.webp)
టాలీవుడ్‌ను పైరసీ భూతం మరోసారి వెంటాడుతోంది. థియేటర్లలో కొత్త సినిమాలు విడుదలైన కొద్ది గంటల్లోనే వాటి పైరసీ కాపీలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవుతుండటం నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారింది. తాజాగా నాలుగు తెలుగు సినిమాలు ఒకే పైరసీ వెబ్‌సైట్‌లో కనిపించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఆకాశంలో ఒక తార’ సినిమా విడుదలైన రోజే పైరసీకి గురికావడం అందరినీ షాక్‌కు గురిచేసింది.
ఇటీవల ఒక సైట్ లో ‘రణబాలి’, ‘కల్ట్’, ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47’ వంటి సినిమాల పైరసీ కాపీలు దర్శమిచ్చాయి. ఈ మూడు సినిమాలను ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు సిటీ స్క్వేర్ మాల్‌లో ఉన్న థియేటర్‌లో రహస్యంగా కెమెరాతో రికార్డ్ చేసినట్లు గుర్తించారు. క్యూబ్ సినిమా టెక్నాలజీస్ నిర్వహించిన ఫోరెన్సిక్ పరిశీలనలో ఈ విషయం బయటపడినట్లు సమాచారం.
ఒకవైపు ఆ దర్యాప్తు కొనసాగుతుండగానే.. తాజాగా నవంబర్ 20న థియేటర్లలో విడుదలైన దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ సినిమా కూడా అదే వెబ్‌సైట్‌లో కనిపించింది. సినిమా విడుదలైన రోజే పైరసీ కాపీ అప్‌లోడ్ కావడంతో చిత్ర బృందంతో పాటు ఫిల్మ్ ఛాంబర్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఈ సినిమా పైరసీ కాపీని గుర్తించిన సమయంలో మరో వెబ్‌సైట్‌లో కనిపించలేదని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు చెందిన యాంటీ వీడియో పైరసీ సెల్ ఈ వ్యవహారాన్ని గుర్తించింది. సెల్ ప్రాజెక్ట్ హెడ్ మనీంద్ర బాబు యర్రా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేశారు. కర్నూలు థియేటర్‌లో సినిమాలను రహస్యంగా రికార్డ్ చేసిన వ్యక్తులను గుర్తించాలని, అక్కడి సీసీటీవీ ఫుటేజ్, సినిమా ప్రదర్శించిన షోల వివరాలు, టికెట్ బుకింగ్ రికార్డులను పరిశీలించాలని కోరారు.
ఇది కూడా చదవండి: ఆకాశంలో ఒక తార మూవీ రివ్యూ
ఫిల్మ్ ఛాంబర్ ఫిర్యాదు ఆధారంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కేసు నమోదు చేసింది. ప్రస్తుతం పైరసీ కాపీలను థియేటర్‌లో రికార్డ్ చేసింది ఎవరు? వాటిని వెబ్‌సైట్‌లోకి అప్‌లోడ్ చేసింది ఎవరు? ఆ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నది ఎక్కడి నుంచి? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ‘ఆకాశంలో ఒక తార’ పైరసీ కాపీ ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపైనా విచారణ జరపాలని ఫిల్మ్ ఛాంబర్ కోరింది.
సినిమా నిర్మాణం కోసం నిర్మాతలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంటారు. అలాంటిది సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీ కాపీలు ఆన్‌లైన్‌లోకి వస్తే బాక్సాఫీస్‌పై ప్రభావం పడే ప్రమాదం ఉంది. పైరసీని అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం టాలీవుడ్‌కు ఆందోళన కలిగిస్తోంది. మరి ఈ కేసు దర్యాప్తులో ఎలాంటి విషయాలు బయటపడతాయో చూడాలి.
మీకు నచ్చవచ్చు:
‘ఈ నగరానికి ఏమైంది 2’ బాక్సాఫీస్ రచ్చ.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే.?
ఒసేయ్ రాములమ్మ సాంగ్.. రష్మిక రౌద్రరూపం.. విజయశాంతి మ్యాజిక్‌ను రిపీట్ చేసిందా.?
[Telugu Movie Piracy, Aakasamlo Oka Tara, Ranabaali, Cult Movie, Aadarsha Kutumbam]






