యంగ్ హీరోల సినిమా వేడుకల్లో బన్నీ.. పుష్ప రాజ్ స్ట్రాటజీ అదేనా?
on Oct 29, 2021
వరుస సినిమా ఈవెంట్స్ లో పాల్గొంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేస్తున్నారు. ఇప్పటికే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సక్సెస్ మీట్, 'వరుడు కావలెను' ప్రీరిలీజ్ ఈవెంట్ లో సందడి చేసిన బన్నీ.. శనివారం 'పుష్పక విమానం' ట్రైలర్ రిలీజ్ వేడుకకు హాజరు కానున్నారు. అయితే ఇలా వరుస సినిమా ఈవెంట్స్ లో బన్నీ మెరుస్తుండటంతో.. దీని వెనక 'పుష్ప' మూవీ ప్రమోషన్ స్ట్రాటజీ ఉందా అన్న చర్చలు ఇండస్ట్రీలో జరుగుతున్నాయి.
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సక్సెస్ మీట్ లో అఖిల్ పై, 'వరుడు కావలెను' ప్రీరిలీజ్ ఈవెంట్ లో నాగశౌర్యపై ప్రశంసలు కురిపించిన బన్నీ.. యంగ్ హీరోలకు బూస్ట్ ఇచ్చే మాటలు మాట్లాడారు. బన్నీ లాంటి స్టార్.. యంగ్ హీరోల సినిమాలకు సపోర్ట్ ఇవ్వడం అభినందించదగ్గ విషయం. అయితే ఈవెంట్స్ లో పాల్గొంటూ ఓ వైపు యంగ్ హీరోల సినిమాలకు సపోర్ట్ చేస్తూనే మరోవైపు బన్నీ తన పుష్ప మూవీని ప్రమోట్ చేసుకుంటున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. ఆ రెండు ఈవెంట్స్ లోనూ స్పీచ్ చివర్లో బన్నీ పుష్ప మూవీ ప్రస్తావన తీసుకొచ్చారు. డిసెంబర్ 17 న పుష్పతో మీ ముందుకు వస్తున్నానని అన్నారు. అంతేకాదు తగ్గేదేలే అంటూ పుష్ప డైలాగ్ తో ఫ్యాన్స్ లో జోష్ నింపారు. దీంతో బన్నీ పుష్ప ప్రమోషన్ స్టార్ట్ చేశారని అంటున్నారు.
ఇక ఈవెంట్స్ లో బన్నీ స్పీచ్ లను పరిశీలిస్తే.. భాషలతో సంబంధం లేకుండా తెలుగు, తమిళ్, కన్నడ అన్ని సినిమాలకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. కేవలం టాలీవుడ్ మాత్రమే కాకుండా భారతీయ సినీ పరిశ్రమ అంతా బాగుండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. 'పుష్ప'తో బన్నీ పాన్ ఇండియా స్టార్ మారాలని చూస్తున్న సంగతి తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకునే బన్నీ తన స్పీచ్ తో అందరికీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.
'పుష్ప' మూవీ ప్రమోషన్ స్ట్రాటజీ అనేది పక్కన పెడితే యంగ్ హీరోలను బన్నీ సపోర్ట్ చేయడం అభినందనీయం. మరి 'పుష్పక విమానం' ట్రైలర్ రిలీజ్ వేడుకలో పాల్గొననున్న బన్నీ.. యంగ్ హీరో ఆనంద్ దేవరకొండకు బూస్ట్ ఇచ్చేలా మాట్లాడటంతో పాటు.. మళ్ళీ 'పుష్ప' మూవీ ప్రస్తావన తీసుకొస్తారేమో చూడాలి.