వారసులోస్తున్నారు బాబోయ్?
on Mar 23, 2015
ఇంట్రో
ఈ మధ్య కాలంలో మామూలు ప్రేక్షకులు సినిమాకెళ్లాలంటే ఎందుకొచ్చిన తలనొప్పిలే ఫీలవుతున్నారు. చూడ్డానికే చికాకుగా ఉండే ఫేస్ లను ఏం చూస్తాలేం గొణుక్కుంటున్నారు.ఓ లుక్ ఉండదు, ఓ స్టైల్ ఉండదు, కనీసం స్పష్టంగా మాట్టాలడలేరు....ఒక్క మాటలో చెప్పాలంటే నెత్తిమీద రూపాయి పెడితే...పావలాకి కూడా కొనుక్కోరు. అలాంటి వాళ్లందర్నీ తండ్రులు, బావలు, మావలు పనిగట్టుకుని ప్రేక్షకుల మీదకు వదిలేస్తున్నారు. మేం వదులించుకున్నాం....ఇక మీరు అనుభవించండంటూ పండగ చేసుకుంటున్నారు. పోనీ ఉన్నదున్నట్టు ఏమైనా అందామంటే ఫ్యాన్స్ రయ్ న లేస్తారాయె. హీరో తాతకు, తండ్రికి ఉన్న ఫ్యాన్స్ అంతా సదా మీ సేవలో అన్నట్టు ఫిక్సైపోతారు. వారెవ్వా ఏమి ఫేసు అచ్చం హీరోగా ఉంది బాసూ అంటూ పనికిరాని హీరోను కూడా ..నువ్వో సూపర్ స్టార్ అన్నట్టు చెవిలో పువ్వు పెడతారు. దీంతో అప్పటికే కాస్త పైకి చూసే ఆ హీరోగారు....ఏకంగా మునగ చెట్టెక్కి కూర్చుంటాడు.
వ్యాపార వేత్త తన కొడుకుని వారసుడిగా ప్రకటించుకున్నట్టే.... మా కొడుకుల్ని మేమూ వారసులుగా ప్రకటించుకుంటున్నాం అన్నాడో సీనియర్ హీరో. ఈ మాట వినే నవ్వాలో ఏడవాలో అర్థంకాలేదండీ. ఎందుకంటే బిజినెస్ మెన్ కొడుకు లావుగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, నల్లగా ఉన్నా...ఎత్తు పళ్లున్నా, బారు పొట్టున్నాఎవరికి నష్టం చెప్పండి. పైగా షాప్ కు వెళ్లి వస్తువు కొనుక్కుంటాం కానీ....దీని యజమాని ఎవరు? చూడ్డానికి బావున్నాడా లేదా అని ఆరాతీస్తామా? అంతెందుకు కనీసం మనకు వస్తువులు చూపించిన సేల్స్ మెన్ ని కూడా అస్సలు పట్టించుకోం. కానీ ఇక్కడలా కాదే.....దాదాపు రెండున్నర గంటల పాటూ హీరోగారిని వెండితెరపై తిలకించాలి. వెకిలగా నవ్వి నా.... పిచ్చి చేస్టలు చేసినా...నటిస్తున్నాం అనే భ్రమలో కేకలు పెట్టినా భరించాలి. ఎందుకండీ ప్రేక్షకులంటే మీకంత కక్ష.
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న...వస్తున్న వారసుల్లో వీళ్లు అన్నివిధాల సూపర్బ్ అనిపించేలా ఉన్నవాళ్లు ఎందరు?. కొందరైతే గజనీమహ్మద్ వారసులులా హిట్టు కోసం దాడులు చేస్తూనే ఉంటారు. కానీ యుద్ధంలో గెలిచే రోజే కనిపించదు. పోనీలే పాపం అంటూ జన్మానికో శివరాత్రిలా పలకరించి వెళ్లిపోతుంది ఓ హిట్. దీంతో భుజాలు గజాలు చేసుకుని వంద సినిమాలు హిట్టైనట్టు ఫీలై.....దానిగురించే చెప్పిందే చెబుతూ ప్రేక్షకుల మెదడు తొలిచేస్తుంటారు.
ఎందుకిలా మా ఖర్మ కాలిపోయింది అని తెలుగు ప్రేక్షకుడు ఏడిస్తే....మా ఇష్టం మేం వస్తాం...కటౌట్లు కట్టమని అడిగామా? దండలేయమని చెప్పామా? అని రివర్సవుతారు. పైగా సినిమా సెట్స్ పైకి వెళ్లినప్పటి నుంచీ ఫలానా స్టార్ డైరెక్టర్, ఫలానా గ్లామరస్ హీరోయిన్, అదిరిపోయే మ్యూజిక్....సినిమా అధ్బుతం.. ఈ ఆఫర్ దక్కడం నా అదృష్టం అని డబ్బా వాయించేస్తారు. దీంతో ఏ మూలో తనపని తాను చేసుకునే ప్రేక్షకుడు సైతం ఈ డబ్బాగోల విని వెళితే పోలే అనుకుంటాడు. కానీ వెళ్లాక కానీ తెలీదు...ఓపిక, సహనం పోయిందని.
పోనీ కొందరు చూడ్డం మానేసినంత మాత్రానా వాళ్లేమైనా ఆగిపోతారా అంటే అంతసీన్ లేదు. అభిమానులంతా కలసి మా ఫేవరెట్ కుటుంబ హీరో, మా కులం హీరో మేం కాకపోతే మరెవరు అంటూ.....బట్టలు చించేసుకుని మరీ ప్రచారం చేసేస్తుంటారు. ఫస్ట్ డే షో చూసి రాగానే అబ్బా ఏం ఉందిరా? ఆ సీన్ అదిరింది కదా.....ఈ పాట బావుంది కదా అని పక్కవాళ్లను తినేస్తుంటారు. పోనీ వాడి అభిప్రాయం వాడు చెప్పాడు...మనకు నచ్చలేదు అన్నామనుకోండి....ఒంటికాలిపై లేస్తాడు. పైగా నీకేం తెలుసు నీకు టేస్ట్ లేదంటారు. మరి ఇలాంటి అభిమానులుంటే అలాంటి హీరోలు రాక చస్తారా?
ఒక్క మాటలో చెప్పాలంటే తమ ఫేవరెట్ హీరో కొడుక తప్పని సరిగా క్లిక్కవాల్సిందే అని ఆరాటపడిపోతుంటారు. ఇలాంటి పిచ్చి అభిమానులను చూసే....స్టార్ హీరోలు దర్జాగా తమ వారసుల్ని రంగంలోకి దించేస్తున్నారు. పైగా నా వారసుడిని మీ చేతిలో పెడుతున్నాం అని నిలువునా ముంచేసే మాటలు చెప్పి....ఫ్యాన్స్ ని మరింత పెంచేస్తుంటారు. వస్తే వచ్చారు...ఏమైనా మెరుగు పడతారా అంటే అదీ ఉండదు. ఎలుగుబంటి తోలు ఎన్నాళ్లు ఉతికినా నలుపు నలుపే కాని తెలుపు కాదు అన్నట్టు ఎంత రుద్దినా ఎన్ని సినిమాలు తీసినా వాళ్ల తీరులో ఇసుమంతైనా మార్పురాదు. పైగా స్టార్ హీరో కొడుకుంటే....వాడికి ఏం వచ్చో అన్న సంగతి పక్కన పెట్టి స్టార్ డైరెక్టర్స్ క్యూ కట్టేస్తారు. మేం పరిచయం చేస్తాం అంటే మేం పరిచయం చేస్తాం అని పోటీ పడుతుంటారు. నిర్మాతగా ఎవరైనా ఆసక్తి చూపిస్తే సరే లేదంటే ఎలాగూ తాతలు, తండ్రులు సంపాదించిన ఆస్తి ఉండనే ఉంది. సో ప్రేక్షకులు ఏమైపోతే వారికేంటి చెప్పండి.
పైగా వంశం, చరిత్ర, బ్లడ్, బాబు.....ఇలాంటి పనికిమాలిన డైలాగ్స్ చెప్పి మరింత అసహనానికి గురిచేస్తుంటారు. అలాంటి టైమ్ లోనే నాయనా మహానుభావా.....నీ వంశం, నీ చరిత్ర నా కెందుకు..నీకేం వచ్చో-.నువ్వేం ఉధ్దరిస్తావో చెప్పు అని గట్టిగా అరవాలనిపిస్తుంది. నీ చరిత్ర బాగుండి సినిమా బాగోపోతే చూస్తామా ఏంటి. అసలు సంగతి మానేసి కొసరు సంగతెందుకు చెప్పవయ్యా.0 వాళ్ల డబ్బులు వాళ్లు ఖర్చు పెట్టుకుంటారు మధ్యలో మీకెందుకు అని మాత్రం అనకండి. ఎందుకంటే...వాళ్లు ఖర్చుపెట్టుకోవాలనుకుంటే ఏ వ్యాపారమో పెట్టుకోమనండి. కానీ భయపెట్టే ముఖాలదో బెదిరించే నటనతో వెండితెరను అల్లకల్లోలం చేసి, థియేటర్లో ప్రకంపనలు సృష్టిస్తామంటే చూస్తూ ఎలా ఊరుకోగలం.
ఇంతకీ ఓ డౌట్ ఏంటంటే....ఆడియో ఫంక్షన్లప్పుడు, సినిమా విడుదలకు ముందు ఆయా వారసుల పెద్దోళ్లు మా వాడు దుమ్ములేపాడు, నటనలో ఇరగదీశాడు అని తెగ బిల్డప్ లు ఇస్తుంటారు. నిజంగా వాళ్లు సినిమా చూసి ఉంటారంటారా? చూసినా వాళ్లకేం కాదులెండి..ఎందుకంటే చిన్నప్పటి నుంచీ అదే మొహాన్ని చూసి చూసి ఉన్నారు కాబట్టి అలవాటు పడిపోయి ఉంటారు. ఎటొచ్చి సడెన్ గా తెరపై చూసిన ప్రేక్షకుడి పరిస్థితే కుడితిలో పడ్డ ఎలకలా ఉంటుంది.
మరోవైపు సినిమా రిలీజయ్యే వరకూ సోది చెప్పేవాళ్లు కొందరైతే....థియేటర్ కు వచ్చిన తర్వాత ఓ నలుగురు అభిమానులను ఏరుకుని అబ్బా, వావ్, సూపర్బ్, అదిరిపోయింది, ఫెంటాస్టిక్, చూసే కొద్దీ చూడబుద్దేస్తది అంటూ మైక్ వాళ్ల నోట్లో పెట్టి బలవంతంగా అయినా చెప్పించేస్తుంటారు. అభిమానులు మాటలు నమ్మి థియేటర్ కు వెళ్లే ప్రేక్షకుడి ఫీలింగ్స్ ఎలా ఉంటాయో ఓ రోజైనా ఊహించారా? నలుగురి మధ్యా బాగోదని హుందాగా థియేటర్ నుంచి బయటకొస్తున్నారే కానీ..... సైడుకి పిలిచి సినిమా గురించి కదిపితే చాలు బాధంతా ఒక్కసారిగా వెళ్లగక్కేస్తారు. ఆనందం వెతుక్కుని వస్తే ఇంత అరాచకంగా ఆడుకుంటారా అని తిట్టని తిట్టుండదు.
రొటీన్ సినిమాలు చూసి బోర్ ఫీలవుతున్నారు కదా అని హీరోలెవరైనా ప్రయోగం చేశారనుకుండో. అంతే ఏదో పెద్ద చేయకూడని తప్పు చేసినట్టు తిట్టిపోస్తారు. వాడికి అంత అవసరమా అంటూ పెద్ద దండకం చదువుతారు. అటు అభిమానులైతే మరో అడుగు ముందుకేసి ఆ డైరెక్టర్ కి పైత్యం ముదిరిందని....ఆయన వల్లే తన అభిమాన హీరో సినిమా ఫ్లాప్ అయ్యిందంటూ తెగ మధనపడిపోతుంటారు. ఎన్నిసార్లు చూసినా తొడకొట్టడాలు, మీసం మెలేయడాలు, అవే పాటలు, సాగదీసే ఫైట్లు, వికారం తెప్పించే హీరో నటన.... ఇలా వరుసగా సినిమాలొచ్చినా చూస్తారు దండలేస్తారు కానీ ఒక్క ప్రయోగం చేసినా చూడరు.
మరో దౌర్భాగ్యం ఏంటంటే...తెలుగు ఇండస్ట్రీలో ఉండే పిచ్చి అభిమానులు మరే ఇండస్ట్రీలోనూ లేరు. కోలీవుడ్, శాండిల్ వుడ్, బాలీవుడ్ లోనూ ఉన్నా...హీరోను భిన్నంగా చూడాలనుకుంటారు. ప్రయోగం చేస్తే ఆదరిస్తారు. కానీ మనోళ్లు ఒకే పిచ్చిలో...మూస ధోరణిలో ఆలోచించి హీరోలను దేవుళ్లుగా మార్చేస్తారు. దీంతో వాళ్లుకూడా రెండు ఫైట్లు, మాడు ముద్దులు, ఆరుపాటలు అన్నట్టు తయారయ్యారు. అలాగని వారసులు బాబోయ్ అని మళ్లీ అందర్నీ అనలేం.....ఎందుకంటే ఓ ఇద్దరు ముగ్గురు హీరోలు మాత్రం సినిమా సినిమాకు మెరుగుపడుతూ, సిట్యుయేషన్ కు, కథకు తగ్గట్టు ట్యూన్ చేసుకుంటా ఫ్యాన్స్ ను పెంచుకుంటున్నారు.
మరో దురదృష్టకర విషయమేంటంటే.....దర్శకులు కూడా విషయం లేని స్టార్ హీరో కుటుంబాలపై పెట్టే దృష్టి చక్కని అభినయం కనబర్చే హీరోలపై పెట్టరు. దీంతో వీళ్లు పర్వాలేదబ్బా అనుకున్న హీరోలు చాలమంది ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంటే ఉన్నారు. వాళ్లు నటించిన నాలుగు సినిమాల్లో మూడు హిట్టైనా కనీసం వాళ్లవైపు కన్నెత్తి చూసే నాధుడే ఉండడు. కారణం వాళ్లు ఎవరకీ వారసులు కాకపోవడమే. కొందరు దర్శకులైతే కేవలం ఇద్దర్నో, ముగ్గుర్నో సలెక్ట్ చేసుకుని వారిచుట్టూ చక్కర్లు కొడతారు. కనీసం టాలెంట్ ఉన్న హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారన్న ఆలోచన కూడారాదో ఏంటో.
ఒకవేళ కష్టాలు పడి చిన్న హీరోల సినిమాలు తెరకెక్కినా....అవి విడుదల వరకూ డౌటే. విడుదలయ్యాక కూడా.....ఎంతో బావుంటే తప్ప కనీసం నాలుగు వారాలైనా థియేటర్లో ఉండవు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ సినిమా గురించి ఆ నోటా ఈ నోటా తెలిసే సరికే థియేటర్ నుంచి తీసేస్తారు. ఇంట్రెస్ట్ గా అడుగుపెట్టి....హిట్టందుకున్నా వారి భవిష్యత్ ఏంటో వాళ్లకే తెలినీ డైలమా.
అయితే వెండితెరపై వారసుల దాడి ఇవాల్టితోనో, రేపటితోనే ఆగేది కాదు. రోజురోజుకీ తెరపై కోతి ముఖాలు ఎక్కువవుతాయే కానీ తగ్గవు. కానీ ప్రేక్షకులు కోరుకునేది ఒక్కటే. ఎవరి పేరు చెప్పుకుని ముఖానికి రంగేసుకున్నా పర్వాలేదు. కానీ నిన్ను నువ్వు నిరూపించుకో.....నిలదొక్కుకో అని సూచిస్తున్నారు. అటు వారసలును సైతం మోసే అభిమానులకు ఒకటే సూచన.....టాలెంట్ ఉంటే తప్పని సరిగా ఉత్సాహాన్నివ్వండి. నెత్తిన పెట్టుకుని మోయండి. కానీ విషయం లేకున్నా మా హీరో కొడుకనో, మనవడో, బామ్మర్దనో, అల్లుడనో మాత్రం దయచేసి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే అవకాశం ఇవ్వకండి.
అయితే ఇప్పుడిప్పుడే సినీప్రియుల్లో కొందరు చక్కని అవగాహనతో అలోచిస్తున్నారు. హీరో ఎవరైతే ఏం...సినిమా బావుందా లేదా అని ఒక్క ముక్కలో తేల్చిపడేస్తున్నారు. ఇదే ఉత్సాహం కొనసాగితే భవిష్యత్ లో కేవలం టాలెంట్ ఉన్న వారినే తెరపై చూసే రోజు వస్తుంది. ఆరోజు తొందర్లేనే రావాలని కోరుకుందాం.
Also Read