ఎ.ఆర్.రెహమాన్ చేసిన దానికి మెగా ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!
on Jul 27, 2024
ఎ.ఆర్.రెహమాన్.. సినిమా సంగీతాన్ని కొత్త పుంతలు తొక్కించిన మ్యూజిక్ డైరెక్టర్. అంతేకాదు, భారత దేశానికి తొలి ఆస్కార్‌ను తెచ్చిపెట్టిన ఘనత కూడా అతనికే దక్కుతుంది. రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయమైన తొలి రోజుల్లో తెలుగులో సూపర్‌పోలీస్, గ్యాంగ్ మాస్టర్ చిత్రాలకు సంగీతాన్ని అందించారు. కానీ, ఆ రెండు సినిమాలూ డిజాస్టర్స్‌గా నిలిచాయి. ఆ సెంటిమెంట్‌తోనే ఆ తర్వాత 10 సంవత్సరాలపాటు రెహమాన్‌కు తెలుగులో అవకాశం రాలేదు. తమిళ్, హిందీ భాషల్లోనే లెక్కకు మించిన సినిమాలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. రెహమాన్ డైరెక్ట్‌గా తెలుగులో మ్యూజిక్ చేసిన సినిమాలు పట్టుమని పది కూడా లేవు. కొన్ని సినిమాలు హిట్ అయినా అవి ద్విభాషా చిత్రాలే తప్ప తెలుగు సినిమాలు కాదు. అందుకే టాలీవుడ్ దర్శకనిర్మాతలు రెహమాన్‌తో మ్యూజిక్ చేయించుకునేందుకు వెనుకాడతారు. అతనికి సంబంధించి వినిపిస్తున్న మరో మాట ఏమిటంటే ఒకప్పటి రెహమాన్ వేరు, ఇప్పటి రెహమాన్ వేరు. అతని మార్క్ ఈమధ్య కాలంలో కనిపించడం లేదనే అభిప్రాయం ఉంది. వాస్తవానికి అతని నుంచి సరైన మ్యూజికల్ హిట్ వచ్చి కొన్ని సంవత్సరాలవుతోంది.
ఏది ఏమైనా రెహమాన్ సంగీతానికి మునుపటి వైభవం లేదనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రామ్‌చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో రూపొందుతున్న ఆర్సి16 చిత్రానికి సంగీత దర్శకుడిగా రెహమాన్‌ని ఎంపిక చేసుకోవడం పట్ల మెగాభిమానులు అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే భారతీయుడు 2 చిత్రం నిరాశపరచడంతో శంకర్ డైరెక్షన్లో రామ్‌చరణ్ చేస్తున్న గేమ్ ఛేంజర్ ఎలా ఉండబోతోంది అనే టెన్షన్ వారిలో ఉంది. అయితే ఇటీవల వచ్చిన కొన్ని సినిమాల్లో రెహమాన్ మ్యూజిక్ బాగుందని చెబుతున్నారు. ఆడు జీవితం, చమ్కీలా చిత్రాలు మ్యూజికల్‌గా బాగున్నాయనే టాక్ ఉంది. అంతేకాదు, తాజాగా విడుదలైన ధనుష్ ‘రాయన్’ సినిమాలోని పాటలు ఆకట్టుకోకపోయినా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం అద్భుతంగా చేశాడనే పేరొచ్చింది.
రెహమాన్ గురించి ప్రస్తుతం వినిపిస్తున్న ఈ మాటలు మెగా అభిమానుల్లో కాస్త ఊరట కలిగిస్తున్నాయని మాత్రం చెప్పొచ్చు. తన సంగీతంలో మునుపటి వాడి, వేడి, ఊపు తీసుకొచ్చేందుకు రెహమాన్ విశ్వ ప్రయత్నం చేస్తున్నాడని ఆ సినిమాల వల్ల తెలుస్తోంది. రెహమాన్ తెలుగులో మ్యూజిక్ చేసిన ఒక్క సినిమా కూడా సూపర్‌హిట్ అవ్వలేదన్న సెంటిమెంట్ ఎలాగూ ఉంది. ఇప్పుడు రామ్‌చరణ్ సినిమాతో దాన్ని కూడా బ్రేక్ చేస్తాడని మెగాభిమానులు ఎంతో కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. ఎందుకంటే బుచ్చిబాబుకి మంచి మ్యూజిక్ సెన్స్ ఉంది. రెహమాన్ నుంచి సూపర్‌హిట్ మ్యూజిక్ తీసుకోవడానికి తనవంతు ప్రయత్నం కూడా చేస్తాడు కాబట్టి ఆర్సి16 మ్యూజికల్‌గా పెద్ద హిట్ అవుతుందని అభిమానులు ఎంతో నమ్మకంగా ఉన్నారు.
Also Read