బాహుబలికి భారీ ప్లానే వేస్తున్నారుగా..!
on Jun 6, 2016
బాహుబలి పార్ట్ 1 రిలీజయ్యే టైమ్ లో తెలుగులో తప్ప మిగిలిన భాషల్లో అంచనాలు యావరేజ్ గానే ఉన్నాయి. ట్రైలర్ చూసిన వాళ్లు మాత్రం సినిమా బాగుంటుందేమో చూడాలి అనుకున్నారు. అయితే రిలీజైన తర్వాత ప్రతీ భాషలోనూ సెన్సేషనల్ హిట్ గా నిలబడి యమ క్రేజ్ సంపాదించేసుకుందీ సినిమా. ఇప్పుడు రెండో పార్ట్ కు అదే అంచనాలతో పాటు, అన్ని భాషల్లోనూ సమానమైన క్రేజ్ ఉంది. అందుకే జక్కన్న రెండో పార్ట్ కు భారీ ప్లాన్ వేస్తున్నాడు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా బాహుబలి ఎన్ని భాషల్లో రిలీజవుతుందో, అన్నింటిలోనూ రిలీజ్ ను ఒకేరోజు ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట. అంటే తెలుగు, తమిళ్, హిందీ లతో పాటు అన్ని భారతీయ భాషల్లోనూ, అన్ని ఫారిన్ లాంగ్వేజెస్ లోనూ ఒకేసారి విడుదల అవుతుంది. అలా రిలీజ్ ప్లాన్ చేయడం చిన్న విషయం కాదు. ఇన్ని భాషల్లో డబ్ చేయించి, మిక్స్ చేయించడమనేది చాలా టైం తీసుకుంటుంది. ఇవన్నీ ఆలోచించుకునే, 2016 డిసెంబర్ అని ఇచ్చిన డేట్ ను 2017 ఏప్రిల్ మార్చాడు రాజమౌళి. ప్రస్తుతం షూటింగ్ ఇంకా 30 శాతం వరకూ పెండింగ్ ఉంది. అక్టోబర్ కల్లా షూటింగ్ పూర్తి చేసి, అక్కడి నుంచి పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్ వర్క్ పై దృష్టి పెట్టబోతున్నారు జక్కన్న అండ్ కో.