'అనుభవించు రాజా' మూవీ రివ్యూ
on Nov 26, 2021
సినిమా పేరు: అనుభవించు రాజా
తారాగణం: రాజ్ తరుణ్, కాశిష్ ఖాన్, సుదర్శన్, నరేన్, అజయ్, భూపాల్ రాజు, టెంపర్ వంశీ, ఆదర్శ్ బాలకృష్ణ, అరియానా గ్లోరీ, భద్రం, పిళ్లా ప్రసాద్, రవికృష్ణ, పోసాని కృష్ణమురళి, రఘు కారుమంచి
పాటలు: భాస్కరభట్ల రవికుమార్
సంగీతం: గోపీ సుందర్
సినిమాటోగ్రఫీ: నాగేష్ బానెల్
ఎడిటింగ్: చోటా కే ప్రసాద్
ఆర్ట్: సుప్రియ బట్టెపాటి, రామ్‌కుమార్
ఫైట్స్: రియల్ సతీశ్
నిర్మాత: సుప్రియ యార్లగడ్డ
రచన-దర్శకత్వం: శ్రీను గవిరెడ్డి
బ్యానర్స్: అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి
విడుదల తేదీ: 26 నవంబర్ 2021
రాజ్ తరుణ్‌ను హీరోగా పరిచయం చేసిన బ్యానర్స్‌లో ఒకటైన అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన 'అనుభవించు రాజా' పాటలు పాపులర్ అవడంతో ఆ సినిమా వైపు ప్రేక్షకులు దృష్టిపెట్టారు. ట్రైలర్‌లో ఒకవైపు దసరా బుల్లోడి టైపులో కోడి పందాలు ఆడుతూ, జీవితాన్ని పుల్‌గా ఎంజాయ్ చేస్తూ కనిపించిన 'బంగారం' మరోవైపు సెక్యూరిటీ గార్డ్ అవతారంలో కనిపించడంతో వారిలో క్యూరియాసిటీ ఏర్పడింది. ఇదివరకు 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' అనే చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శ్రీను గవిరెడ్డి రూపొందించిన 'అనుభవించు రాజా' ఎలా ఉందంటే...
కథ
హైదరాబాద్‌లో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేసే రాజు (రాజ్ తరుణ్) అదే కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసే శ్రుతి (కాశిష్ ఖాన్) మధ్య పరిచయం ఏర్పడుతుంది. మిస్‌కమ్యూనికేషన్ వల్ల అతడు తమ సంస్థలో తనలాగే సాఫ్టవేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడనుకున్న శ్రుతి అతడికి మనసిస్తుంది. ఇంట్లోవాళ్లు ఆమెకు పెళ్లి ప్రయత్నాలు చేస్తుండటంతో, రాజు గురించి తమవాళ్లకు చెప్తుంది. అయితే ఆ తర్వాత అతడు తమ కంపెనీకి సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడనే విషయం తెలిశాక, బాధపడినా, అతని నిజాయితీ నచ్చి మనసారా అతడ్నే కోరుకుంటుంది. అంతలో రాజును చంపడానికి ఒక గ్యాంగ్ ప్రయత్నిస్తుంది. ఆ ఘర్షణలో మాణిక్యం (ఆదర్శ్) అనే రౌడీ చనిపోతాడు. అప్పుడే రాజుకు సంబంధించిన ఒక కొత్త కోణం శ్రుతికి, అతడి ఫ్రెండ్ సుదర్శన్ (సుదర్శన్)కు తెలుస్తుంది. అప్పుడు వారికి తన గతం చెబుతాడు రాజు. పశ్చిమ గోదావరి జిల్లాలోని యండగండి గ్రామానికి చెందిన బంగార్రాజు అలియాస్ బంగారం అలియాస్ రాజు కోటీశ్వరుడైనప్పటికీ, సొంత ఊరును వదిలిపెట్టి, హైదరాబాద్‌కు ఎందుకు వచ్చాడు, సెక్యూరిటీ గార్డుగా ఎందుకు పనిచేశాడనేది మిగతా కథ.
విశ్లేషణ
సినిమా కథ రెండు నేపథ్యాల్లో నడుస్తుంది. ఒకటి - హైదరాబాద్, రెండు - యండగండి. 'అనుభవించడానికి కావాల్సింది ఆస్తులు కాదు మనుషులు' అనే పాయింట్ చెప్పడానికి డైరెక్టర్ కథలో ఒక క్రైమ్ ఎలిమెంట్‌ను కూడా జోడించాడు. దీనివల్ల కథలో ఆసక్తి పెరుగుతుందని అతను భావించి ఉండాలి. కథనానికి వేగం వస్తుందని నమ్మి ఉండాలి. అందులో నిజం ఉంది కూడా. కానీ ఫస్టాఫ్‌లో హైదరాబాద్‌లో హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ప్రధాన కథ మరుగునపడింది. హీరోయిన్‌కు సంబంధించి తీసిన కొన్ని సన్నివేశాలు కథకు అనవసరమనిపిస్తుంది కూడా. రాజు తన ఐడెంటిటీని రహస్యంగా ఉంచి, తన జీవితానికి సంబంధించిన ఒక మిషన్ మీద హైదరాబాద్ వచ్చాడనే విషయం తెలిసేంత దాకా వచ్చే సన్నివేశాల్లో ఎక్కువ భాగం కాలక్షేపానికి ఉద్దేశించివే. అవి ఏమంత ఆకట్టుకొనేలా లేవు. అందువల్ల ప్రేక్షకుడు కథలో లీనం కావడం కష్టం.
రాజు తన కథను హీరోయిన్‌కు, ఫ్రెండ్‌కు చెప్పడం మొదలయ్యాక.. కథ యండగండికి మారాక కాస్త ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఎంతో మంచివాడైన ప్రెసిడెంట్ (నరేన్)కు పోటీగా నిలబడి, డబ్బుతో, మందుతో ఓట్లు కొల్లగొట్టవచ్చుననుకున్న బంగారం.. అనుకోకుండా ప్రెసిడెంట్ కొడుకు రాహుల్ (రవికృష్ణ) మృతికి కారణమయ్యే సన్నివేశాలను దర్శకుడు ప్రతిభావంతంగా చిత్రించాడు. అక్కడ్నుంచి రాహుల్ హత్య వెనుక ఎవరున్నారనే విషయాన్ని కనుక్కోవడానికి బంగారం ఏం చేశాడనే సన్నివేశాల్ని అతను బాగానే రాసుకున్నాడు.
రాహుల్‌ను కిరాయి హంతకులతో చంపించింది బంగారంకు కొడిపందేల్లో ప్రత్యర్థిగా కనిపించే అమ్మిరాజు (అజయ్) అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో కలిగించి, అసలు హంతకుడిని ప్రవేశపెట్టి ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చేద్దామనేది దర్శకుడి ఉద్దేశం. కానీ హత్య సూత్రధారి ఎవరో ఆడియెన్స్‌లో చాలామంది ఈజీగా గ్రహించేస్తారు. అందువల్ల క్లైమాక్స్‌లో సర్‌ప్రైజ్ అయ్యే ఆడియెన్స్ తక్కువే. కథ నడిచేదంతా బంగార్రాజు పాత్ర చుట్టూనే. ఆ పాత్ర మీద అమితమైన ప్రేమతో మిగతా పాత్రల్ని దర్శకుడు కాస్త చిన్నచూపు చూసినట్లు అనిపిస్తుంది. అందువల్ల ఆ పాత్రవరకూ బలంగా వున్నా, హీరోయిన్ సహా పలు పాత్రలు బలహీనంగా కనిపించాయి. నరేన్ చేసిన ప్రెసిడెంట్ పాత్ర ఒక్కటి వాటికి మినహాయింపు. ప్రెసిడెంట్ కొడుకు రాహుల్ క్యారెక్టర్‌ను మరింత బాగా తీర్చిదిద్దినట్లయితే కథకు అది మరింత బలాన్ని చేకూర్చిపెట్టేది. కొద్దిసేపు కనిపించే అరియానా పాత్ర ప్రయోజనమేమిటో దర్శకుడికే తెలియాలి.
చాలా చోట్ల డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. హుషారైన సన్నివేశాల్లోనే కాకుండా భావోద్వేగపూరిత సన్నివేశాల్లో, కరుణరస ప్రధాన సన్నివేశాల్లో దర్శకుడిలోని రచయిత సత్తా చూపించాడు. సినిమాకు గోపిసుందర్ మ్యూజిక్ ఒక ఎస్సెట్. పాటలకు వినసొంపైన బాణీలను అందించిన ఆయన, సన్నివేశాలకు తగ్గ నేపథ్య సంగీతంతో తన పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించాడు. నాగేశ్ బానెల్ సినిమాటోగ్రఫీ ఇంప్రెసివ్‌గా అనిపించింది. ఉన్నంతలో గోదావరి అందాలను ఆయన కెమెరా చక్కగా చూపించింది. యాక్షన్ సీన్స్ కూడా బాగా వచ్చాయి. కానీ ఒక సీన్‌లో రౌడీ గ్యాంగ్‌తో ఇళ్లమధ్య హీరో ఫైట్ చేస్తుంటే, అక్కడ పెద్ద పెద్ద సౌండ్లు వినిపిస్తుంటే, ఏం జరుగుతోందో చూడ్డానికి ఒక్క ఇంటిలోంచీ ఒక్క మనిషీ బయటకు రాకపోవడం సినిమాలో మాత్రమే కనిపించే విచిత్రం! ఈ విచిత్రాన్ని ఎడిటర్ చోటా కె. ప్రసాద్ గమనించలేదో, గమనించినా ఉపేక్షించాడో!
నటీనటుల పనితీరు
భిన్న ఎమోషన్స్ ఉన్న బంగార్రాజు పాత్రలో రాజ్ తరుణ్ పరిణతి చెందిన నటన ప్రదర్శించాడు. ఎక్కువగా హుషారైన పాత్రల్లో అంతకంటే హుషారుగా కనిపిస్తూ వచ్చిన అతను ఈ సినిమాలో ఒకవైపు హుషారు, ఇంకోవైపు భావోద్వేగం కలగలిసిన పాత్రలో మెప్పించాడు. ఎమోషనల్ క్యారెక్టర్స్‌కి కూడా తను న్యాయం చెయ్యగలనని ప్రూవ్ చేసుకున్నాడు. శ్రుతిగా కాశిష్ ఖాన్ గ్లామరస్‌గా ఉంది. నటనకు ఎక్కువ స్కోప్ లభించకపోయినా ఉన్నంతమేరకు ఆకట్టుకుంది. మంచివాడైన ఊరి ప్రెసిడెంట్ పాత్రలో ఆడుకాలమ్ నరేన్ సునాయాసంగా ఇమిడిపోయాడు. అమ్మిరాజు లాంటి పాత్రలు అజయ్‌కు కొట్టిన పిండి. సుదర్శన్, భద్రం తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు. కిరాయి హంతకులు ఘని, మాణిక్యం పాత్రల్లో టెంపర్ వంశీ, ఆదర్శ్ బాలకృష్ణ మెప్పించారు. భూపాల్‌రాజుకు ఒక కీలక పాత్ర లభించింది కానీ కీలక సందర్భంలో దాన్ని మోయలేకపోయాడు. సెక్యూరిటీ కంపెనీ హెడ్‌గా పోసాని కృష్ణమురళి, ప్రెసిడెంట్ కొడుకు రాహుల్‌గా టీవీ యాక్టర్ రవికృష్ణకు నటించేందుకు ఎక్కువ స్కోప్ లభించలేదు.
తెలుగువన్ పర్‌స్పెక్టివ్
క్రైమ్ ఎలిమెంట్ ఉన్న కామెడీ మూవీగా మనముందుకు వచ్చిన 'అనుభవించు రాజా' మూవీ ఫస్టాఫ్‌లో కంటే సెకండాఫ్‌లో ఒకింత అలరిస్తుంది. రెండు గంటల పది నిమిషాల నిడివి మాత్రమే ఉన్న ఈ సినిమాను కాలక్షేపం కోసం ఒకసారి చూడొచ్చు. పర్ఫార్మెన్స్ పరంగా రాజ్ తరుణ్‌కు పేరు తెచ్చే సినిమా ఇది.
రేటింగ్: 2.5/5
- బుద్ధి యజ్ఞమూర్తి
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
