రాజకీయాల్లోకి అల్లు అర్జున్.. క్లారిటీ ఇచ్చిన బన్నీ టీమ్!
on Dec 12, 2024
డిసెంబర్ 4 రాత్రి నుంచి ఈరోజు వరకు ‘పుష్ప2’ కి సంబంధించిన అనేక వార్తలు మీడియాలో, సోషల్ మీడియాలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా 6 రోజులకు రూ.1000 కోట్లు కలెక్ట్ చేసిందనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. దాదాపు వారం రోజులుగా ఎక్కడ చూసినా ‘పుష్ప2’ వార్తే కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. పుష్ప2 కలెక్షన్స్ నుంచి అల్లు అర్జున్‌కి సంబంధించిన వార్తలు రాజకీయాల వైపు టర్న్ తీసుకున్నాయి. గత రెండు రోజులుగా కొన్ని యూ ట్యూబ్ ఛానల్స్‌లో అల్లు అర్జున్ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. దీని గురించే ప్రశాంత్ కిశోర్‌తో బన్నీ భేటీ అయ్యాడనీ, అలాగే పవన్‌కళ్యాణ్‌ని కూడా కలిశాడని చెప్పుకుంటున్నారు. ఈ వార్త బయటికి వచ్చిన తర్వాత నిజంగానే అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తున్నాడా? అనే సందేహం అందరిలోనూ కలిగింది.
అల్లు అర్జున్ ఒక సేవా సంస్థను స్థాపిస్తాడని, అలాగే ఒక బ్లడ్ బ్యాంక్‌ను కూడా ఏర్పాటు చేయబోతున్నారని వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. ఈ ప్రచారం ఊపందుకోవడంతో మేలుకున్న అల్లు అర్జున్ టీమ్ ఎట్టకేలకు స్పందించింది. అతని పేరుతో అధికారికంగా ఒక ప్రకటనను విడుదల చేశారు. ‘అల్లు అర్జున్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నాడనే వార్త నిజం కాదు. అది నిరాధారమైంది కూడా. ఈ విషయంలో ప్రజలకు స్పష్టత ఇవ్వాలన్నది మా ఉద్దేశం. ఏ విషయమైనా అల్లు అర్జున్ టీమ్ అధికారికంగా ప్రకటిస్తుంది. దాన్నే ఆధారంగా చేసుకోవాలి తప్ప ఇలాంటి అర్థం లేని వార్తలను నమ్మవద్దని మనవి చేస్తున్నాం’ అని అల్లు అర్జున్ టీమ్ తమ ప్రకటనలో తెలియజేశారు.
Also Read