తూ వచ్చిన చేవెళ్ల రవికుమార్ అలియాస్ బిత్తిరి సత్తి.. శుక్రవారం సాక్షి చానల్లో ప్రత్యక్షమయ్యాడు. ఇటీవల టీవీ9కి బిత్తిరి సత్తి రాజీనామా చెయ్యడం మీడియా వర్గాల్లో చర్చనీయాంశమైంది. బిగ్ బాస్ 4 షోలో పాల్గొనడం కోసమే అతను రాజీనామా చేశాడంటూ టీవీ9 అనుకూల వర్గం ప్రచారంలోకి తెచ్చింది. అయితే యాజమాన్యం తీరువల్లే టీవీ9 నుంచి సత్తి బయటకు వచ్చాడనే ప్రచారాన్నే ఎక్కువ మంది నమ్ముతున్నారు.
నిజానికి రవిప్రకాశ్ నుంచి మైహోమ్ రామేశ్వరరావు చేతికి టీవీ9 పగ్గాలు వచ్చాక, వీ6 నుంచి మంచి ప్యాకేజీతో సత్తిని తీసుకొని వచ్చారు. అదివరకు తీన్మార్ వార్తలకు సత్తి వల్ల ఎలాంటి పాపులారిటీ వచ్చిందో, అతను టీవీ9లోకి వచ్చాక ఇస్మార్ట్ న్యూస్‌కు సైతం అంత పాపులారిటీ వచ్చింది. ఇప్పుడు అతను లేని లోటు ఇస్మార్ట్ న్యూస్‌లో కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు సత్తి.. సాక్షి చానల్లో చేరడంతో టీవీ9 అనుకూల వర్గం చేస్తున్న ప్రచారంలో ఎలాంటి పస లేదని తేలిపోయింది. ఇప్పుడు సాక్షి అతడిని ఎలా ఉపయోగించుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. శుక్రవారం అతను చానల్లో చేరిన సందర్భంగా ఉద్యోగులు అతనికి స్వాగతం పలుకుతూ కేక్ కట్ చేయడం గమనార్హం.
ఆసక్తికరమైన విషయమేమంటే కొత్త యాజమాన్యం కింద టీవీ9 జగన్ అనుకూల వైఖరి, చంద్రబాబు వ్యతిరేక వైఖరిని అవలంబిస్తూ వస్తోందనే ప్రచారం ఉంది. ఇప్పుడు జగన్ సొంత చానల్ సత్తిని నెత్తిన పెట్టుకోవడం గమనించాల్సిన విషయమని మీడియా విశ్లేషకులు అంటున్నారు. కాగా సత్తి హీరోగా 'తుపాకి రాముడు' అనే సినిమా కూడా చేసిన విషయం తెలిసిందే.
Also Read