
వెంకటేశ్–త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. విడుదలైన తొలి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధికారిక పోస్టర్ ద్వారా ప్రకటించింది. ఈ సందర్భంగా ‘బ్లాక్‌బస్టర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్’ అంటూ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది.
శుక్రవారం (అక్టోబర్ 30) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. వెంకటేశ్ కామెడీ టైమింగ్, త్రివిక్రమ్ మార్క్ సంభాషణలు, ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. వీకెండ్‌లో కుటుంబ ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన రావడంతో వసూళ్లు పెరిగినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో వెంకటేశ్‌కు జోడీగా శ్రీనిధి శెట్టి నటించగా.. నారా రోహిత్, నివేదా పేతురాజ్, సత్య, రావు రమేశ్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్. రాధాకృష్ణ నిర్మించారు. తమన్ సంగీతం అందించారు.
మొత్తానికి వెంకటేశ్–త్రివిక్రమ్ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తొలి మూడు రోజుల్లోనే భారీ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ ప్రకటించడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఇక సోమవారం నుంచి వచ్చే రోజుల్లో సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు సాధిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి: బ్లడీ రోమియో.. మొత్తం లీక్ చేసేశారు పాపం.!
[Aadarsha Kutumbam Collections, Aadarsha Kutumbam 75 Crores, Aadarsha Kutumbam Box Office, Aadarsha Kutumbam House No 47, AK47 Box Office, Venkatesh, Trivikram, Srinidhi Shetty]





