ప్రియదర్శి జాతకం బాగుంది!
on Apr 22, 2025

కమెడియన్ నుంచి హీరోగా మారిన వారు ఎందరో ఉంటారు. కానీ, హీరోగా మారి విభిన్న చిత్రాలతో అలరిస్తూ తనదైన ముద్ర వేసేవారు అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన నటులలో ఒకడిగా ప్రియదర్శి పులికొండ సత్తా చాటుతున్నాడు. (Priyadarshi Pulikonda)
2016లో 'టెర్రర్' అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రియదర్శి.. అదే సంవత్సరంలో వచ్చిన 'పెళ్ళి చూపులు' సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక అక్కడి నుంచి వెనుతిరిగి చూసుకోలేదు. కమెడియన్ గా తన మార్క్ చూపిస్తూనే, విభిన్న పాత్రలతో మెప్పిస్తున్నాడు. ముఖ్యంగా హీరోగా నటించిన సినిమాలతో ఎంతో పేరు పొందుతున్నాడు.
2019లో వచ్చిన 'మల్లేశం' సినిమాతో హీరోగా మారిన ప్రియదర్శి.. మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అలాగే 'బ్రోచేవారెవరురా', 'జాతి రత్నాలు' వంటి సినిమాలలో హీరోలకు సమానమైన పాత్రలు పోషించి మెప్పించాడు. ఇక 'బలగం'లో హీరోగా నటించి, ప్రశంసలు అందుకోవడమే కాకుండా, ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. గతేడాది 'డార్లింగ్'తో నిరాశపరిచినప్పటికీ, ఈ ఏడాది 'కోర్ట్'తో మరో ఘన విజయాన్ని అందుకున్నాడు. 'బలగం', 'కోర్ట్' సినిమాలు ప్రియదర్శిని ప్రత్యేకంగా నిలిపాయని చెప్పవచ్చు.
ఇటీవల 'కోర్ట్'తో ఆకట్టుకున్న ప్రియదర్శి.. ఇప్పుడు సారంగపాణిగా అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ప్రియదర్శి హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సారంగపాణి జాతకం' (Sarangapani Jathakam). శ్రీదేవీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు ఇంద్రగంటికి క్లీన్ ఎంటర్టైనర్స్ తీస్తాడనే పేరుంది. పైగా ప్రచార చిత్రాలు కూడా మెప్పించాయి. మరి ఈ సినిమాతో ప్రియదర్శి మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి. 'సారంగపాణి జాతకం' హిట్ అయితే హీరోగా ప్రియదర్శికి మరిన్ని సినిమాలు క్యూ కడతాయి అనడంలో సందేహం లేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



