'అఖండ' మూవీ రివ్యూ
on Dec 2, 2021
సినిమా పేరు: అఖండ
తారాగణం: బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్, శ్రీకాంత్, పూర్ణ, జగపతిబాబు, ప్రభాకర్, అయ్యప్ప శర్మ, శ్రవణ్, సుబ్బరాజు, అవినాశ్
మాటలు: ఎం. రత్నం
సంగీతం: తమన్
సినిమాటోగ్రఫీ: సి. రాంప్రసాద్
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, తమ్మిరాజు
కళ: ఎ.ఎస్. ప్రకాశ్
ఫైట్స్: స్టన్ శివ, రామ్-లక్ష్మణ్
నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బోయపాటి శ్రీను
బ్యానర్: ద్వారకా క్రియేషన్స్
నిడివి: 2 గంటల 47 నిమిషాలు
విడుదల తేదీ: 2 డిసెంబర్ 2021
సెకండ్ లాక్‌డౌన్ తర్వాత వస్తున్న తొలి భారీ బడ్జెట్ మూవీ కావడంతో 'అఖండ'పై అందరి దృష్టీ నిలిచింది. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా అయినందువల్ల ఈ సినిమాపై వెల్లువెత్తిన అంచనాలు అంబరాన్ని తాకాయనేది నిజం. సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఆ అంచనాలను వేరే లెవల్‌కు తీసుకెళ్లాయి. తెలుగు సినిమాకు ఊపు తెస్తుందనే ఆశలను మోసుకొచ్చిన 'అఖండ' ఎలా ఉందో చూసేద్దాం పదండి...
కథ
అనంతపురంలో ఫ్యాక్షన్‌ను దరిచేరనీయకుండా తన ప్రాంతం సుభిక్షంగా ఉండటానికి కృషి చేస్తుంటాడు మురళీకృష్ణ (బాలకృష్ణ). హాస్పిటల్స్, స్కూల్స్ కట్టించడమే కాకుండా రైతులకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటూ ఉంటాడు. అనంతపురం కలెక్టర్‌గా వచ్చిన శరణ్య బాచుపల్లి (ప్రగ్యా జైస్వాల్) మొదట మురళీకృష్ణను అపార్థం చేసుకొని, తర్వాత అతడి సహృదయం, సంస్కారం అర్థం చేసుకొని అతడికి మనసిచ్చి, ప్రపోజ్ కూడా చేస్తుంది. ఆమె ప్రేమను అంగీరిస్తాడు మురళీకృష్ణ. వారికి ఓ పాప పుడుతుంది. ఆ ఏరియాలో కాపర్ మైన్స్ తవ్వకాల మాటున యురేనియం తవ్వకాలు మొదలుపెడతాడు కిరాతకుడైన వరదరాజులు (శ్రీకాంత్). దానివల్ల అనేకమంది పిల్లలు జబ్బుపడతారు. దానికి కారణమేంటో కలెక్టరాఫీసులో పనిచేసే స్పెషలాఫీసర్ (పూర్ణ) బయటపెట్టడంతో వరదరాజులుతో ఘర్షణ పడతాడు మురళీకృష్ణ. అప్పుడే పిల్లలకు ట్రీట్‌మెంట్ జరుగుతున్న హాస్పిటల్‌పై పవర్‌ఫుల్ బాంబుదాడి జరిగి, పిల్లలు అందరితో పాటు అందులోని స్టాఫ్, మురళీకృష్ణ వల్ల కేంద్రమంత్రిగా ఎదిగిన భరత్‌రెడ్డి (సుబ్బరాజు) కూడా చనిపోతాడు. ఆ ఘటనకు బాధ్యుడిని చేస్తూ మురళీకృష్ణను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేస్తారు. శరణ్యను సస్పెండ్ చేస్తారు. స్పృహతప్పిన కూతుర్ని బెంగళూరు హాస్పిటల్‌కు తీసుకుపోతుండగా శరణ్యను, పాపను చంపడానికి వరదరాజులు మనుషులు ప్రయత్నిస్తారు. అప్పుడొస్తాడు అఖండ. వారిని కాపాడి, వారిని చంపడానికి వచ్చిన దుండగులనందరినీ హతమారుస్తాడు. అచ్చుగుద్దినట్లు మురళీకృష్ణ పోలికలతోనే ఉన్న అఖండ ఎవరు? అక్కడకు ఎందుకొచ్చాడు? వరదరాజులు వెనుక ఉన్న, హాస్పిటల్‌లో బాంబుపెట్టి అనేకమంది అమాయకుల ప్రాణాలను తీసిన పరమ దుర్మార్గుడెవరు? దుష్ట సంహారం ఎలా జరిగిందనేది మిగతా కథ.
విశ్లేషణ
బోయపాటి బలమంతా కథ మీదకంటే శక్తిమంతమైన, భావోద్వేగపూరితమైన సన్నివేశాల కల్పనలో, వాటి చిత్రీకరణలో ఉంది. ఉర్రూతలూగించి, ఉత్తేజపరిచే యాక్షన్ ఎపిసోడ్ల చిత్రీకరణలో ఉంది. 'అఖండ' కూడా ఆ బాటలోనే నడిచింది. మునుపటి సినిమాల తరహాలోనే లాజిక్‌కు అందని సన్నివేశాలెన్ని ఉన్నా, ఎమోషనల్ సీన్స్‌తో వాటి గురించి ఎక్కువ ఆలోచించకుండా చేయగలిగాడు బోయపాటి. ఈ సినిమా బలమంతా కేంద్రీకృతమైంది అఖండ క్యారెక్టర్ మీదే. ఆ క్యారెక్టర్‌ను అత్యంత శక్తిమంతంగా మలచి యాక్షన్ ప్రియులకు కనువిందు చేకూర్చాడు. దేశవ్యాప్తంగా హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడులను అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ, దేవాలయాల పరిరక్షణకు కంకణం కట్టుకున్న అఘోరగా అఖండ పాత్రను మలిచాడు. ధర్మాన్ని పరిరక్షించడానికి హింస చేయడంలో తప్పులేదనే పాయింట్ మీద అఖండ క్యారెక్టర్‌ను డిజైన్ చేశాడు.
ఇంటర్వెల్ ముందు శరణ్య, మూడేళ్ల ఆమె కూతుర్ని కాపాడే సందర్భంలో అఖండ పాత్ర మనకు పరిచయమవుతుంది. 'అఖండ ఆగమనం' ఎపిసోడ్‌ను ఒళ్లు గగుర్పాటు కలిగించే రీతిలో చిత్రించాడు దర్శకుడు. అక్కడ్నుంచి సినిమా చివరి దాకా ఆ టెంపో కంటిన్యూ అవుతుంది. అఖండ పాత్రను ఎక్కువగా యాక్షన్ సీన్ల కోసమే ఉపయోగించడం, ఆ యాక్షన్ ఎపిసోడ్లు సుదీర్ఘంగా కొనసాగడం వాటిని ఇష్టపడే మాస్ ఆడియెన్స్‌ను, బాలయ్య ఫ్యాన్స్‌ను అమితంగా ఆకట్టుకుంటాయనడంలో సందేహం లేదు కానీ, ఫ్యామిలీ ఆడియెన్స్ తెరపై అంతంతసేపు జరిగే బీభత్సాన్ని ఎంతవరకు తట్టుకుంటారనేది సందేహం.
అఖండ ఆగమనానికి ముందు అరెస్టయిన మురళీకృష్ణను క్లైమాక్స్ దాకా డమ్మీగా మార్చేయడం ఆ పాత్ర ఔన్నత్యాన్ని తగ్గించేసిన విషయం దర్శకుడు గ్రహించలేదు. అప్పటిదాకా ఎంతో ఉన్నతంగా దర్శనమిచ్చిన ఆ పాత్రను ఒక సెల్‌లో దిష్టిబొమ్మ తరహాలో కూర్చోబెట్టడం కరెక్టనిపించదు. క్లైమాక్స్‌లో బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ క్యారెక్టర్‌కు స్కోప్ ఇవ్వలేదు. అంటే సీన్‌లోకి అఖండ వచ్చాక సెకండాఫ్‌లో మురళీకృష్ణ పాత్రకు అసలు పనిలేదన్నట్లు కథను తయారుచేశారన్న మాట. కథకుడు కూడా అయిన బోయపాటి చేసిన తప్పు ఇది. ధర్మ పరిరక్షణకు నడుం బిగించిన అఖండ పుట్టుకలో రియాలిటీని కాకుండా ఫాంటసీని నమ్ముకున్నాడు కథకుడు. అతను శివుని అంశతో పుట్టినవాడిగా, శివుడే అఖండ అన్నట్లుగా చూపించాడు. ఇది లాజిక్‌కు ఏమాత్రం అందని విషయం కదా!
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన గజేంద్ర.. కర్నాటకలోని మహారుద్ర పీఠానికి అధిపతి కావడం కూడా కృతకంగా అనిపిస్తుంది. ఇలాంటి నేల విడిచి సాముచేసే విషయాలు బోయపాటి సినిమాల్లో చాలా కామన్. అయినప్పటికీ డ్రామా కంటే ఎమోషన్ మీదే ఎక్కువ దృష్టిపెట్టి, స్క్రీన్‌ప్లేను బిగువుగా రూపొందించి, ఒళ్లు జలదరించే, గగుర్పాటు కలిగించే సన్నివేశాలతో కట్టిపడేశాడు. అందుకే 2 గంటల 47 నిమిషాల 'అఖండ' ఫస్టాఫ్‌లో కొంత బోర్ కొట్టించినప్పటికీ, అఖండ ఆగమనం తర్వాత ఒక ఊపుతో, ఒక భావోద్వేగంతో కొనసాగి ఎంటర్‌టైన్ చేస్తుంది. అయితే హింసను తెరపై అంతసేపు చూడటం మాత్రం సున్నిత మనస్కులకు కొంత ఇబ్బందికరమే. శ్రీకాంత్ చేసిన వరదరాజులు పాత్రను కూడా భీతికొల్పే రీతిలో మలిచాడు బోయపాటి.
ఇలాంటి యాక్షన్ సినిమాలకు ప్రధానంగా కావాల్సింది.. సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తోడ్పాటు. ఆ విషయంలో 'అఖండ'కు పుల్ మార్క్స్ పడతాయి. సీనియర్ సినిమాటోగ్రాఫర్ సి. రాంప్రసాద్ తన అనుభవాన్నంతా ఉపయోగించి, సూపర్బ్ అనిపించే విజువల్స్‌తో యాక్షన్ ప్రియులను అలరించాడు. పాటలకు చక్కని సంగీతాన్నిచ్చిన తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో చెలరేగిపోయాడు. యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు వాటి లీడ్ సీన్స్‌లోనూ, ఎమోషనల్ సీన్స్‌లోనూ గూస్‌బంప్స్ వచ్చాయంటే.. అది అతడిచ్చిన మ్యూజిక్ వల్లే. కోటగిరి వెంకటేశ్వరరావు, ఆయన శిష్యుడు తమ్మిరాజు తమ ఎడిటింగ్ పనితనాన్ని చూపించి, 'అఖండ'ను ఎమోషనల్ డ్రైవ్‌గా మనముందు ప్రెజెంట్ చేశారు. ఎ.ఎస్. ప్రకాశ్ ఆర్ట్ వర్క్ టాప్ క్లాస్‌లో ఉంది. ఇక 'అఖండ'కు ఆయువుపట్టులాంటి యాక్షన్ బ్లాక్స్‌ను స్టన్ శివ, రామ్-లక్ష్మణ్ మలచిన విధానం యాక్షన్ ప్రియులకు కన్నులపంటే.
నటీనటుల పనితీరు
అఖండగా టైటిల్ రోల్‌లో బాలయ్య విశ్వరూపాన్ని ప్రదర్శించారు. విగ్గు లేకుండా ఆ పాత్రలో కనిపించినా, ఆహార్యం పరంగా ఆకట్టుకున్నారు. ఆ క్యారెక్టర్‌కు క్లోజప్ షాట్స్ ఎక్కువ. తన కళ్లతో ఆ పాత్రలోని ఇంటెన్సిటీని ప్రదర్శించి, వహ్వా అనిపించారు బాలయ్య. 'సింహా', 'లెజెండ్' సినిమాల్లో చేసిన పాత్రలను మించి అఖండ పాత్రను మరింత శక్తిమంతంగా ప్రదర్శించి చూపించిన ఆయన తన ఫ్యాన్స్‌కు మహాసంబరాన్ని కలిగించారనేది వాస్తవం. అఖండ పాత్ర వచ్చేంతవరకూ మురళీకృష్ణగా కూడా ఆకట్టుకున్నారు. హీరోయిన్‌గా ప్రగ్యా జైస్వాల్ అలరించింది. గ్లామరస్‌గా కనిపించడమే కాకుండా పర్ఫార్మెన్స్‌కు అవకాశమున్న జిల్లా కలెక్టర్ శరణ్య పాత్రలో చక్కగా రాణించింది.
వరదరాజులుగా శ్రీకాంత్ విలనిజాన్ని అమోఘంగా ప్రదర్శించాడు. అతని ఆహార్యం, అతని నటన విభిన్నంగా కనిపిస్తాయి. ఈ సినిమా తర్వాత అతనికి ఎలాంటి పాత్రలు రాయొచ్చో రైటర్స్‌కు అర్థమవుతుంది. గజేంద్ర అనే విలన్ రోల్ చేసిన నటుడు కూడా ఆ క్యారెక్టర్‌కు అతికినట్లు సరిపోయాడు. అతనికి సహకరించే క్షుద్ర మంత్రగాడు ప్రచండగా అయ్యప్ప శర్మ తనదైన శైలి నటనతో రాణించాడు. కీలకమైన ఆఫీసర్ రోల్‌కు పూర్ణ పరిపూర్ణ న్యాయం చేసింది. డీఎస్పీ రంజన్‌గా నెగటివ్ రోల్‌లో ప్రభాకర్, శ్రీకాంత్ తమ్మునిగా శ్రవణ్, సెంట్రల్ మినిస్టర్ భరత్‌రెడ్డిగా పాజిటివ్ రోల్‌లో సుబ్బరాజు, మెప్పించారు. మిగతా ఆర్టిస్టులు కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
తెలుగువన్ పర్‌స్పెక్టివ్
రోమాలు నిక్కబొడిచే, ఒళ్లు గగుర్పాటు కలిగించే ఎమోషనల్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో 'అఖండ' మూవీ యాక్షన్ ప్రియులను అమితంగా అలరిస్తుంది. అత్యంత శక్తిమంతమైన అఖండ పాత్రలో అంతే శక్తిమంతంగా బాలయ్య నట విశ్వరూపాన్ని చూడ్డం కోసమైనా మళ్లీ మళ్లీ ఈ సినిమాని చూసేవాళ్లుంటారనడంలో అతిశయోక్తి లేదు.
రేటింగ్: 3.25/5
- బుద్ధి యజ్ఞమూర్తి
సర్కారు వారి దెబ్బ.. రూ.5కే అఖండ సినిమా.. ముందుంది ముసళ్ల పండుగ..
సాయంలో ముందుండే సినీ స్టార్లు.. జగన్ దెబ్బకు అంతా దిగాలు..
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
