2025 రౌండప్.. సర్ ప్రైజ్ చేసిన కొత్త దర్శకులు.. మీ ఫేవరెట్ ఎవరు?
on Dec 29, 2025
.webp)
2025కి శుభం కార్డు పడినట్టే. ఈ ఏడాది పెద్ద సినిమాలు పెద్దగా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయలేకపోయాయి కానీ.. చిన్న సినిమాలతో కొందరు కొత్త దర్శకులు సర్ ప్రైజ్ చేశారు. పలు చిన్న సినిమాలు ప్రేక్షకుల మెప్పుపొందడమే కాకుండా, ప్రొడ్యూసర్స్ కి లాభాలు తెచ్చి పెట్టాయి. ఈ ఏడాది తమ తొలి సినిమాతోనే విజయాన్ని అందుకొని, అందరి దృష్టిని ఆకర్షించిన కొత్త దర్శకులు ఎవరంటే..?
న్యాచురల్ స్టార్ నానికి చెందిన 'వాల్ పోస్టర్ సినిమా బ్యానర్'లో రూపొందిన 'కోర్ట్'(Court) సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు రామ్ జగదీష్. పోక్సో యాక్ట్ నేపథ్యంలో రూ.5 కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ.. రూ.55 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి, ఘన విజయం సాధించింది. ఈ సినిమాతో రామ్ జగదీష్ ప్రతిభగల దర్శకుడిగా పేరు తెచ్చుకోవడమే కాకుండా, నాని బ్యానర్ లోనే మరో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు.
ఈ ఏడాది చిన్న సినిమాల్లో పెద్ద సర్ ప్రైజ్ అంటే 'లిటిల్ హార్ట్స్'(Little Hearts) అని చెప్పవచ్చు. ఈటీవీ విన్ తో కలిసి ఆదిత్య హాసన్ నిర్మించిన ఈ సినిమాతో.. సాయి మార్తాండ్ డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. రొమాంటిక్ కామెడీ జానర్ లో కేవలం రెండున్నర కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ ఫిల్మ్.. దాదాపు రూ.40 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సాయి మార్తాండ్ తో సినిమా చేయడానికి పలువురు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.
కిరణ్ అబ్బవరం నటించిన రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ 'కె ర్యాంప్'(K-Ramp)కి నూతన దర్శకుడు జైన్స్ నాని దర్శకత్వం వహించాడు. థియేటర్లలో నవ్వులు పూయించిన ఈ సినిమా.. యూత్ తో పాటు మాస్ ప్రేక్షకులను కూడా మెప్పించి మంచి విజయాన్ని అందుకుంది.
సున్నిత హాస్యంతో తెరకెక్కి చక్కిలిగింతలు పెట్టిన చిత్రం 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'(The Great Pre Wedding Show). ఈ మూవీతో రాహుల్ శ్రీనివాస్ డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అయ్యాడు. థియేటర్లలో మంచి ఆదరణ పొందిన ఈ సినిమా.. ఓటీటీలో అంతకు రెట్టింపు రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది.
'లిటిల్ హార్ట్స్' తర్వాత ఈటీవీ విన్ నుండి వచ్చిన మరో మూవీ 'రాజు వెడ్స్ రాంబాయి'(Raju Weds Rambai). ఈ సినిమాతో ప్రముఖ దర్శకుడు వేణు ఊడుగుల నిర్మాతగా మారగా, సాయిలు కంపాటి (బోస్) దర్శకుడిగా పరిచయమయ్యాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా రా లవ్ స్టోరీగా రూపొందిన ఈ మూవీ.. కంటెంట్ తో అందరినీ సర్ ప్రైజ్ చేసింది.
Also Read: 2025 రౌండప్.. బాక్సాఫీస్ విన్నర్ ఎవరు?
వరుస ఫ్లాప్స్ ని ఎదుర్కొంటూ, మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న ఆది సాయికుమార్ కి బిగ్ రిలీఫ్ ఇచ్చిన ఫిల్మ్ 'శంబాల'(Shambhala). ఈ మిస్టిక్ థ్రిల్లర్ కి కొత్త దర్శకుడు యుగంధర్ ముని దర్శకత్వం వహించాడు. మొదటి సినిమాతోనే.. కంటెంట్ ఉన్న డైరెక్టర్ అనిపించుకున్నాడు.
ఈ ఏడాది విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమాల్లో 'దండోరా'(Dhandoraa) ఒకటి. కులవివక్ష అనే సున్నితమైన అంశాన్ని తీసుకొని, భావోద్వేగాలతో కట్టిపడేశాడు నూతన దర్శకుడు మురళికాంత్.
అలాగే, 'గాంధీ తాత చెట్టు'తో పద్మావతి మల్లాది, 'రామం రాఘవం'తో ధనరాజ్, 'కన్యాకుమారి'తో సృజన్ అట్టాడ, 'సుందరకాండ'తో వెంకటేష్ నిమ్మలపూడి, 'పతంగ్'తో ప్రణీత్ ప్రత్తిపాటి కూడా డైరెక్టర్స్ గా మంచి మార్కులే కొట్టేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



