చుక్కలు చూపిస్తున్న త్రివిక్రమ్
on Nov 26, 2015
త్రివిక్రమ్ అంటే ఛమక్కులే కాదు, చుక్కలు కూడా చూపించగలడని నిరూపించుకొన్నాడు. అందరు దర్శకుల్లానే.. నిర్మాతతో చెడుగుడు ఆడుకొంటున్నాడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అ.ఆ. నితిన్, సమంత జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాధాకృష్ణ నిర్మాత. ఆయనతో త్రివిక్రమ్‌కి మంచి సాన్నిహిత్యమే ఉంది. ఇప్పుడు ఏమైందో.. నిర్మాతకు మాత్రం చుక్కలు చూపిస్తున్నాడట.
అ.ఆ మొదలై రెండు నెలలు కావొస్తున్నా, షూటింగ్ మాత్రం ఎక్కడ వేసి గొంగళి అక్కడే అన్న చందాన మారిందట. రోజుకి రెండు మూడు షాట్స్ కన్నా ఎక్కువ చేయడం లేదట. త్రివిక్రమ్ మూడ్ బాగున్న రోజున షూటింగ్ సజావుగా సాగుతోందని, లేదంటే పేకప్ చెప్పేసి వెళ్లిపోతున్నాడని టాక్. లొకేషన్లో త్రివిక్రమ్ ఆలస్యంగా వస్తున్నాడట. ఆయన వచ్చేలోగా అసిస్టెంట్ డైరెక్టర్లు షాట్ రెడీ చేస్తున్నారట. త్రివిక్రమ్ వచ్చి సీన్ పేపర్ ఇచ్చేంత వరకూ ఎదురుచూపులు తప్పడం లేదట. తీరా త్రివిక్రమ్ వచ్చాక.. సెట్లో అది బాలేదు, ఇది బాలేదు అని అలిగి వెళ్లిపోతున్నాడట. ఈ బాధ భరించలేకే..ఆర్ట్ డైరెక్టర్ ఈ సినిమాని వదిలేసి వెళ్లిపోయాడని, మరో ఆర్ట్ డైరెక్టర్‌ని తెచ్చుకొన్నాడని తెలుస్తోంది.
ఒకరోజు షూటింగ్ అర్థాంతరంగా ఆగిపోతే నిర్మాతలకు లక్షల్లో నష్టాలొస్తాయి. అయినా సరే... రాధాకృష్ణ అన్నీ మౌనంగా భరిస్తున్నాడట. నితిన్ కూడా పైకి ఏమీ అనకపోయినా, లోలోపల చాలా ఇబ్బంది పడున్నాడని టాక్. మరి త్రివిక్రమ్‌కి ఏమైందో.. ఎప్పుడు మారతాడో, ఎప్పుడు లైన్లోకొస్తాడో...??