బన్నీ చిత్తూరు యాస!
on Mar 3, 2020
'అల.. వైకుంఠపురములో' వంటి కెరీర్ బిగ్గెస్ట్ గ్రాసర్ తర్వాత అల్లు అర్జున్ మరింత ఉత్సాహంతో సుకుమార్ డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు. వరుసగా రెండో బ్లాక్‌బస్టర్ కొట్టాలనే పట్టుదలతో ఉన్న అతను ఆ సినిమాలో పాత్ర కోసం చాలా కష్టపడుతున్నాడు. ఎంతలా అంటే.. తను చేస్తున్న పాత్ర చిత్తూరు యాసలో మాట్లాడుతుంది కాబట్టి, ఆ యాసలో నైపుణ్యం సాధించడానికి ఏకంగా ట్యూటర్‌ను పెట్టుకొనేంత! అవును.. ఇప్పుడు ఫిలింనగర్లో ప్రచారమవుతున్న వార్త ఇది. పాత్ర ప్రకారం సినిమా మొత్తం బన్నీ చిత్తూరు యాసలోనే మాట్లాడతాడని ఆ సినిమా యూనిట్ ద్వారా తెలిసింది. అందుకని అతని డైలాగ్ వెర్షన్ మొత్తం సుకుమార్ అందజేశాడు. వాటిని ఎలా పలకాలో ట్యూటర్ ద్వారా నేర్చుకుంటూ వస్తున్నందువల్లే బన్నీ ఆ సినిమా సెట్స్‌పై ఇంతదాకా అడుగుపెట్టలేదని తెలుస్తోంది. ఈ నెల రెండో వారం నుంచి అతనికి సంబంధించిన సన్నివేశాల షూటింగ్ మొదలవుతుంది. ప్రస్తుతం బన్నీ లేని సన్నివేశాల్ని సుకుమార్ తీస్తున్నాడు.
గ్రామీణ నేపథ్యంలో ఇంటెన్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో 'రంగస్థలం'లో రాంచరణ్ తరహాలోనే బన్నీ కూడా నాటు అవతారంలో కనిపిస్తాడని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్గా ఈ ఏడాది ఇప్పటికే 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ' సినిమాల హిట్లతో మంచి జోరు మీదున్న రష్మికా మందన్న నటిస్తోంది. 2021 వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ మూవీ పూర్తయ్యేలోగా.. అంటే ఈ ఏడాది ద్వితీయార్ధంలో శ్రీరామ్ వేణు డైరెక్షన్లో 'ఐకాన్' మూవీని బన్నీ స్టార్ట్ చేస్తాడని అతని సన్నిహిత వర్గాలు తెలిపాయి. వేణు ప్రస్తుతం పవన్ కల్యాణ్‌తో 'వకీల్ సాబ్' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.