వివాదంలో అబ్దుల్ కలాం బయోపిక్
on Feb 10, 2020
మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం బయోపిక్ వివాదంలో చిక్కుకుంది. అబ్దుల్ కలాం బయోపిక్‌లో సీనియర్ కమెడియన్ అలీ నటిస్తున్నారనీ, ఈ సినిమాతో ఆయన హాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారనీ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్‌ను న్యూఢిల్లీలో ఆదివారం కేంద్ర సమాచార మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆవిష్కరించారు కూడా. కానీ అధికారికంగా అబ్దుల్ కలాం జీవితంపై సినిమా కానీ, డాంక్యుమెంటరీ కానీ నిర్మించే హక్కులు తన దగ్గర మాత్రమే ఉన్నాయని నిర్మాత అభిషేక్ అగర్వాల్ సోమవారం ప్రకటించారు.
డాక్టర్ కలాంకు సంబంధించి ఏ రూపంలోనైనా రిఫరెన్సులు తీసుకొనే చర్యలకు వేరెవరు పూనుకున్నా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా 'డాక్టర్ అబ్దుల్ కలాం' టైటిల్‌తో తాము నిర్మించబోయే మూవీ పోస్టర్‌ను అభిషేక్ అగర్వాల్ విడుదల చేశారు. 'ఎవ్విరి స్టోరీ హ్యాజ్ ఎ హీరో' అనే ఉప శీర్షికతో డ్రీమ్ మర్చంట్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ నేపథ్యంలో అలీతో కలాం బయోపిక్ తీయడానికి సంకల్పించిన డైరెక్టర్ జగదీష్ దానేటి ఎలా స్పందిస్తారో చూడాలి.