'ది బర్త్ డే బాయ్' మూవీ రివ్యూ
on Jul 19, 2024
సినిమా పేరు: ది బర్త్ డే బాయ్
తారాగణం: రవికృష్ణ, రాజీవ్ కనకాల, సమీర్, మణి, రాజా అశోక్, విక్రాంత్, రాహుల్, అరుణ్ తదితరులు
సంగీతం: ప్రశాంత్ శ్రీనివాస్
డీఓపీ: సంకీర్త్ రాహుల్
ఎడిటర్: నరేష్
రచన, దర్శకత్వం: విస్కీ
నిర్మాత: భరత్
విడుదల తేదీ: జూలై 19, 2024
వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందే సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అలా ఓ పుట్టినరోజు వేడుకలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిన చిత్రం 'ది బర్త్ డే బాయ్'. ప్రచార చిత్రాలతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం.
కథ:
ఒకే ఊరికి చెందిన బాలు, అర్జున్, వెంకట్, సాయి, సత్తి అనే ఐదుగురు స్నేహితులు.. అమెరికాలో ఒకే ఫ్లాట్ లో ఉండి చదువుకుంటూ ఉంటారు. అక్కడ వారి జీవితాలు సరదాగా, సాఫీగా సాగిపోతుంటాయి. అయితే, బాలు పుట్టినరోజు నాడు వారు చేసే అత్యుత్సాహం వారి కొంప ముంచుతుంది. పీకల దాకా తాగి.. బర్త్ డే బంప్స్ పేరుతో శృతిమించి చేసిన అల్లరి కారణంగా.. బాలు చనిపోతాడు. దీంతో ఏం చేయాలో తెలియక.. అమెరికాలోనే ఉండే అర్జున్ అన్నయ్య భరత్ (రవికృష్ణ)కు ఫోన్ చేసి రమ్మంటారు. అమెరికాలో స్ట్రిక్ట్ రూల్స్ ఉండటం, తేడా వస్తే అందరి భవిష్యత్తు ప్రమాదంలో పడే పరిస్థితి ఉండటంతో.. జరిగిన విషయం చెప్పి బాలు పేరెంట్స్ (రాజీవ్ కనకాల, ప్రమోదిని) ని ఇండియా నుంచి అమెరికాకు రప్పిస్తారు. మరోవైపు భరత్ తో పాటు అతని స్నేహితుడు, ఆ ఇంటి రెస్పాన్సిబిలిటీ చూసుకుంటున్న ప్రవీణ్ (సమీర్) వస్తాడు. అయితే అతను ఇది అనుకోకుండా జరిగినట్టు లేదని, మర్డర్ లా ఉందని అనుమానిస్తాడు. అసలు బాలు ఎలా చనిపోయాడు? అతని మరణం వెనుక ఏదైనా కుట్ర ఉందా? ఈ ఘటన నుంచి బాలు స్నేహితులు బయటపడగలిగారా? చివరికి ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాలి.
విశ్లేషణ:
ఇటీవల పుట్టినరోజు వేడుకలు శృతి మించుతున్నాయి. బర్త్ డే బంప్స్ పేరుతో కొందరు యువత చేసే రచ్చ కారణంగా.. గాయాల పాలవ్వడమో, చనిపోవడమో వంటివి జరుగుతున్నాయి. అలా నిజ జీవితంతో బర్త్ డే సెలబ్రేషన్స్ లో జరిగిన ఒక ఘటనను ఆధారంగా తీసుకొని, దాని చుట్టూ కల్పిత కథను అల్లుకున్నాడు దర్శకుడు. అసలు కథలోని వెళ్ళడానికి దర్శకుడు ఎక్కువ సమయం తీసుకోలేదు. అమెరికాలో ఫ్రెండ్స్ అల్లరి, బర్త్ డే సెలబ్రేషన్ కాసేపు చూపించి.. బాలు మరణంతో మొదటి పావుగంటకే మెయిన్ స్టోరీలోకి తీసుకెళ్లారు. అప్పటిదాకా ఫుల్ గా ఎంజాయ్ చేసిన ఫ్రెండ్స్.. బాలు చనిపోవడంతో ఒక్కసారిగా షాకి కి గురవ్వడం, ఏం చేయాలో తెలియక భరత్ ని పిలిపించడం వంటి సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగా నడిచింది. దీని నుంచి వాళ్ళు ఎలా బయటపడతారు? నెక్స్ట్ ఏం జరుగుతుంది? అనే ఉత్కంఠను కలిగిస్తూ ఫస్ట్ హాఫ్ ని నడిపించిన తీరు బాగుంది. ఇక బాలు అనుకోకుండా చనిపోయాడా? హత్యనా? అనే అనుమానాన్ని రేకెత్తిస్తూ ఫస్ట్ హాఫ్ ని ముగించిన తీరు మెప్పించింది. అయితే ఫస్ట్ హాఫ్ ని ఇంట్రెస్టింగ్ గా నడిపించిన డైరెక్టర్.. సెకండ్ హాఫ్ విషయంలో మాత్రం కాస్త తడబడ్డాడు. ట్విస్ట్ లు ఆకట్టుకున్నప్పటికీ.. రొటీన్ ఫ్లాష్ బ్యాక్, సాగదీత సన్నివేశాల కారణంగా సెకండ్ హాఫ్ తేలిపోయినట్టుగా అనిపించింది. సెకండ్ హాఫ్ రైటింగ్ విషయంలో మరింత కేర్ తీసుకుంటే.. అవుట్ పుట్ ఇంకా మెరుగ్గా ఉండేది.
సాంకేతికంగా సినిమా బాగానే ఉంది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ నీట్ గా ఉంది. అయితే సెకండాఫ్ లో కొంత ట్రిమ్ చేస్తే ఇంకా ఎఫెక్టివ్ గా ఉండేది. నిర్మాణ విలువలు పరవాలేదు. ఇది అమెరికా జరిగిన కథగా చూపించారు. కానీ సినిమా చూస్తున్నప్పుడు ఇది ఇండియాలోనే చిత్రీకరించారనే విషయం అర్థమైపోతుంది.
నటీనటుల పనితీరు:
లీడ్ యాక్టర్ గా రవికృష్ణ మంచి నటన కనబరిచాడు. రాజీవ్ కనకాల ఎప్పటిలాగే తన మార్క్ చూపించాడు. సమీర్, విక్రాంత్, మణి, రాజా అశోక్, రాహుల్, అరుణ్ తమ నటనతో ఆకట్టుకున్నారు.
ఫైనల్ గా..
వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ మర్డర్ మిస్టరీ ఫిల్మ్.. బాగానే థ్రిల్ ని పంచుతుంది. సరదా శృతిమించితే ఒక్కోసారి జీవితాలు ఎలా తలకిందులవుతాయి అనే పాయింట్ తో రూపొందిన ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు.
రేటింగ్: 2.5/5
Also Read