టాలీవుడ్‌లో విషాదం..
on Oct 29, 2017
టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత, కమ్యూనిస్టు నేత అట్లూరి పూర్ణచంద్రరావు కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మేడ్చల్ జిల్లా కాప్రా మండలం కమలానగర్‌లో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కృష్ణాజిల్లా చవుటపల్లిలో జన్మించిన ఆయన 27 రూపాయల నెల జీతంతో జీవితాన్ని ప్రారంభించారు.. అలనాటి దర్శక దిగ్గజాలు తాతినేని ప్రకాశరావు, విఠలాచార్య, పి.పుల్లయ్య దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశారు.
ఆ తర్వాత మిత్రుల ప్రొత్సాహంతో కాంతారావు హీరోగా అగ్గిమీద గుగ్గిలం నిర్మించారు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకొంది.. ఆ తర్వాత ఇక వెనుదిరిగి చూసుకోకుండా.. అపాయంలో ఉపాయం, ఉక్కుపిడుగు, రౌడీ రాణి, పాపం పసివాడు, చట్టానికి కళ్లులేవు, శ్రీ, కలవారి కోడలు, ఆడపడుచు, వెంకీ, మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజా కృష్ణమూర్తి, ఔనన్నా కాదన్నా తీసిన ఆయన నిర్మాతగా మొత్తం తొమ్మిది భాషల్లో సినిమాలు నిర్మించారు. అలాగే తొలి నుంచి కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడైన ఆయన ఆ పార్టీకి సేవలందించారు. అట్లూరి మరణం పట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపం ప్రకటించారు. ఆయన మరణవార్త తెలుసుకున్న సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రరావు అట్లూరి భౌతిక కాయానికి నివాళులర్పించారు.