ఉంగరాల రాంబాబు మూవీ రివ్యూ
on Sep 15, 2017
తారాగణం:- సునీల్, మియా, ప్రకాష్ రాజ్, పోసాని..
దర్శకత్వం:- క్రాంతి మాధవ్
నిర్మాత:- పరుచూరి కిరీటి
సునిశితమైన భావాలు, సామాజిక స్పృహ.. వీటికీ హాస్యానికి అస్సలు పొసగదు. ఉన్నతమైన భావాలతో సినిమాలు తీసే దర్శకులు.. తమకు ఏ మాత్రం సంబంధం లేని కామెడీని తెరపై చూపిస్తే... ఆడియన్స్ కి ఏడుపొస్తుంది. అలాగే... కామెడీ సినిమాలు తీసే దర్శకులు.. తెరపై నీతులు చెబితే... చూడ్డానికి రోతగా ఉంటుంది. నేను చెప్పేది కేవలం నేటి దర్శకుల గురించి మాత్రమే... గ్రహించగలరు.
క్రాంతిమాధవ్ అనగానే... ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు.. సినిమాలు గుర్తొస్తాయ్. ఆ రెండు సినిమాలు.. అతని అభిరుచికి అద్దం పట్టాయ్. నిజంగా చెప్పుకోవాలి.. ఆ సినిమాలు చూసి... తెలుగు తెరకు మంచి దర్శకుడు దొరికాడనే అందరూ అనుకున్నారు. మూడో ప్రయత్నంగా కొంత విరామం తీసుకొని ‘ఉంగరాల రాంబాబు’తో ఈ శుక్రవారం వచ్చాడు క్రాంతిమాధవ్. టైటిలే ‘ఇది క్రాంతిమాధవ్ సినిమా కాదే’ అనిపించేలా ఉంది. మరి సినిమా ఎలా ఉంది? అనేది తెలుసుకునే ముందు కథ గురించి చెప్పుకుందాం.
కథ:-
జాతకాల పిచ్చోడైన కోటీశ్వరుడు రాంబాబునీ... ఓ అమ్మాయ్ ‘తానే నీ అదృష్ట దేవతని’ అని నమ్మిస్తుంది. అసలే మనోడికి జాతకాల పిచ్చి... నమ్మకేం చేస్తాడు. ఇక ఆ అమ్మాయి ప్రేమలో మునిగి తేలతాడు. ‘మన పెళ్లవ్వాలంటే మా నాన్నను ఒప్పించాల్సిందే..’ అని ఆ అమ్మాయ్ పట్టుబట్టడంతో.. ఆ అమ్మాయ్ వాళ్ల ఊరొస్తాడు రాంబాబు. కమ్యునిజం భావాలు కలిగిన ఆ అమ్మాయ్ తండ్రి.. ముందు పెళ్లికి ఒప్పుకోడు. తర్వాత ఆ అమ్మాయ్ బాధను అర్థం చేసుకొని రాంబాబుకి కొన్ని పరీక్షలు పెడతాడు. మరి ఆ పరీక్షల్లో రాంబాబు నెగ్గాడా? ఆ అమ్మాయ్ ని పెళ్లాడాడా? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:-
ఈ చిన్న కథకు... ఉపయోగం లేని ఉప కథలు చాలా తగిలించాడు క్రాంతి మాధవ్. సునీల్ చిన్నప్పటి ఎపిసోడ్ ఓ కథ. పోసాని కృష్ణమురళి కామెడీ ట్రాక్ ఓ కథ. విలన్ ఆశిష్ విద్యార్థి ట్రాక్ ఓ కథ. ఈ అనవసరపు తోకలే ఈ సినిమాను పాడు చేశాయ్. ఇక సినిమా విషయాకొస్తే.. ఫస్టాఫ్ దారుణం. ముఖ్యంగా దుబాయ్ ఎపిసోడ్ ఒకటుంది. మల్టిప్లెక్సుల్లో సైతం అసహనపు ఆహాకారాలు వినిపించడం ఇదే ప్రథమం. అంత దారుణం అన్నమాట.
సెకండ్ హాఫ్ అంతా కేరళలో నడుస్తుంది. హీరోయిన్ తండ్రి పేరు నాయర్. కేరళ రాష్ట్రంలోనే పేరుమోసిన కమ్యూనిస్ట్. ప్రకాశ్ రాజ్ చేశాడు. ఆ ఎపిసోడ్ చూస్తే... అసలు కథ కేరళలో జరుగుతోందా? లేక గుంటూరు జిల్లా కర్లపాలెంలో జరుగుతోందా అర్థం కాదు. ఒక్కడు కాకపోతే.. ఒక్కడైనా మలయాళీలా ఉండడు. కేరళ సాంప్రదాయం మచ్చుకైనా కనిపించదు. అదీగాక.. తెలుగు యాసలన్నీ వినిపిస్తుంటాయ్. తెలుగు సిమా కాబట్టి కొన్ని తప్పవు. కనీ కనీసం కేరళ వాసనైనా కనిపించకపోతే ఎలా? కథలో మంచి జరగ్గానే.. హీరో హీరోయిన్లు కొంటెగా ముఖాలు చూసుకుంటారు. కట్ చేస్తే ఫారిన్ లో పాట. ఎప్పటి వ్యవహారమండీ ఇది? ఇంకా 1987లోనే ఉంటే ఎలా? ఇది 2017 కదా! క్రాంతిమాధవ్ మునుపటి సినిమాల్లో ఈ తరహా టేకింగ్ కనిపించదు. ఎక్కడ జరిగిందీ పొరబాటు? సినిమా వదలగానే... బయటకొస్తూ... స్వర్గంలోకి వస్తున్నట్లు ఫీలవుతున్నారు జనాలు.
ఇక సునీల్.. స్వతహాగా మంచి నటుడు. బాగా చేశాడు. కానీ ఉపయోగం ఏముంది? శంఖంలో పోస్తేనే కదా తీర్థం. హీరోయిన్ కి అందం, అభినయం విషయాల్లో పాస్ మార్కులేయొచ్చు. ప్రకాశ్ రాజ్ నటన గురించి చెప్పేదేముంది? సాంకేతికంగా కెమెరా వర్క్ బావుంది. పాటల్లో ఒక్క పాటేదో పర్లేదనిపించింది.
ఫైనల్ టచ్:
చివరిగా చెప్పేదేంటంటే... ఎవరికి తెలిసిన దారిలో వాళ్లు ప్రయాణిస్తే.. ఏ బాధా ఉండదు. తెలీని దారిలో ప్రయాణిస్తేనే.. దారి తెలీక బిత్తర బిత్తర చూపులు చూడాల్సొస్తుంది. అదనమాట విషయం.
రేటింగ్:- 1.5
- ఎన్.బి

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
