Aditya 369 : బాలయ్య ఆల్‌టైమ్ క్లాసిక్ 'ఆదిత్య 369' రీ రిలీజ్ ఎప్పుడంటే..?
on Mar 18, 2025
భారత సినీ చరిత్రలో మొదటి టైమ్ ట్రావెల్ చిత్రం 'ఆదిత్య 369' (Aditya 369). ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీస్ సంస్థ నిర్మించిన చిత్రమిది. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్, 1991లో విడుదలై తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించి, బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని నమోదు చేసింది. అప్పట్లో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో సినిమా చేయాలనే ఆలోచనే అద్భుతం అంటే, ఆ ఆలోచనను అంతే అద్భుతంగా తెర మీదకు తీసుకొచ్చారు సింగీతం. 'ఆదిత్య 369' సినిమాకి బాలయ్య నటన ప్రధాన బలంగా నిలిచింది. ముఖ్యంగా శ్రీ కృష్ణదేవరాయ పాత్రలో బాలకృష్ణను తప్ప మరెవరినీ ఊహించలేము అనేంతలా ఆ పాత్రకు ప్రాణం పోశారు. వెండితెరపై అద్భుతం సృష్టించిన ఈ చిత్రం, మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. (Nandamuri Balakrishna)
'ఆదిత్య 369'ని 4Kలో రీ-రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల మూవీ టీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఈ సినిమాని ఏప్రిల్ 11న మళ్ళీ థియేటర్లలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. (Aditya 369 Re Release)
ఈ సందర్భంగా శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. ''ఈ చిత్రాన్ని 4kలో డిజిటలైజ్ చేశాం. సౌండ్ కూడా 5.1 క్వాలిటీలోకి కన్వర్ట్ చేశాం. ప్రసాద్స్ డిజిటల్ టీం ఆరు నెలల పాటు శ్రమించి చక్కటి అవుట్ పుట్ ఇచ్చారు. 34 ఏళ్ళ క్రితం జూలై 18, 1991న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల్లో ఇప్పటికీ ఎంతో క్రేజ్ ఉంది. రీ రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేయగానే ఎంతో మంది విడుదల తేదీ కోసం ఆసక్తిని కనబరిచారు. అప్పట్లో ఇది చాలా అడ్వాన్స్ సినిమా. ఇప్పటి ట్రెండ్‌కి కూడా కనెక్ట్ అయ్యే సినిమా. అప్పట్లో ఈ సినిమా విడుదల సమయంలో నేను ఎంత ఎగ్జైట్ అయ్యానో, ఇప్పుడు రీ రిలీజ్ సమయంలోనూ అంతే ఎగ్జైటెడ్‌గా ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 11న గ్రాండ్ రీ రిలీజ్ చేస్తున్నాం. నందమూరి అభిమానులకు మాత్రమే కాదు, తెలుగు ప్రేక్షకులకు ఇదొక గొప్ప కానుక. వరుస విజయాలతో ఈ జనరేషన్ ప్రేక్షకులను కూడా ఉర్రూతలూగిస్తున్న బాలయ్య బాబు ప్రభంజనానికి ‘ఆదిత్య 369’ ఒక తీయటి కొనసాగింపుగా నిలుస్తుంది. ఈ సినిమా మరోసారి ప్రేక్షాదరణ పొంది బాలయ్య బాబు హిట్ హిస్టరీని రిపీట్ చేస్తుందన్న నమ్మకం వుంది'' అని అన్నారు.
'ఆదిత్య 369' గురించి ఈ తరం వారికి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ, అప్పట్లో ఈ సినిమా ఒక వండర్. ఈ తరం వారు.. ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద చూసినా.. అప్పట్లో టెక్నాలజీ పెద్దగా లేని సమయంలో, ఇంత గొప్పగా సినిమా తీశారా! అని ఆశ్చర్యపోవడం ఖాయం. మరి 'ఆదిత్య 369' మూవీ రీ రిలీజ్ లో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
