
దర్శకుడిగా వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి.. ఇప్పుడు నటుడిగా కూడా వెండితెరపై సందడి చేయబోతున్నారా? ఇప్పటికే బుల్లితెరపై రెండు షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన, త్వరలో ఓ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అది కూడా విశ్వక్ సేన్ నటిస్తున్న క్రేజీ సీక్వెల్‌లో కావడం విశేషం.
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'ఈ నగరానికి ఏమైంది 2'. మొదటి భాగం 'ఈ నగరానికి ఏమైంది' యూత్ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. నలుగురు స్నేహితుల మధ్య సాగే ఫన్, కామెడీ, ఎమోషన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అదే ఫన్‌ను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు 'ఈఎన్ఈ రిపీట్' పేరుతో సీక్వెల్ సిద్ధమవుతోంది.
ఈ సినిమాలో అనిల్ రావిపూడి ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఆయన ఇందులో కూడా దర్శకుడి పాత్రలోనే కనిపిస్తారట. ఈ సినిమాలో దర్శకుడి పాత్రలో నటిస్తున్న విశ్వక్ సేన్.. అనిల్ రావిపూడిని కలిసే సన్నివేశాలు ఉంటాయని సమాచారం. ఇప్పటికే ఆయనకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో విశ్వక్ సేన్‌తో పాటు అభినవ్ గోమఠం, అనీషా ఆంబ్రోస్, శివాత్మిక రాజశేఖర్, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. రూట్ నోడ్ సినిమా, ఎస్ ఒరిజినల్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నవంబర్ 19న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
ఇది కూడా చదవండి: తెలుగులో సోనీ కొత్త టీవీ ఛానెల్.. ఆ ఛానెళ్లకు షాక్ తప్పదా.?

[Anil Ravipudi In Ee Nagaraniki Emaindi 2, Anil Ravipudi In ENE Repeat, Ee Nagaraniki Emaindi 2, ENE Repeat, Anil Ravipudi, Vishwak Sen, Tharun Bhascker, Telugu Film News]






