మౌనం వీడిన భావన.. వేధింపుల కేసుపై ఎమోషనల్ పోస్ట్!
on Jan 10, 2022

2017 లో సినీ నటి భావన కిడ్నాప్ సంచలనం సృష్టించింది. ఫిబ్రవరి 17, 2017న షూటింగ్ నుంచి ఆమె ఇంటికి తిరిగి వస్తుండగా.. కేరళలోని ఎర్నాకుళంలో కొందరు ఆమెను కిడ్నాప్ చేసి వేధింపులకు గురిచేశారు. ఈ ఘటన వెనుక మలయాళ నటుడు దిలీప్ ఉన్నాడని తేలడంతో.. పోలీసులు ఆయనను అరెస్ట్ చేయగా తర్వాత బెయిల్ పై విడుదల అయ్యాడు. ఐదేళ్ల తర్వాత తాజాగా ఈ ఘటనపై భావన సోషల్ మీడియా వేదికగా స్పందించింది.
"ఇది అంత తేలికైన ప్రయాణం కాదు. బాధితురాలి నుండి ప్రాణాలతో బయటపడే వరకు సాగించిన ప్రయాణం. నాపై జరిగిన దాడితో ఐదేళ్లుగా నా పేరు, గుర్తింపుపై కూడా ప్రభావం పడుతోంది. నేరం చేసింది నేను కానప్పటికీ, నన్ను అవమానపరచడానికి, ఒంటరిని చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. అలాంటి సమయంలో నాకు కొంతమంది మద్దతుగా నిలిచారు. ఇప్పుడు నా కోసం మాట్లాడే ఇన్ని గొంతులను వింటుంటే.. న్యాయం కోసం చేసే ఈ పోరాటంలో నేను ఒంటరిని కాదని తెలుస్తుంది. న్యాయం గెలవడం కోసం, ఆ దుండగుల నుంచి మరెవరికీ ఇలాంటి కష్టాలు రాకుండా ఉండటం కోసం నేను ఈ పోరాటాన్ని సాగిస్తాను. నాకు అండగా నిలుస్తున్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు" అని భావన రాసుకొచ్చింది.

కాగా, మలయాళ నటి భావన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. గోపీచంద్ నటించిన 'ఒంటరి' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన భావన.. ఆ తర్వాత శ్రీకాంత్ సరసన 'మహాత్మ' సినిమాలో హీరోయిన్ గా నటించింది. చివరిగా రవితేజ 'నిప్పు' సినిమాలో కీలక పాత్రలో కనిపించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



