'సలార్' కూడా చేతులెత్తేసింది.. ప్రభాస్ హిట్ కొట్టేది ఎప్పుడు?
on Jan 22, 2024
'బాహుబలి-2' తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన సినిమాలన్నీ నిరాశ పరుస్తున్నాయి. ఇప్పటిదాకా నాలుగు సినిమాలు రాగా, ఒక్కటి కూడా బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా నిలవలేకపోయింది. ఆఖరికి ఇటీవల వచ్చిన 'సలార్'(Salaar) సైతం ప్రభాస్ కి హిట్ అందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
'బాహుబలి' తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సినిమా 'సాహో'. ఈ మూవీ హిందీ వెర్షన్ భారీ వసూళ్లు రాబట్టినప్పటికీ.. ఓవరాల్ గా మాత్రం 80 శాతం రికవర్ చేసి యావరేజ్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన 'రాధేశ్యామ్' మాత్రం కేవలం 40 శాతం రికవర్ చేసి డిజాస్టర్ గా మిగిలింది. ఇక విడుదలకు ముందు ట్రోల్స్ ఎదుర్కొన్న 'ఆదిపురుష్' కూడా టాక్ తో సంబంధం లేకుండా 80 శాతానికి పైగా రికవర్ చేసి యావరేజ్ అనిపించుకుంది. అయితే ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర విన్నర్స్ గా నిలవకపోవడానికి కారణాలు.. కంటెంట్ వీక్ గా ఉండటం, బిజినెస్ భారీగా జరగడం.
ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రూపొందిన 'సలార్'తో ప్రభాస్ అన్ని లెక్కలు సరిచేస్తాడని, ఈ సినిమా రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయడం ఖాయమని అందరూ బలంగా నమ్మారు. అందుకు తగ్గట్టుగానే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. వరల్డ్ వైడ్ గా రూ.600 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సత్తా చాటింది. అయినప్పటికీ క్లీన్ హిట్ ని అందుకోలేకపోయింది. ట్రేడ్ వర్గాల ప్రకారం, ఏకంగా రూ.345 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ సినిమా.. రూ.333 కోట్ల షేర్ తో 95 శాతానికి పైగా రికవర్ సాధించి స్వల్ప నష్టాలను చూసింది. ఆ స్థాయి బిజినెస్ జరగకుండా ఉంటే ఈ సినిమా ఆ స్వల్ప నష్టాలను కూడా చూసేది కాదని అంటున్నారు. పైగా వయలెన్స్ ఎక్కువగా ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా చూడటానికి పెద్దగా ఆసక్తి చూపలేదని.. యాక్షన్ తో పాటు ఎమోషన్స్ కూడా అద్భుతంగా పండినట్లయితే 'సలార్' బాక్సాఫీస్ దగ్గర ఊహించని సంచలనాలు సృష్టించేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో 'కల్కి 2898 AD', 'రాజా సాబ్', 'స్పిరిట్' వంటి సినిమాలు ఉన్నాయి. మే 9న విడుదల కానున్న కల్కి.. గ్లోబల్ లెవెల్ లో సత్తా చాటుతుందనే అంచనాలు ఉన్నాయి. మరి ఆ సినిమాతో అయినా ప్రభాస్ తన రేంజ్ సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి.
Also Read