'మహాసముద్రం'తో డిజప్పాయింట్ చేసిన అజయ్ భూపతి!
on Oct 14, 2021
కార్తికేయను హీరోగా నిలబెట్టిన 'ఆర్ఎక్స్ 100' మూవీతో డైరెక్టర్‌గా అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్నాడు అజయ్ భూపతి. రామ్‌గోపాల్ వర్మ శిష్యుడైన అతనికి అదే ఫస్ట్ ఫిల్మ్. దాంతో టాలీవుడ్‌కు మరో ప్రతిభావంతుడైన దర్శకుడు లభించాడని అందరూ సంతోషపడ్డారు. ఆ సినిమాలో హీరో హీరోయిన్ల క్యారెక్టర్లను అతను మలచిన విధానం, వాళ్ల మధ్య అతను కల్పించిన సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. సినిమా విషాదాంతమైనప్పటికీ దానికి ఘన విజయం సాధించి పెట్టారు ప్రేక్షకులు.
ఆ సినిమా తర్వాత రెండో సినిమా మొదలు కాకముందే అప్పుడప్పుడు వార్తల్లో వ్యక్తిగా మారుతూ వచ్చాడు అజయ్ భూపతి. కారణం.. ఒకరి తర్వాత ఒకరుగా ఇద్దరు పేరున్న హీరోలు ఆ సినిమా నుంచి తప్పుకోవడం. మొదట ఆ సినిమా చేయడానికి రవితేజ ఒప్పుకున్నాడు. తర్వాత తప్పుకున్నాడు. ఈ సందర్భంగా భూపతి చేసిన ట్వీట్ కాంట్రవర్సీ సృష్టించింది. ఆ తర్వాత అతను నాగచైతన్యకు ఈ కథ వినిపించాడు. కానీ చైతూ కూడా దీన్ని తిరస్కరించాడు.
ఎట్టకేలకు శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా సినిమా మొదలుపెట్టి పూర్తి చేశాడు భూపతి. ఫస్ట్ మూవీ వచ్చిన మూడేళ్ల తర్వాత అతడి రెండో సినిమా 'మహాసముద్రం' రిలీజయింది. విడుదలకు ముందు ఈ మూవీకి ట్రెమండస్ క్రేజ్ వచ్చింది. అంచనాలు భారీ స్థాయిలో వెల్లువెత్తాయి. తీరా సినిమా చూస్తే.. 'ఆర్ఎక్స్ 100' తీసిన డైరెక్టరేనా 'మహాసముద్రం' తీసింది.. అనిపించింది. స్టోరీ కానీ, స్క్రీన్‌ప్లే కానీ ఆకట్టుకునేలా లేవు. హీరోల, హీరోయిన్ల క్యారెక్టరైజేషన్స్ విషయంలో భూపతి మెచ్యూరిటీ చూపించలేకపోయాడు.
అసలు హీరోల విషయంలో రాంగ్ కాస్టింగ్ జరిగిందనే అభిప్రాయం కలిగింది. అర్జున్ క్యారెక్టర్‌కు ఎనర్జిటిక్ మాస్ హీరో కావాలి. శర్వానంద్‌కు ఆ తరహా బాడీ లాంగ్వేజ్ లేదు. అందువల్ల ఆ పాత్రకు పూర్తి న్యాయం చేయలేకపోయాడు. విజయ్ నెగటివ్ నుంచి పాజిటివ్‌గా మారే సన్నివేశాలు ఏమాత్రం ఇంప్రెసివ్‌గా లేవు. నెగటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్లో కొత్తగా అనిపించినా, ఆ పాత్రను భూపతి మలచిన తీరుతో ఆకట్టుకోలేకపోయాడు సిద్ధార్థ్. మహా పాత్రను మరింత మెరుగ్గా చూపించవచ్చు. డాన్ ధనుంజయ్ క్యారెక్టర్‌ను చంపినంత పనిచేసి, అతను బతికిన పావుగంట తర్వాత చంపించేయడం ఏమాత్రం తెలివైన పనికాదు.
టైటిల్ కార్డులో 'అజయ్ భూపతి' అనే పేరు వచ్చినప్పుడు థియేటర్లో అతని ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు. క్లైమాక్స్ అయ్యాక వాళ్లంతా సైలెంట్ అయిపోయారు. బరువుగా సీట్లలోంచి లేచి బయటకు కదిలారు. దీన్ని బట్టి ఆ సినిమా వారినెంత డిజప్పాయింట్ చేసిందో ఊహించుకోవాల్సిందే.