'ఆదిపురుష్' బాక్సాఫీస్ రియాక్షన్: మూడు రోజుల్లో 340 కోట్లు.. ఆ తర్వాత?
on Jun 21, 2023
రాఘవునిగా (రామునిగా) ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' మూవీ చుట్టూ అలుముకున్న వివాదాలు, ఆ సినిమాపై వచ్చిన తీవ్ర విమర్శలు ఇటీవలి కాలంలో మరే సినిమాకూ రాలేదు. భారతీయులకు అందునా హిందువులకు నిత్య పారాయణ పురాణమైన రామాయణం ఆధారంగా సినిమా తీసేటప్పుడు ఎవరైనా చాలా జాగ్రత్తలు వహిస్తారు. ఎంత జాగ్రత్తగా తీసినా ఏదో విషయంలో వివాదం రాకుండా ఉండదు. అలాంటిది.. 'ఆదిపురుష్'ను ఓం రౌత్ తీసిన విధానం రామాయణం గురించి ఏ కాస్తో తెలిసిన వాళ్లనే ఆశ్చర్యపరిస్తే, ఇక శ్రీరామ, హనుమ భక్తుల్ని ఎంతగా షాక్‌కు గురిచేసి ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పటిదాకా రామాయణం ఆధారంగా తీసిన సినిమాల్లో కంటెంట్ పరంగా కానీ, సన్నివేశాల చిత్రీకరణ పరంగా కానీ, క్యారెక్టరైజేషన్స్ పరంగా కానీ వరస్ట్ మూవీ 'ఆదిపురుష్' అంటూ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు.
ఈ విషయం అలా ఉంచితే శ్రీరామునిగా ప్రభాస్ నటించడంతో 'ఆదిపురుష్'కు విడుదలకు ముందే విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఎవరు అవునన్నా, కాదన్నా ఇవాళ పాన్ ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్ ఒక్కడే అనేది నిజం. అందుకే సినిమా విడుదలకు ముందు ఆన్‌లైన్ బుకింగ్స్ స్టార్ట్ చేయగానే నిమిషాల వ్యవధిలో.. తొలిరోజు అంటే జూన్ 16వ తేదీ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. దాదాపు అదే తరహాలో రెండు, మూడు రోజుల టికెట్లు కూడా అప్పుడే అమ్ముడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ. 140 కోట్లు, రెండు రోజులకు రూ. 240 కోట్లు, మూడు రోజులకు రూ. 340 కోట్లను ప్రపంచవ్యాప్తంగా ఆదిపురుష్ వసూలు చేసినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. వారి ప్రకారం రెండో రోజు రూ. 100 కోట్లు, మూడో రోజు మరో రూ. 100 కోట్ల గ్రాస్‌ను ఆ సినిమా కలెక్ట్ చేసింది.
ఏ సినిమాకైనా మొదటి సోమవారం అసలైన పరీక్ష ఎదురవుతుంది. తొలి మూడు రోజుల్లో అంత కలెక్షన్ రావడానికి.. ముందుగానే భారీ స్థాయిలో జరిగిన ఆన్‌లైన్ బుకింగ్స్ కారణమని విశ్లేషకులు చెప్పారు. సోమవారం నుంచి 'ఆదిపురుష్' అసలైన స్టామినా ఏమిటో తెలుస్తుందని కూడా వాళ్లు చెప్పారు. అయినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర మునుపటి రికార్డులన్నింటినీ 'ఆదిపురుష్' చెరిపేస్తుందనీ, సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తుందనీ, సోమవారం నుంచి కూడా కలెక్షన్లు బాగానే ఉంటాయనీ ఒక వర్గం బల్లగుద్దినట్లు వాదిస్తూ వచ్చింది.
చివరకు ఏమైంది? నాలుగు రోజులకు 'ఆదిపురుష్' రూ. 375 కోట్లు వసూలు చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు. అంటే సోమవారం వచ్చిన గ్రాస్ రూ. 35 కోట్లు మాత్రమే. ఆదివారంతో పోలిస్తే 65 శాతం వసూళ్లు పడిపోయాయి. హాలిడేతో పోలిస్తే వర్కింగ్ డేలో కలెక్షన్ తగ్గడం రెగ్యులర్‌గా జరిగేదే. కానీ ఏకంగా ముందు రోజుకంటే 65 శాతం తగ్గడం మాత్రం అసాధారణం. ఇక ఐదు రోజుల వసూళ్లు రూ. 395 కోట్లు అన్నారు. అంటే మంగళవారం ఆ సినిమా కలెక్ట్ చేసింది కేవలం రూ. 20 కోట్లు! ఆదివారంతో పోలిస్తే మంగళవారం 20 శాతం మాత్రమే వచ్చింది. ఏ స్థాయిలో కలెక్షన్లు పడిపోతూ వస్తున్నాయో ఈ అంకెలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ధోరణి శుక్రవారం వరకు ఇలాగే కొనసాగడం ఖాయం. వచ్చే శుక్రవారం పెద్ద సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు కాబట్టి వచ్చే వీకెండ్.. అంటే శని, ఆదివారాలు 'ఆదిపురుష్' వసూళ్లు మెరుగ్గా ఉండవచ్చు కానీ, భారీ స్థాయిలో ఉండవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
దీంతో ఈ సినిమాపై భారీ పెట్టుబడులు పెట్టిన బయ్యర్లు.. అందునా తెలుగు రాష్ట్రాల్లో దీన్ని కొన్న బయ్యర్లు భారీ స్థాయిలో నష్టపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఒక వైపు రామాయణ గాథను భ్రష్టుపట్టించారనే అపవాదు, మరోవైపు భారీ స్థాయిలో పడిపోతున్న వసూళ్లు.. డైరెక్టర్ ఓం రౌత్‌తో పాటు నిర్మాతలని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆదిపురుష్‌ను బ్యాన్ చెయ్యాలనే డిమాండ్ ఊపందుకోవడం వారి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.