విజయనిర్మల... ఓ విజయ దిక్సూచి
on Jun 27, 2019
విజయనిర్మల... బాలనటి. ఏడేళ్ల వయసులో తెరంగేట్రం చేశారు. తర్వాత పలు చిత్రాల్లో వేషాలు వేశారు. చిన్నతనంలో అబ్బాయిగా ఎక్కువ సినిమాల్లో నటించారు. 'రంగులరాట్నం'తో కథానాయికగా తెలుగు తెరపై అడుగుపెట్టారు. 'మీనా'తో మెగాఫోన్ పట్టారు. సుమారు 45 చిత్రాలకు దర్శకత్వం వహించారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కారు. నిర్మాతగా 15 చిత్రాల వరకూ తీశారు. దాదాపుగా అన్ని చిత్రాలకు ఆమె దర్శకత్వం వహించారు. ఆమె అసలు పేరు నిర్మల. అప్పటికి చిత్రసీమలో నిర్మలమ్మ ఉండటంతో తన పేరును విజయనిర్మలగా మార్చుకున్నారు. పేరుకు తగ్గట్టు వరుస విజయాలు సాధించారు.
విజయనిర్మల అంటే నటి, నిర్మాత, దర్శకురాలు గుర్తొస్తారు. అంతేనా? కానే కాదు... ఆమె ఓ విజయ దిక్సూచి. ఎంతోమంది మహిళలకు స్ఫూర్తినిచ్చిన ఐరన్ లేడీ. తెలుగు చిత్రసీమలో ఇప్పుడు జీవిత, నందినీరెడ్డి వంటి మహిళా దర్శకులు కనిపిస్తున్నారు. కానీ, విజయనిర్మల మెగాఫోన్ పట్టిన టైమ్‌లో ఎవరున్నారు? మేల్ డామినేషన్ ఇండస్ట్రీలో మహిళలు నటించడం మినహా మిగతా శాఖలలో అడుగు పెట్టడం అరుదైన రోజుల్లో దర్శకురాలిగా విజయాలు సాధించి, తన తర్వాత వచ్చేవారికి ఓ దారి చూపించారు. నటన, దర్శకత్వ, నిర్మాణ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించి మహిళలు ఏకకాలంలో రెండు మూడు బాధ్యతలను నిర్వర్తించగలరని చాటి చెప్పారు. చివరి రోజుల వరకూ సినిమాయే శ్వాసగా జీవించారు. ఆమె జీవితం ఎంతోమందికి ఓ దిక్సూచి. విజయ దిక్సూచి.