మీకసలు బుద్దుందా.. విజయశాంతి ఫైర్..!
on Apr 16, 2025

సోషల్ మీడియాలో కొందరు హద్దుమీరి ప్రవర్తిస్తుంటారు. సినీ, రాజకీయ ప్రముఖలను వ్యక్తిగత విషయాలతో ట్రోల్ చేయడం తమ హక్కుగా భావిస్తుంటారు. అంతటితో ఆగకుండా ప్రముఖుల కుటుంబ సభ్యులను, ఇంటి ఆడవారిని కూడా వదలకుండా దారుణంగా ట్రోల్ చేస్తుంటారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపిస్తుండగా.. తాజాగా సీనియర్ నటి, తెలంగాణ ఎమ్మెల్సీ విజయశాంతి కూడా వారిపై ఫైర్ అయ్యారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా.. ఇటీవల తిరుమలలో మొక్కు చెల్లించుకున్న సంగతి తెలిసిందే. సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన తమ కుమారుడు మార్క్ శంకర్ క్షేమంగా బయటపడటంతో.. అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకొని, తలనీలాలు సమర్పించారు. అలాగే, అన్నదానం ట్రస్ట్‌కి విరాళమిచ్చి సేవ కూడా చేశారు.
విదేశాల్లో పుట్టి పెరిగినప్పటికీ, వేరే మతానికి చెందినప్పటికీ.. హిందూ ధర్మాన్ని అనుసరించడంతో అన్నా లెజినోవాపై ప్రశంసలు కురిశాయి. సింగపూర్ నుంచి కుమారుడిని తీసుకొని భారత్ కి వచ్చిన వెంటనే.. తిరుమలకు వెళ్ళి మొక్కు చెల్లించడంతో.. తల్లి ప్రేమ అంటే ఇదేనేమో అంటూ ఎందరో ప్రశంసించారు. అయితే కొందరు మాత్రం ఇలాంటి సమయంలోనూ ట్రోల్స్ ఆపలేదు. వేరే మతం అయ్యుండి.. తిరుమల వెళ్లడమేంటి? తలనీలాలు ఇవ్వడమేంటి? అంటూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. అలా ట్రోల్ చేస్తున్న వారిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా విజయశాంతి సైతం.. అలా ట్రోల్ చేస్తున్న వారిపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

"దేశం కాని దేశం నుంచి వచ్చి, పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ గారి సతీమణి అన్నా లెజినోవా గారిపై కొందరు కామెంట్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత అసమంజసం." అని విజయశాంతి అన్నారు. "అనూహ్యంగా జరిగిన దురదృష్టకర అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడినందుకు, ఆ విశ్వాసాన్ని నిలబెట్టిన నిలువెత్తు దైవం మన శ్రీ వెంకటేశునికి కృతజ్ఞతగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తలనీలాలిచ్చి, అన్నదానం ట్రస్ట్‌కి విరాళం సమర్పించి సేవ కూడా చేశారు. సంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెజినోవా గారిని కూడా ట్రోల్ చేసేవారిని తప్పు అని చెప్పక తప్పడం లేదు." అని విజయశాంతి రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



