నిర్మాతకు టోకరా ఇచ్చి 8 కోట్లు స్వాహా చేసిన డైరెక్టర్?
on Jul 3, 2017
ఇదివరకూ ఒక నటుడ్ని పరిచయం చేయాలంటే.. అందం, అభినయం, ప్రతిభ ఇలా చాలా విషయాలను పరిగణలోకి తీసుకొని అతడ్ని కెమెరా ముందుకు తెచ్చేవారు. తర్వాత పరిస్థితులు మారాయి. హీరోల కొడుకులు హీరోలుగా మారడం మొదలైంది. వాళ్లకు నటన రాకపోయినా, అందంగా లేకపోయినా తర్ఫీదు ఇప్పించి, ముఖానికి సర్జరీలు గట్రా చేయించి, కెమెరా ముందుకు తేచ్చేవారు. సినిమా సరిగ్గా ఆడకపోయినా సరే... సినిమాల మీద సినిమాలు తీస్తూ బలవంతంగా జనాలమీద రుద్దేవారు. ఇప్పటి పరిస్థితులు దానికి కూడా భిన్నం. కుర్రాడు డబ్బున్నోడైతే చాలు, అందం, అభినయంతో పనిలేదు. సినీ నేపథ్యం లేకపోయినా స్ర్కీన్ మీదకు తెచ్చేస్తున్నారు.
ఈ ఉపోద్ఘాతం అంతా దేనికంటే... ఈ మధ్య ఓ సినిమా విడుదలైంది. ఆ హీరోను పోస్టర్లపై చూసినప్పట్నుంచీ జనాల్లో ఒకటే రచ్చ.. ’ఈ కుర్రాడేంటి, హీరో ఏంటి?‘ అని. ఇక ఈగలు తోలుకోవడం థియేటర్ల వంతైంది. పట్టుమని పది మంది కూడా థియేటర్లలో ఉండటం లేదంటే... పరిస్థతి అర్థం చేసుకోవచ్చు. పైగా సదరు చిత్ర నిర్మాత ఈ సినిమా మేకింగ్ కి మాత్రమే 11 కోట్లు కేటాయించారట. అయితే... దర్శకుడు గారు మూడు కోట్లతో మేకింగ్ ని ముగించి, మిగిలింది తన ఖాతాలో జమ చేసుకున్నాడని ఫిలింనగర్ టాక్. పోనీ ఆ దర్శకుడేమైనా కొత్తవాడా అంటే అదీ కాదు.. అగ్ర హీరోలందరికీ విజయాలిచ్చిన దర్శకుడు. పేషన్తో కాకుండా కేవలం డబ్బు సంపాదన కోసమే ఇలాంటి సినిమాలు చేయడం పరిశ్రమకు కూడా మంచిది కాదని పలువురు వాపోతున్నారు. ఏది ఏమైనా నింద అంతా కొత్త హీరోనే మూట కట్టకున్నట్టయ్యింది... పాపం.