బాలయ్య, బోయపాటి మధ్య విభేదాలు.. ఈ ఈవెంట్ తో క్లారిటీ వచ్చేసింది!
on Nov 19, 2025

బాలకృష్ణ, బోయపాటి కాంబోలో అఖండ-2
షూటింగ్ టైంలో విభేదాలు అంటూ వార్తలు
'జాజికాయ' సాంగ్ లాంచ్ ఈవెంట్ తో క్లారిటీ
టాలీవుడ్ లో ఉన్న క్రేజీ కాంబినేషన్స్ లో నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), దర్శకుడు బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబో ఒకటి. అసలు వీరి కలయికలో సినిమా వస్తుందంటే.. తెలుగునాట ఉండే అంచనాలే వేరు. ఇప్పటికే వీరి కాంబో.. 'సింహా', 'లెజెండ్', 'అఖండ' సినిమాలతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ చూసింది. ఇప్పుడు 'అఖండ-2'తో డబుల్ హ్యాట్రిక్ కి శ్రీకారం చుడుతోంది. (Akhanda 2: Thaandavam)
డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న 'అఖండ-2'పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అయితే కొద్దినెలల క్రితం ఈ మూవీ షూటింగ్ సమయంలో బాలకృష్ణ, బోయపాటి మధ్య విభేదాలు వచ్చాయంటూ ప్రచారం జరిగింది. స్క్రిప్ట్ వర్క్ లో ఆలస్యం, నటీనటుల ఎంపిక, డైరెక్షన్ డిపార్ట్మెంట్ పనితీరు వంటి విషయాలలో బాలయ్య అసంతృప్తి వ్యక్తం చేశారని.. అలా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని వార్తలు చక్కర్లు కొట్టాయి.
బాలయ్య, బోయపాటి మధ్య విభేదాలు అనే వార్తలు ఫ్యాన్స్ ని బాగా డిజప్పాయింట్ చేశాయి. ఈ విభేదాలు ముదిరితే.. 'అఖండ-2' తర్వాత బాలయ్య-బోయపాటి కాంబోలో మరో సినిమా రాదేమో, ఈ క్రేజీ కాంబోకి ఇంతటితో ఎండ్ కార్డు పడుతుందేమో అని అభిమానులు ఆందోళన చెందారు.
అయితే ఒకే ఒక్క ఈవెంట్.. అభిమానుల ఆందోళను దూరం చేసింది. బాలకృష్ణ, బోయపాటి మధ్య విభేదాలు లేవని.. ఇద్దరి మధ్య ఎప్పటిలాగే మంచి బాండింగ్ ఉందని తెలిసేలా చేసింది.

Also Read: ఆంధ్ర కింగ్ తాలూకా ట్రైలర్.. రామ్ ఈ సినిమా చేయడం కరెక్టేనా..?
అఖండ-2 సెకండ్ సింగిల్ 'జాజికాయ' సాంగ్ లాంచ్ మంగళవారం సాయంత్రం వైజాగ్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో బాలకృష్ణ, బోయపాటి శ్రీనులకు.. ఒకరిపై ఒకరికి ఉండే ప్రేమ, అభిమానం స్పష్టంగా కనిపించాయి. సొంత మనిషిలా బోయపాటి భుజంపై బాలయ్య చెయ్యి వేసి నిల్చోడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అలాగే, ఈ ఈవెంట్ లో బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. "నాకు ఊపిరి ఉన్నంతవరకు, బాలకృష్ణ గారికి ఓపిక ఉన్నంతవరకు మా కాంబినేషన్ లో సినిమాలు వస్తూనే ఉంటాయి" అంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపారు.
ఇక బాలకృష్ణ తన స్పీచ్ లో 'లెజెండ్' సినిమా ప్రస్తావన తీసుకురాగా.. బోయపాటి మరోసారి మైక్ అందుకొని.. వైజాగ్ బీచ్ లో లెజెండ్ షూటింగ్ ఇన్సిడెంట్ ని షేర్ చేసుకున్నారు. డూప్ లేకుండా బాలకృష్ణ గారు గుర్రం మీద 110 స్పీడ్ లో వెళ్ళి గ్లాస్ ని గుద్దితే.. అక్కడున్న వేలాదిమంది ఐదు నిమిషాల పాటు ఆగకుండా క్లాప్స్ కొట్టారని గుర్తుచేసుకున్నారు. సినిమా కోసం బాలయ్య గారు ఎంతటి రిస్క్ అయినా చేస్తారని ప్రశంసించారు.
మొత్తానికి 'జాజికాయ' సాంగ్ లాంచ్ లో బాలకృష్ణ, బోయపాటి బాండింగ్ చూడముచ్చటగా అనిపించింది. ఇద్దరూ సరదాగా నవ్వుతూ వేదిక పంచుకొని.. అక్కడ ఉన్న వారిలో ఉత్సాహం నింపడమే కాకుండా... తమ మధ్య విభేదాలు తలెత్తాయన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని చెప్పకనే చెప్పేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



