ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి.. హిట్స్ కొడుతూనే ఉన్నాడు...
on Jan 14, 2025
ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అపజయమెరుగకుండా వరుస విజయాలతో దూసుకుపోయే దర్శకులు అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన సక్సెస్ ఫుల్ దర్శకుడే అనిల్ రావిపూడి. నిజానికి ఆయనను సోషల్ మీడియాలో పలువురు ట్రోల్ చేస్తుంటారు. క్రింజ్ కామెడీ అని విమర్శిస్తుంటారు. అయితే, మీ ట్రోల్స్ మీరు చేసుకోండి.. నేను మాత్రం వరుసగా హిట్స్ కొట్టుకుంటూ పోతాను అన్నట్టుగా అనిల్ రావిపూడి ప్రయాణం సాగుతోంది. (Anil Ravipudi)
కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 'పటాస్' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు అనిల్ రావిపూడి. మొదటి సినిమాతో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్న రావిపూడి.. అక్కడి నుంచి వెనుతిరిగి చూసుకోలేదు. 'సుప్రీమ్', 'రాజా ది గ్రేట్', 'ఎఫ్-2', 'సరిలేరు నీకెవ్వరు', 'ఎఫ్-3', 'భగవంత్ కేసరి' సినిమాలతో వరుస విజయాలను ఖాతాలో వేసుకున్నాడు. వీటిలో 'ఎఫ్-3' కొన్ని ఏరియాలలో మైనర్ లాస్ లు చూసినప్పటికీ, ఓవరాల్ గా సెమి హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఎనిమిదవ చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి మొదటి షో నుంచే పాజిటివ్ వస్తోంది. లాజిక్స్ ని పక్కన పెట్టి చూస్తే, మంచిగా నవ్వుకోవచ్చని సినిమా చూసిన వారంతా అభిప్రాయపడుతున్నారు. ఆ టాక్ కి తగ్గట్టుగానే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి క్యూ కడుతున్నారు. మేజర్ సిటీలలో దాదాపు అన్ని షోలు ఫుల్ అవుతున్నాయి. ప్రస్తుతం జోరు చూస్తుంటే.. హీరో వెంకటేష్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికైతే ఈ సినిమాతో దర్శకుడిగా అనిల్ రావిపూడి మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నట్లే. (Sankranthiki Vasthunam)
తన టార్గెట్ ఫ్యామిలీ ఆడియన్స్ అని అనిల్ రావిపూడి చెబుతుంటాడు. అందుకు తగ్గట్టుగానే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తీసి వరుస హిట్స్ కొడుతున్నాడు. కానీ కొందరు మాత్రం సోషల్ మీడియా వేదికగా క్రింజ్ కామెడీ అంటూ రావిపూడిని పదే పదే టార్గెట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎవరెన్ని కామెంట్స్ చేసినా, ఆఫ్ లైన్ లో ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం అనిల్ రావిపూడి సినిమాలకు ఓటేస్తూనే ఉంటున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ బాగా తగ్గిపోయాయి. అందరూ భారీ బడ్జెట్ తో కూడిన యాక్షన్ సినిమాలు చేస్తున్నారు. వీటి నడుమ ఓ మంచి ఎంటర్టైనర్ వస్తే చూడాలి అనుకునే ప్రేక్షకులు ఎందరో ఉన్నారు. అలాంటి వారికి రావిపూడి సినిమా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అందుకే ఆయన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తున్నాయి. ఏది ఏమైనా ఇప్పుడున్న ట్రెండ్ లో ఒక దర్శకుడు ఎనిమిది సినిమాలు చేసి, ఒక్క ఫ్లాప్ కూడా చూడకపోవడం అనేది అభినందించదగ్గ విషయం.
Also Read